 
                                                            2025, జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 275 మంది మరణించగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో భారత విమానయాన రంగం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గ్రౌండెడ్ విమానాలు (కార్యకలాపాలు నిలిచిపోవడం), పైలట్లపై ఒత్తిడి, లోపభూయిష్ట ఇంజిన్లు, మౌలిక సదుపాయాల లేమి మధ్యన భారత్‌లో ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి.
భారత విమానయాన రంగాన్ని వేధిస్తున్న అతిపెద్ద సవాళ్లలో ప్రాట్ అండ్ విట్నీ (పీ అండ్ డబ్ల్యూ) గేర్డ్ టర్బో ఫ్యాన్ ఇంజిన్ల నిరంతర వైఫల్యం ప్రధానమైనది. విమానాలు గ్రౌండ్ కావడానికి ఈ ఇంజిన్ల సమస్య ముఖ్యకారణం. ఈ సమస్య కారణంగానే గో ఎయిర్‌లైన్స్ (గో ఫస్ట్) విమానయాన సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో తన ఫ్లీట్‌లోని సగానికి పైగా విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది. భారత్‌లో అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన ఇండిగో కూడా ఈ ఇంజిన్ సమస్యల బారినపడింది. 2025 జనవరి 30 నాటికి ఇండిగోకు చెందిన సుమారు 60-70 విమానాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. పీ అండ్ డబ్ల్యూ కంపెనీకి చెందిన జీటీఎఫ్ ఇంజిన్లలో పౌడర్ మెటల్ కంటామినేషన్ కారణంగానే వీటిలో ఎక్కువ విమానాలు నిలిచిపోవడం గమనార్హం. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ప్రకారం.. 2025 మార్చి నాటికి భారతదేశ మొత్తం వాణిజ్య విమానాల్లో సుమారు 133 విమానాలు (16 శాతం) నేలకే పరిమితమయ్యాయి.
2016 మార్చిలో ఏ320 నియో విమానాలను తన ఫ్లీట్‌లో చేర్చుకున్న నాటి నుంచి ఇండిగో ఇంజిన్ల సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ రకం విమానాలు గాల్లో ఉండగా ఇంజిన్ సమస్య తలెత్తి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వస్తున్నది. దీని నుంచి బయటపడేందుకు ఇండిగో క్రమంగా సీఎంఎఫ్ ఇంజిన్లకు మారుతున్నది.
2025 ఏప్రిల్ నాటికి ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లతో నడిచే విమానాలు ఇండిగో ఫ్లీట్‌లో 30 శాతం కంటే తక్కువకు చేరుకున్నాయి. ఆ సంస్థ ఏ320 విభాగంలో ఈ రకం ఇంజిన్ విమానాలు 33.6 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ కొత్త విమానాల కోసం సీఎంఎఫ్ ఇంజిన్ల వైపే ఇండిగో మొగ్గుచూపవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
భారత విమానయాన రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న మరో సమస్య పైలట్ల కొరత. 2023 ఆగస్టులో 43 మంది పైలట్లు ఆకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆకాశ ఎయిర్ కుదుపునకు గురైంది. పైలట్ల కొరత కారణంగా 2023 ఆగస్టులో 632 రూట్లను ఆకాశ రద్దు చేయాల్సి వచ్చింది. తత్ఫలితంగా 2023 జూలైలో 5.2 శాతంగా ఉన్న ఆకాశ దేశీయ మార్కెట్ వాటా ఆగస్టు నాటికి 4.2 శాతానికి పడిపోయింది. ఎయిర్ ఇండియా తాజా దుర్ఘటన గత విషాదాలను గుర్తుకుతెచ్చింది. 2010లో మంగళూరులో జరిగిన దుర్ఘటనలో 158 మంది మరణించారు. 2024 జూన్ 28న ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1లో ఒక భాగం కూలిపోయి ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.
2012లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనం ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. ఒకప్పుడు 27 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఈ ఎయిర్‌లైన్స్ లగ్జరీ సర్వీస్ మోడల్ భారతదేశ మార్కెట్‌కు సరిపోలేదు. కింగ్‌ఫిషర్ రూ.9,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. వేతనాలు చెల్లించడంలో, అప్పులను తీర్చడంలో విఫలమవడంతో 2012 అక్టోబర్‌లో ఈ సంస్థ లైసెన్స్ రద్దు అయ్యింది. జెట్ ఎయిర్వేస్ మరో విఫల కథ. 1993లో ప్రారంభమైన ఈ సంస్థ అప్పులు పెరగడం, ఇతర సంస్థల నుంచి పోటీని తట్టుకోలేకపోవడం, తక్కువ ఖర్చు వ్యూహం విఫలమవడంతో 2019లో కుప్పకూలిపోయింది.
ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా సైతం నిరంతరం నష్టాలను చవిచూసింది. 2021 నాటికి ఈ సంస్థకు రూ.70 వేల కోట్ల నష్టాలు ఉన్నాయి. 2022 జనవరిలో టాటా గ్రూప్ రూ.18,000 కోట్లకు ఈ ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేశాక కొంత ఆర్థిక పురోగతి సాధించింది. ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌కు 104 విమానాలనూ జోడించింది. దీర్ఘకాలం గ్రౌండెడ్‌గా ఉన్న విమానాలను ఆకాశమార్గం పట్టించింది. 2023లో 470 కొత్త జెట్ల కోసం ఆర్డర్ కూడా ఇచ్చింది.
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకారం.. భారతదేశం 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఎదిగే అవకాశముంది. 2040 నాటికి 1.3 బిలియన్ల మంది భారత్‌లో ప్రయాణిస్తారని ఓ అంచనా. ఇప్పటికే విమానాల ఆలస్యం, రూట్ల రద్దు, టిక్కెట్ ధరలు అధికంగా ఉండటం, మెయింటెనెన్స్ సామర్థ్యం లేకపోవడం, నిపుణులు, పైలట్ల కొరత తదితర సమస్యలతో దేశ విమానయాన రంగం కొట్టుమిట్టాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆపరేషనల్ క్రమశిక్షణ, భద్రతకు పెద్దపీట వేసే సంస్కృతి, ఆర్థిక వివేకం, కార్మిక అనుకూల వాతావరణం తదితర అంశాలు విమానయాన రంగం మొదటి ప్రాధాన్యాంశాలుగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
– ఎడిటోరియల్ డెస్క్ 
(‘ది ఎకనామిక్ టైమ్స్’ సౌజన్యంతో…)
 
                            