విశాల భారత ఉపఖండ చరిత్రలో మగధ తరువాత విలసిల్లినది మన శాతవాహన సామ్రాజ్యం. దాదాపు మూడు శతాబ్దాల పాటు పరిఢవిల్లిన ఈ సామ్రాజ్యానికి పునాదులు మరో వందేండ్ల కిందటే మన కోటలింగాలలోనే పడ్డాయి. భారత దేశ చరిత్ర అనగానే మగధ తరువాత గుప్త సామ్రాజ్యాన్ని ప్రస్తావిస్తారేతప్ప, దక్షిణాదిన అప్రతిహతంగా విస్తరించి, ఉత్తరాదినా రెపరెపలాడిన శాతవాహన కేతనాన్ని గుర్తించరు. మగధకు రాజధాని పాటలీపుత్రమైతే, శాతవాహనుల కేంద్రం కోట లింగాల. కానీ శాతవాహనుల మాదిరిగానే కోటలింగాల కూడా విస్మరణకు గురైంది.
తెలంగాణను పాలించిన మొదటి రాజులు ఎవరు? మొదటి ఆధారాలు ఎవరివి మనకు దొరుకుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు కొన్ని జవాబులున్నాయి, కొన్నిటికి ఇంకా శోధించాల్సి ఉంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి తెలంగాణ మహాజనపదంగా మారింది. మౌర్యుల తరువాత, శాతవాహనుల ముందు అంటే సుమారు క్రీస్తు పూర్వం మూడు నుండి ఒకటో శతాబ్దం వరకు తెలంగాణలో ఉన్న రాజులెవరు? ఎక్కడి నుండి పాలించారు? ఏ పురావస్తు ఆధారాలు వారి కథను చెపుతాయి వంటి ప్రశ్నలకు జగిత్యాల జిల్లా గోదావరీ తీరంలోని కోటలింగాలలోని భూమి పొరలు జవాబిస్తాయి.
కోటలింగాలలో సంగనభట్ల నరహరి అనే స్థానిక పోస్ట్ మాస్టర్‌కు 1970 దశకంలో దొరికిన నాణేలు దక్కన్ చరిత్రను, తెలంగాణ చరిత్రను మార్చేసినాయి. పురావస్తు శాఖకు చెందిన పి. వి. పరబ్రహ్మ శాస్త్రి ఆ నాణేలను మొదటిసారి అధ్యయనం చేసి శాతవాహన పూర్వ నాణేలను రికార్డు చేసారు. అప్పటివరకు మనకున్న శాతవాహనుల ఆధారాల కంటే ముందు ఆధారాలు దొరకడం ఒక విశేషం. శాతవాహనుల కంటే ముందటి రాజులూ, శాతవాహన రాజుల నాణేలు ఒకే గ్రామంలో దొరకడం రెండవ విశేషం. దీనిని ఆర్కియాలజీ పరిభాషలో కల్చరల్ సీక్వెన్స్ అంటే భిన్న కాలాల నిరంతరతను సూచించే క్రమం అంటాం. అప్పటినుండి ఇప్పటివరకు కోటలింగాలలో దొరికిన నాణేలు అధికారికంగా నమోదైనవి 500 ఉంటే, అనధికారికంగా నాణేల సేకరణకర్తలు, ఇతరులకు దొరికినవి కొన్ని వేలు ఉంటాయి.
కోటలింగాలలో గోబద, నరన, సిరివయస, కంవయస, సామగోప అనే ఐదుగురు రాజుల నాణేలు దొరికినయి. ఇవి కాకుండా పాక్షికంగా పేర్లు ఉన్న నాణేలు దొరికినయి. ఇది తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయి. ఈ నాణేలు దాదాపు క్రీస్తు పూర్వం 3-2 శతాబ్దాలకు చెందినవి.
