రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేస్తామన్నవి 1000 రోజులు గడిచినా చేయలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు గానీ, అందులో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది? వారు ఆ మాట అన్నది ఓటర్లను మభ్యపెట్టి అధికారాన్ని సంపాదించుకోవటానికే తప్ప, హామీలను నెరవేర్చటానికి కాదు. వారికి అసలు ఆ ఉద్దేశం ఉన్నదనుకోవటమే పొరపాటు. ఇది ఒకటి కాగా, తమ మితిమీరిన హామీలను అమలు చేయటం ఆచరణలో సాధ్యం కాదనే రెండవ మాట కూడా వారికి ముందుగా తెలియదనుకోవటం మరొక పొరపాటు అవుతుంది.
కాంగ్రెస్ అధికారానికి వచ్చి సగకాలం గడిచింది. మరొక సగకాలం ఉన్నది. మొదటి సగంలో చేయనివి రెండవ సగంలోనైనా చేయగలరా? ఆ పని జరుగుతుందేమోనని ఆశిస్తే అది ఇంకొక పొరపాటు అవుతుంది. ఎందుకో తెలియాలంటే వారి గ్యారెంటీ కార్డును, అభయహస్తం మ్యానిఫెస్టోను సంపాదించి చదివి చూడండి. అట్లా చదువుతూ ఈ మొదటి సగకాలంలో జరిగిందే మిటో, ఇంకా మిగిలి ఉన్నదేమిటో అంచనాలకు రండి. ఆ తర్వాత, ఇంకా మిగిలినవి రానున్న సగకాలంలో అమలు చేయగలరేమో కూడా ఆలోచించండి. ఇప్పుడు ఒక పని చేయాలి. 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన దినపత్రికల మొదటి పేజీలో పూర్తి పేజీ అడ్వర్టయిజ్మెంట్ ఒకటి విడుదల చేసింది. అందులో, తాము ఈ సగకాలంలో సాధించినవంటున్న 16 అంశాలను పేర్కొన్నారు. ఆ ప్రకటనను ఒకవైపు, వారి గ్యారెంటీ కార్డును, పూర్తి మ్యానిఫెస్టో ప్రతిని మరొకవైపు ఉంచి పోల్చుకుని చూడండి. అప్పుడు అన్నింటికన్నా ముందు మన ముఖం మీద కొట్టినట్టు కనిపించేది, ఆ ప్రకటనలో ‘గ్యారెంటీ కార్డు’ అనే మాటైనా కనిపించదు. మ్యానిఫెస్టోలోని ఇతర అంశాలు అరకొరగా తప్పలేవు.
తమకిచ్చిన హామీల అమలును కోరుతూ వేర్వేరు వర్గాల వారు ఏడాది కాలంగా వరుసగా ఆందోళనలు జరుపుతున్నారు. కానీ 1000 రో జులు గడిచినా ఆయా హామీల జోలికైనా ప్రభు త్వం వెళ్లటంలేదు. పైగా, వాటిని అమలు చేయకపోవటం ఒకటైతే, దాటవేయటం, అంతకుమిం చి అబద్ధాలు చెప్పటం మరొకటి అవుతున్నది. కాంగ్రెస్ గెలువటానికి ముఖ్య కారకులు యువ త, రైతులు, మహిళలు, వృద్ధులు అని తెలిసిందే.
గ్యారెంటీల కార్డులో, ఇతరత్రా మ్యానిఫెస్టోలో ఈ వర్గాల వారికి ఆకర్షణీయమైన హామీ లు అనేకం ఉన్నాయి. నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం లభించేవరకు నిరుద్యోగభృతి, రైతు లూ, కౌలుదార్లకు ఎకరానికి ఏడాదికి రూ.15, 000 చొప్పున రైతుభరోసా, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000, మహిళలకు ప్రతినెలా రూ.2,500, పేదవారి పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద నగదు సొమ్ముతోపాటు తులం బంగారం, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల పెంపు ఎటువంటి ఆశలను కలిగిస్తాయో, వారి స్థితిగతులను బట్టి అదెంత సహజమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ తరగతుల ఓట్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా లభించటం వల్లనే కాంగ్రెస్ గెలిచింది. కానీ 1000 రోజులు పూర్తయిన నాటి అడ్వర్టయిజ్మెంట్లో గానీ, ప్రసంగాల్లో గానీ ఇందులో ఏ ఒక్క హామీ గురించి కూడా ప్రస్తావించకపోవటం గమనించదగ్గది.
