ఏ దేశంలోనైనా విశ్వవిద్యాలయాలు రాజకీయ దిక్సూచిలా పనిచేస్తాయి. విద్యార్థుల ఆందోళనలు రాజకీయ గతిని మార్చిన సందర్భాలూ చరిత్రలో మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రపంచ చరిత్రనే మార్చిన రష్యన్ విప్లవమైనా, అమెరికాలో వియత్నాం యుద్ధ వ్య తిరేక ఉద్యమమైనా విశ్వవిద్యాలయ విద్యార్థుల ప్రమేయం లేకుండా జరగలేదనేది కాదనలేని వాస్తవం. అంతెందుకు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమమైనా విశ్వవిద్యాలయా ల నుంచి బలాన్ని, స్ఫూర్తిని పొందినవే. మొన్నకు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచ అడవికి అం డగా జరిపిన పోరాటం ఇంకా మన మనసు ల్లో తాజాగా ఉన్నది. ఆలోచనల్లో వైవిధ్యం, ఆచరణలో చురుకుదనం విద్యార్థి ఉద్యమాల ప్రత్యేకతగా ఉంటుంది. ఆ కారణంగానే విశ్వ విద్యాలయాల గొంతు నొక్కివేయాలని నిరంకుశ ప్రభుత్వాలు తరచూ కత్తులు దూస్తూ ఉం టాయి. ఓయూ, హెచ్సీయూల్లో అమలవుతు న్న నిర్బంధం తెలిసిందే. అయితే ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ఏ మాత్రం తక్కువ తినలేదు. ఇంకా చెప్పాలంటే రెండాకులు ఎక్కువే చదివింది. అమెరికాలో సర్కా రు వర్సెస్ విశ్వవిద్యాలయాల తగాదా ముదిరి పాకాన పడుతుండటమే ఇందుకు తార్కాణం.
హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలపై ట్రంప్ సర్కారు వేధింపులకు పాల్పడుతుండటం ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కుగా చెప్పుకొనే అమెరికా అసలు రంగు బయటపెడు తున్నది. ఇంతకూ ట్రంప్ సర్కార్ ఏం చెప్తున్నది? క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలకు అడ్డుకట్ట వేయాలంటున్నది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ విధానాల పట్ల విధేయత ముఖ్యమంటున్నది. దీన్ని కాదంటే కేంద్రం విడుదల చేసే నిధులు నిలిపివేస్తామంటున్నది. అకడమిక్ స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ఫెడరల్ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవని హార్వర్డ్ ఉక్కు సంకల్పంతో ధిక్కరించి, ప్రతిఘటిస్తున్నది. అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నది. ట్రంప్ సర్కారు అన్నంత పనిచేసింది. 2.2 బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. అంతటితో ఊరుకోకుండా ట్రంప్ ఒకడుగు ముందుకువేసి ‘ఉగ్రవాద ప్రేరేపిత/ ప్రభావిత జాడ్యాన్ని పెంచి పోషిస్తున్నందుకు’ పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటామని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాన్ని రాజకీయ సంస్థగా గుర్తించి పన్ను వేస్తాననీ తాఖీదు ఇచ్చారు. అయినా హార్వర్డ్ తలవంచలేదు.
ప్రభుత్వ నియంత్రణలకు తలొగ్గి, క్యాంపస్‌లను కేంద్ర బలగాలకు అప్పగించేందుకు సిద్ధం కాలేదు. విద్యార్థుల ప్రదర్శనలపై నిషేధం విధించేందుకు, ప్రవేశ, ఉపాధి నిబంధనల సవరణకు అంగీకరించలేదు. వైవిధ్యం, సమానత్వం, సకలజనుల భాగస్వామ్య సూత్రానికి తిలోదకాలిచ్చేందుకు ససేమిరా అంటున్నది. ‘విశ్వవిద్యాలయం తన స్వాతంత్య్రాన్ని పరాధీనం చేయదు. తన రాజ్యాంగ హక్కులను వదులుకోదు’ అని హార్వర్డ్ అధ్యక్షుడు అలన్ గార్బర్ ఓ బహిరం గ లేఖలో పేర్కొనడం గమనార్హం. అయితే, అన్ని విశ్వవిద్యాలయాలు ఇలా ప్రతిఘటనా మార్గంలో వెళ్లడం లేదు. కొలంబియా వంటి విశ్వవిద్యాలయాలు ట్రంప్ సర్కారు తాఖీదులకు తలొగ్గి విమర్శల పాలవుతున్నాయి. హార్వర్డ్‌కు 54 బిలియన్ డాలర్ల విరాళం ఉండటం, ఇతర విశ్వవిద్యాలయాలకు ఆ స్థాయిలో సొంత నిధులు లేకపోవడమే ఇం దుకు కారణమనే వాదన కూడా ఈ సంద ర్భంగా వినిపిస్తున్నది.
ఇది మామూలు విషయం కాదు. అమెరికాలోనే అతిపురాతనమైన, పేరెన్నిక గన్న విశ్వవిద్యాలయం విషయంలో జరుగుతున్న ఈ దాడి సుదీర్ఘ పర్యవసానాలు కలిగి ఉంటుందని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికీ, విశ్వవిద్యాలయాలకు మధ్యన ఉండే మర్యాదపూర్వకమైన సంబంధాల నిర్వచనాన్నే మార్చివేస్తున్నది. పరిశోధన, ఉపాధికల్పన అవకాశాలపైనా ప్రభావం చూపుతుంది. అంతిమంగా ప్రభుత్వాలను ప్రశ్నించే స్వేచ్ఛకే ఇది ప్రమాదకరంగా మారుతుంది. విశ్వవిద్యాలయాలు ఒకేరకం సరుకులను తయారుచేసే కర్మాగారాలు కాదు, నూతన భావాలు వికసించే విద్యావిహారాలు. అలాంటి చోట ఆలోచనకు సంకెళ్లు వేయాలనుకోవడం అత్యాశే కాదు, అవివేకం కూడా.