గోబద: తెలంగాణలో మొదటి సారి తన పేరుతో నాణేల్ని జారీ చేసిన ఘనత గోబదకు దక్కుతుంది. ’రణో గోబదస’ అని బ్రాహ్మీ లిపిలో ముద్రించిన సీసం, రాగి, ఇత్తడి నాణేలు కోటలింగాలలో ఎన్నో దొరికినయి. బొమ్మ వైపు ఆరు శిఖరాల కొండ, గోబద పేరు ఉంది.
నరన: బొమ్మ వైపు ఎడమకు తిరిగి ఉన్న సింహం, త్రికోణం, స్వస్తిక, చెట్టు వంటి ముద్రలు, బొరుసు వైపు నందిపాద ముద్ర ఉన్నఈ నాణెంపై ’సిరి నరనస’ అని రాజు పేరు ఉంది.
కంవయస: అతి తక్కువ దొరికిన ఈ నాణేల బొమ్మ వైపు ఎద్దు, బొరుసువైపు చెట్టు ఉంది.
సిరివయస: ’వయస రణో’ అని ముద్రించిన ఈ నాణేలపై బొమ్మ వైపు విల్లు, ధనుసు బొరుసు వైపు నందిపాద ముద్ర ఉంది. ఇవి కూడా తక్కువే దొరికినాయి.
సామగోప: ఈ క్రమంలో చివరి వాడైన ఇతడి నాణేలు కోటలింగాలకు బయట కూడా దొరికినాయి. మూడు శిఖరాల కొండ, చెట్టు, విల్లు, ధనుసు వంటి గుర్తులున్న ఈ నాణేలు చాలానే దొరికినయి. ఇవే కాకుండా పేరు స్పష్టంగా లేని ఎన్నో నాణేలు తెలంగాణాలో దొరికినాయి.
ఇక శాతవాహన నాణేల విషయానికి వస్తే కోటలింగాలలో మొదటి రాజైన చిముక, సిరి శాతవాహన, ఒకటో శాతకర్ణి, సతసిరి, రెండో శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులుమావి, వాసిష్టీపుత్ర శాతకర్ణి వంటి శాతవాహన రాజుల, వారి అధికారులు లేక సామంతులైన మహాతలవర, మహాసేనాపతి వంటి వారు జారీ చేసినవి దొరికినాయి. సామగోప చాలా కాలం రాజ్యమేలినట్టు తెలుస్తున్నది.
సామగోప తర్వాత రాజైన చిముక శాతవాహన వంశంలో మొదటి రాజు. చిముక సామగోప దగ్గర అధికారిగా ఉంటూ తర్వాత స్వతంత్ర రాజుగా ఎదిగినట్టు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. సామగోప నాణేలపై తిరిగి చిముక తన గుర్తు ముద్రించిన నాణేలు స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి.
శాతవాహన చరిత్రపై విశేష పరిశోధన చేసిన చరిత్రకారుడు అజయ్ మిత్ర శాస్త్రి సైతం శాతవాహనుల మొదటి రాజధాని కోటలింగాల అని నిర్ధారణకు వచ్చారు. క్రీస్తు పూర్వం 3 లేక 2 నాటికి కోటలింగాల ఒక రాజ్యానికి రాజధానిగా మారుతున్న క్రమం మొదలైందని రాజారెడ్డి భావన. శాతవాహన పూర్వ రాజుల నుండి మొదలు శాతవాహన రాజైన మొదటి శాతకర్ణి కాలం వరకు కోటలింగాల రాజధానిగా ఉండేదని ఆ తర్వాత ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా లోని పెద్దబొంకూర్ చేరుకుందని రాజారెడ్డి అంటున్నారు. ధూళికట్ట సైతం ఒక విశాల నగరంగా ఉండి శాతవాహనుల రాజధానిగా ఉండే అవకాశం కూడా ఉంది. అక్కడ కనుగొన్న మట్టి కోట, నిర్మాణాలు, సరైన తవ్వకాలు చేయకుండానే బయల్పడిన పురావస్తు విశేషాలు దీనికి ఆస్కారం ఇస్తున్నాయి.