అది చాలదన్నట్టు అబద్ధాలు కూడా చోటుచేసుకున్నాయి. ఒక పెద్ద ఉదాహరణ ఉద్యోగాల భర్తీ. ప్రకటనలో 72,000 భర్తీ, మరొక 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు. రెండింటిని కలిపినా 79,437 అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం స్వయంగా ఇచ్చింది 16,000 మాత్రమేనని స్వయంగా నిరుద్యోగులే పదేపదే చెప్తున్నారు. అదికూడా మొదటి ఏడాదిలో గాక సగం పాలన గడిచేసరికి. ఆ విధంగా ఈ మాటలో ఎన్ని అబద్ధాలున్నాయో చూడవచ్చు. నిరుద్యోగులు మొదటి ఏడాది పూర్తయినాక ఈ వైఫల్యాన్ని ఎన్నిమార్లు ఎత్తిచూపినా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని, వారి ఢిల్లీ నాయకుల నుంచి మొదలుకొని, కాంగ్రెస్‌కు నిరుద్యోగులతో ప్రచారం చేయించిన, మహా మేధావుల వరకు, మాజీ విప్లవకారుల వరకు, కెరీరిస్టు ఎన్జీవోల వరకు ఎవరూ కిక్కురుమనరు. అంతన్నా దారుణం, పైన పేర్కొన్న అడ్వర్టయిజ్మెంట్లో వలెనే దొంగలెక్కలతో నిర్లజ్జగా అబద్ధాలు వల్లె వేస్తూనే ఉంటారు. ఇదంతా, అశోక్‌నగర్‌కు వెళ్లిన ఢిల్లీ నాయకునికి తెలియదనుకోగలమా? పైగా, ఇక్కడి సమాచారాలు అందజేసేందుకు ఆయనకు హైదరాబాద్‌లో పరమవీర గాంధేయవాది అనే ప్రచారం గల ప్రతినిధి ఒకరున్నారు కూడా. కానీ ఆ నాయకుడు తమ హామీని అమలు చేయించరు, అప్పటి వలెనే మరోసారి వచ్చి తమతో మాట్లాడాలనే నిరుద్యోగుల విన్నపాలకు స్పందించరు, అక్కడి నుంచైనా మాట్లాడరు. తెలంగాణను మినహాయించి దేశమంతటా గల నిరుద్యోగుల గురించి, జెన్‌జీ గురించి మాత్రం నాయకీయమైన హావభావాలతో గొంతు చించుకుంటుంటారు.
అందులోనూ ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఇక్కడ మ్యానిఫెస్టో విషయంలో వలెనే జాతీయస్థాయిలోనూ తమ పరిపాలనలు, మ్యానిఫెస్టోల అమలు, ఇతరత్రా మౌలికమైన పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు దశాబ్దాల కిందటనే మొదలయ్యాయి. గతకాలపు ఎన్నికల పరాజయాలు అట్లుండగా 2014 నుంచి వరుస పరాభవాలు ఆ విధమైన వైఫల్యాల వల్లనే. ఈ విధమైన ప్రజావ్యతిరేక విధానాలు, వారికి మొహంచాటు వేయటాలు, అబద్ధాల వల్లనే. ఆ విధంగా చూసినప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుకు, ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వపు తీరుకు పోలికలు చాలా ఉన్నాయి. అసభ్యంగా మాట్లాడటం ఒక్కటి మినహాయిస్తే, నాయకత్వ వైఫల్యాలు కూడా అక్కడా ఇక్కడా ఒకటే.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తన స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలను, రాజ్యాంగ విధులను మరచిపోవటం నెహ్రూ అనంతర కాలం నుంచే మొదలైంది. అప్పటి నుంచి గెలుపు ఓటముల సంగతి ఎట్లున్నా ఈ మరచిపోవటం మాత్రం ఆగలేదు. అదే నేటి రాహుల్‌గాంధీ కాలం వరకు కొనసాగుతున్నది. అయినా తాము రాజ్యాంగప్రతిని పట్టుకుని తమాషాలు చేస్తుంటారు. ఇప్పుడు జాతీయస్థాయిలో గానీ, తెలంగాణ సహా రాష్ర్టాల్లో గానీ ఏకైక లక్ష్యం ఎన్నెన్ని అబద్ధపు హామీలైనా సరే ఇచ్చి, ఎన్నెన్ని పార్టీలతోనైనా జతగట్టి అధికారానికి రావటం. అధికారాన్ని, సంపదలను అనుభవించటం. నిజానికి ప్రజలకు, వేర్వేరు తరగతులకు తిరిగి దగ్గరయ్యేందుకు సవ్యమైన మార్గాలు లేకపోలేదు.
కానీ ప్రజలకన్నా, రాజ్యాంగం కన్నా, గతకాలపు ఆదర్శాల కన్నా, నెహ్రూ కాలపు విధానాల కన్నా అధికారం, సంపదలు ప్రధానమనుకునే దశ ఒకసారి మొదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక వెనుదిరిగి చూడలేదు. నెహ్రూ తర్వాత ఒక్కొక్క తరం గడిచేకొద్దీ అదే పతన మార్గంలోనే వారికి సుఖసంతోషాలు కనిపిస్తూ పోయాయి. ఎన్నెన్ని నీతులు మాట్లాడి ఎంత ఆర్భాటాలు చేసినా రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశం చూస్తున్నదీ అదే.
సరిగ్గా అదే మనకు ప్రస్తుత సందర్భంలో కనిపిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, లేదా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు. తెలిసి అబద్ధపు హామీలు, దీపం ఉండగానే మ్యానిఫెస్టోలు, ముఖం చాటువేయటాలు, బుకాయింపులు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటాలు, అనైతికమైన పొత్తులు, మితిమీరిన ఎన్నికల ఖర్చులు, ప్రజలు అమాయకంగా నమ్ముతారనుకొని నీతిసూత్రాల వల్లింపులు. అందుకే రాహుల్‌గాంధీ నాయకత్వాన ఆయన పార్టీ ప్రజలకు చేరువ కావటంలేదు, బలపడటంలేదు. అది సాధ్యమయ్యేది కాదుగూడా. సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ కూడా. 100 రోజుల గ్యారెంటీతో ఇచ్చిన హామీలను 1000 దినాలు గడిచినా అమలు పరచలేనివారు, అబద్ధపు అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వటంలో, దాటవేతల ఉపన్యాసాలు చెప్పటంలో ఆశ్చర్యపోవలసింది ఏమున్నది ఏలికా!