ఒకప్పుడు అభిమానం అనేది ఆదరణ, ప్రేమ, గౌరవభావాలతో ఉండేది. కానీ, ఇప్పుడు అది తన పరిధులు, పరిమితులను దాటి మానసిక రోగంగా మారింది. విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చే ఫ్యానిజంగా రూపాంతరం చెందింది. మన దేశంలో ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర ఘటనలే అందుకు తార్కాణం.
కొన్ని నెలల కిందట హైదరాబాద్లోని ఓ సినిమా థియేటర్లో నటులను చూసేందుకు వేల మంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సెలబ్రిటీలను చూసేందుకు జనం ఎగబడటం, థియేటర్ యాజమాన్యం సరైన భద్రతాచర్యలు చేపట్టకపోవడం, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం ఫలితంగా ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. తాజాగా బెంగళూరులో లక్షల మంది పాల్గొన్న క్రికెట్ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు.
తమ అభిమాన టీం గెలిచిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లిన 50 మందికిపైగా గాయపడ్డారు. ఇలాంటి దుర్ఘటనల్లో తప్పెవరిది? గుడ్డిగా సెలబ్రిటీలను ఆరాధించే అభిమానులదా? భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ యంత్రాంగాలదా? కార్యక్రమాలు నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలదా? తప్పెవరిదైనా కావచ్చు.. బాధితులు మాత్రం సాధారణ ప్రజలే. తాము చేయని తప్పునకు జీవితాన్ని కోల్పోవడం ఎంత బాధాకరం!
అభిమానం అంటే ప్రేరణ, ఆదర్శం. కానీ, ఫ్యానిజం అంటే తన జీవితాన్ని మరచిపోయి మరొకరిలా జీవించడం. ఇదొక మానసిక వ్యాధి. చాలా మంది ఫ్యానిజానికి బానిసై తమ వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నకు ‘ఫలానా సెలబ్రిటీ అభిమాని’ అని చెప్పుకొనేందుకు వెంపర్లాడుతున్నారు. చదువు, కెరీర్, కుటుంబ బాధ్యతల కంటే సినిమా రిలీజ్, హీరో, క్రికెట్ తదితర విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సెలబ్రిటీ ైస్టెల్, డైలాగ్లు, దుస్తులు, మాట్లాడే తీరు అన్నింటినీ అనుకరిస్తూ, మరో ప్రపంచంలో బతుకుతూ తమ జీవితాన్ని పూర్తిగా మరచిపోతున్నారు.
విదేశాల్లో అభిమాన సంస్కృతి ఇలా ఉండదు. వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కోసం అక్కడి అభిమానులు రోడ్డెక్కలేదు. న్యూజిలాండ్, అమెరికాలోనూ అంతే. అక్కడ అభిమానాన్ని ఆచరణాత్మకంగా, సమతుల్యంగా చూస్తారు. విదేశాల్లో అభిమానం ఒక అనుభవమే. కానీ, మన దేశంలో అది బానిసత్వంగా మారుతున్నది. అక్కడ సెలబ్రిటీలు కూడా దేవుళ్లలా కాదు, ప్రజల్లో ఒకరిలా మాత్రమే ఉంటారు.
ఒకరిని చూసి ఊగిపోయేముందు ‘నేనెందుకు హీరో కాలేను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు కూడా ఏదో ఒక రంగంలో మేటి కావచ్చు కదా! ఆ రంగంలో మీరెందుకు హీరో కాలేరు? వాళ్లు శ్రమించారు.. క్రికెటర్లయ్యారు. వీళ్లు కష్టపడ్డారు.. నటులయ్యారు. వాళ్లు కొత్త దారులు వెతికారు.. నాయకులయ్యారు. ప్రయత్నిస్తే మీరెందుకు సాధించలేరు? వాళ్ల విజయాలను చూసి స్ఫూర్తి పొందడంలో తప్పు లేదు. కానీ, వాళ్ల కోసం జీవితాన్ని పణంగా పెట్టడం తప్పు. అభిమానం మార్గనిర్దేశం కావాలే తప్ప, మరణం కాకూడదు. మీ జీవిత లక్ష్యాలు, మీ కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తు కోసం శ్రమించండి. మీ లక్ష్యాలు, కష్టాలు, స్వప్నాలను గౌరవించండి. యువత మారితేనే దేశం మారుతుంది.
-జి.అజయ్ కుమార్