సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jun 30, 2020 , 00:06:47

పీవీ విశ్వరూపం..సంపాదకీయం-30-06-2020

పీవీ విశ్వరూపం..సంపాదకీయం-30-06-2020

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారత రత్నతో సత్కరించడంతోపాటు, స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయం. పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కూడా కోరనున్నట్టు ఆయన ఆదివారం పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా వివరించారు. పీవీ జన్మస్థలమైన వంగరతోపాటు ఆయనతో అనుబంధం ఉన్న కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, ఢిల్లీలలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పీవీ పేరు పెట్టడంతోపాటు, స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తామని, సదస్సులు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమైనవి. 

భారత్‌ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చరిత్ర మూలమలుపులో సారథ్యం చేపట్టి, వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను ముందే పసిగడుతూ, అతి తక్కువ వ్యవధిలో అంత కన్నా వేగంగా పావులు కదపడం పీవీ ఘనత. భారత దేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో, ఇందిరా గాంధీ హయాంలో కొన్ని భౌగోళిక- రాజకీయ, సైద్ధాంతిక కారణాల వల్ల సోవియెట్‌ యూనియన్‌తో సాన్నిహిత్యం పెంచుకోవలసి వచ్చింది. సామ్యవాద విధానాలతో భిన్న వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న విదేశీ కుట్రలను అనుక్షణం తిప్పికొట్టే రోజులవి. ఆనాడు ఇందిరాగాంధీ విధాన నిర్ణయాలలో పీవీదే కీలకపాత్ర. కానీ 1991 జూన్‌లో పీవీ ప్రధాని అయ్యేనాటికి అంతర్జాతీయ పరిస్థితులు భారీ మార్పునకు లోనవుతున్నాయి. ఆయన పదవి చేపట్టిన ఆరు నెలలకే సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలిపోయింది. అమెరికా ఆధిపత్యం నెలకొని ఏకధ్రువ ప్రపంచం ఏర్పడ్డది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రపంచవ్యాప్తంగా స్వీకరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగా ఉన్నది. పీవీ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు, భవిష్యత్తు పరిణామాలకు అనుగుణమైన రీతిలో ఆర్థిక, విదేశాంగ విధానాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. 

పీవీ శతజయంత్యుత్సవాలను విశ్వవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించడం ఆయన సేవలకు సముచిత నివాళి. భారత్‌ వంటి అతి పెద్ద దేశం కీలకమైన దశలో అనుసరించిన విధానం దక్షిణాసియాలోనే కాకుండా, దక్షిణార్ధగోళంలోని మూడవ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిందనవచ్చు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ మొదలుకొని బ్రిటన్‌ ప్రధాని జాన్‌ మేజర్‌ వరకు ఆయన పట్ల అభిమానం పెంచుకున్నారు. అంతర్జాతీయంగా దేశానికి ప్రతిష్ఠను మూటగట్టిన పీవీకి చివరి దశలో స్వదేశంలోనే అవమానం జరగడం ఒక పెద్ద విషాదం. ఆయన విశ్వరూపాన్ని అంతర్జాతీయ యవనికపై మళ్ళీ ఆవిష్కరింప చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలి. పీవీకి ఔన్నత్యానికి తగిన సత్కారం లభించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.


logo