నవ్వుతూ ఒక చినుకు బొట్టు
నేలను ముద్దాడగానే
విత్తు మోముపై చిగురు సంతోషం
పచ్చగా విచ్చుకుండాది
మండే ఎండ కాస్త మొహం తిప్పుకొన్నాక
తొలి వాన మబ్బు రెక్కలిప్పుకొని
చిరు జడిగా పుడమిపై వాలినాది
పల్లె ముంగిళి నాగళ్ళ కర్రలతో
కోలాటమేస్తూ కదిలినట్టు
దుక్కి దున్నే సందడిలో మునిగినాది
వాన దెబ్బకు కాస్త
వడదెబ్బ తల వంచుకుని వెళ్లాక
తడిబారిన సేను చల్లబడినాది
వొట్టిపోయిన చేను
మెత్తబడి నీళ్లు నింపుకొన్నాక
ఎండమావి ఆవిరైపోతూనే
వీడ్కోలు పలికి బయలెళ్లినాది
తొలిచినుకు తొలకరితో
ప్రకృతి నీళ్లోసుకున్నాక
పుడమి మొక్కకు జన్మనిచ్చినాది
తాపము చల్లారి
పనిముట్లు బయటికి వచ్చినాక
కరువు అరువు తలొంచి కదిలినాది
నేలపట్టు పచ్చిక పరుచుకున్నాక
ముంగారు ముచ్చటంతా
బంగారు పంట కావాలని
రైతు మోముపై పసిడి వెన్నెల
విరబూసినాది
తొలి చినుకై నాంది పలికినాది
నరెద్దుల రాజారెడ్డి: 9666 016636