హకుసిరియ ఈ దేయ నాగసిరియ గోపియ – అని ఉన్న ఈ శాసనంలో ఉన్న అహిమక అన్న పదం అస్సకకు అశ్మక, అసక వంటి పదాలకు రూపాంతరం. అంతకు ముందు కొందరు ఈ శాసనాన్ని పరిష్కరించినప్పటికీ మునిరత్నం అహిమకకు ఇచ్చిన ఈ వివరణతో అస్సక జనపదానికి శాసనాధారం దొరికింది. ఈ శాసనంలోని బాలక హకుసిరి ప్రస్తావన నానేఘాట్, నాసిక్ శాసనాల్లో తొలి శాతవాహన రాజు చిముక కొడుకు అని ఉండటంతో, కోటలింగాల ప్రాంతానికీ, చిముకుడు, హకుసిరికి ఉన్న సంబంధం స్పష్టమైంది. ఈ శాసనం ఇప్పుడు కరీంనగర్ మ్యూజియంలో ఉంది.
ఒక వైపు గోదావరి ఇంకో వైపు పెద్ద వాగు ఒడ్డున ఉన్న గ్రామం కోటలింగాల. ఇక్కడ పురావస్తు శాఖ 1979 నుండి 1984 వరకు, తిరిగి 2009 నుండి 2012 వరకు జరిపిన తవ్వకాలలో మట్టిదిబ్బల కింద ఉన్న శాతవాహన మహానగరం ఆనవాళ్లు బయటకు వచ్చినయి. ఆనవాళ్లు అని ఎందుకు అంటున్నానంటే జరిపిన తవ్వకాలు అసంపూర్తిగా మిగిలిపోయి, తవ్వకాలలో బయట పడిన నిర్మాణాలు సైతం మళ్ళీ మట్టి దిబ్బలకిందే ఉండి పోయి సంరక్షణకు నోచుకోలేదు కాబట్టి.
తూర్పు నుండి పడమరకు సుమారు 1055 మీటర్లు, ఉత్తరం నుండి దక్షిణానికి 333 మీటర్లు ఉన్న పొడుగైన మట్టిగోడతో కట్టిన ప్రాకారం నగరానికి చుట్టూ బయటపడింది. పెద్ద వాగు పక్కనే, ఇంకో మూడు దిశల్లో శాతవాహన కాలం నాటి పెద్ద ఇటుకలతో కట్టిన కోట బురుజు లాంటి నిర్మాణం బయట పడిం ది. ఈ ప్రాంతాల్ని ఇప్పటికీ స్థానికులు మూల కోట, నక్కల కోట వంటి పేర్లతో పిలుస్తారు. మెగస్తనీసు ప్ర స్తావించిన శాతవాహనుల 30 కోటలలో ఇది ఒకటి.
2009 నుండి జరిపిన తవ్వకాలలో బౌద్ధ చైత్య గృహం, గదుల వంటి నిర్మాణం, బావులు బయట పడ్డాయి. శాతవాహన కాలంలోనే కాదు తెలంగాణలోనే తొలి నాళ్ళ బౌద్ధ ఆధారాలలో ఇవి కొన్ని. ఇవి కాకుండా బౌద్ధ విహారానికి చెందినవిగా భావిస్తున్న, బ్రాహ్మీ లిపిలో రాతలున్న సుమారు 59 శిలా ఫలకాలు క్రీస్తు పూర్వం 2 – 1 వ శతాబ్దపు చరిత్రను ఆవిష్కరిస్తాయి. విరివిగా నాణేలు, టెర్రకోట, విలువైన రాళ్లు, బంగారు వంటి లోహాలతో చేసిన పూసలు, నలుపు, నునుపు చేసిన ఎరుపు కుండ పెంకులు, రోమన్ తరహా రౌలెటెడ్ మట్టి పాత్రలు, పనిముట్లు, విలాస వస్తువులు – ఇలా తొలి చారిత్రక యుగానికి చెందిన భిన్న రకాల ఆధారాలు దొరికినాయి.
ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న కోటలింగాల ఇప్పుడు ఎల్లంపల్లి- శ్రీపాదసాగర్ ముంపు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం గ్రామం ఇంకో చోటికి మారి, చారిత్రక అవశేషాలున్న కోటలింగాల నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉంది. ఈ శాతవాహన నగరానికి చుట్టూ ఆలంపూర్లో కట్టినట్టు గోడ కట్టి కాపాడుకొని, పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టకపోతే ఒక మహా నగరాన్ని, మన చారిత్రక ఆధారాల్ని శాశ్వతంగా పోగొట్టుకుంటాం.
కోటలింగాల పక్కనే ఉన్న ముక్కట్రావుపేటలో దొరికిన క్రీస్తు శకం 1-2 శతాబ్దాలకు చెందిన ప్రాకృత శాసనం అస్సక, శాతవాహన చరిత్రలకు ముఖ్యమైన ఆధారం. ఈ ప్రాకృత శాసనం అస్సక మహాజనపదానికి ఉన్న ఒకే ఒక్క శాసనాధారం. కోటలింగాల నాణేలు నిరంతరతను సూచించినట్టుగానే, అస్సక చరిత్రకు, శాతవాహన కాలానికి ఉన్న నిరంతరతకు రుజువులు చూపుతున్న ఈ శాసనాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎపిగ్రఫీ శాఖ డైరెక్టర్ డా. కే మునిరత్నం రెడ్డి పరిష్కరించి, వ్యాఖ్యానించారు.
శాతవాహనుల తొలి రాజధాని మహారాష్ట్ర లోని పైఠాన్ అని కొందరు, కర్ణాటక అని ఇంకొందరు, ఏ పురాతత్వ ఆధారం చూపలేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని కొందరు సిద్ధాంతాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోటలింగాలలో దొరికిన శాతవాహన పూర్వ రాజుల నాణేల ఆధారంగా, కోటలింగాలనే శాతవాహనుల తొలి రాజధాని అని నిరూపించి, తెలంగాణ చారిత్రక ప్రాచీనతను నిలిపింది ప్రముఖ న్యూమిస్మాటిస్ట్ (నాణేల అధ్యయన శాస్త్రం) డా. దేమే రాజారెడ్డి. ఆయన కృషి మూలంగా, తవ్వకాల్లో దొరికిన, దొరుకుతున్న పురాతత్వ ఆధారాల వల్ల, శాతవాహనుల ప్రస్థానం తెలంగాణ నుండే మొదలైందని, కోటలింగాల వారి మొదటి రాజధాని అని నిరూపితమైంది. ఇన్ని ఆధారాలున్నా ఇప్పటికీ కోటలింగాల ప్రాచీనతను ఒప్పుకోక పోవడానికి కారణం చరిత్రను సరిగా అర్థం చేసుకోకపోవడమో లేక ప్రాంతీయ దురభిమానమో అయి ఉంటుంది.
దక్కన్ చరిత్రలో ఇప్పటికీ చరిత్రకారుల్లో ఏకీభావం లేని విషయాల్లో శాతవాహనుల ప్రస్థానం మొదలైన కాలం ఒకటి. పురాణాల్ని పరిగణనలోకి తీసుకొనే వాళ్లు దాదాపు క్రీస్తు పూర్వం 220 లో మొదలై క్రీస్తు శకం 225 వరకు పాలించారని వాదిస్తారు. అయితే పురావస్తు ఆధారాలు, వాటిలో ప్రధానంగా భారత దేశంలో దొరికిన నాణేల్ని, ఇక్కడి నాణేల్ని, శాసనాలను తులనాత్మకంగా పరిశీలన చేసిన చరిత్రకారులు, శాతవాహనులు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దపు దక్షిణార్ధంలో మొదలైనారని తేల్చారు. అయితే శాతవాహనుల పాలన ముగిసింది మాత్రం క్రీస్తు శకం 230 లో అని అందరిలో ఏకాభిప్రాయం ఉంది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000