లాటిన్ అమెరికాలో మరోమారు వామపక్ష పవనాలు వీస్తున్నా యి. ఇటీవల కొలంబియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ కమ్యూనిస్టు గెరిల్లా, హ్యూమేన్ కొలంబియా పార్టీ అధినేత గుస్తావో పెట్రో ఘనవిజయం సాధించటంతో.. లెఫ్ట్ పాలనలో ఉన్న లాటిన్ అమెరికా దేశాల జాబితాలోకి మరొకటి చేరినట్లయ్యింది. కొలంబియా చరిత్రలో తొలిసారిగా ప్రజలు వామపక్షానికి పట్టం కట్టడం గుస్తావో విజయానికి ఉన్న మరో విశిష్టత. ఇప్పటికే క్యూబా, వెనిజువెలా, నికరాగువా, మెక్సికో, అర్జెంటీనా, బొలీవియా, పెరూ, హోండూరస్, చిలీల్లో లెఫ్ట్ ప్రభుత్వాలు కొలువై ఉన్నాయి. లాటిన్ అమెరికాలోనే అతి పెద్ద దేశమైన బ్రెజిల్లో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజాదరణ విషయంలో ప్రస్తుత మితవాద అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వ చాలా ముందంజలో ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
పొరుగునే ఉన్న అగ్రరాజ్యం అమెరికా జోక్యం కారణంగా తలెత్తిన అంతర్యుద్ధాలు, రక్తపాతం, పేదరికంతో దశాబ్దాలపాటు అతలాకుతలమైన లాటిన్ అమెరికాలో కమ్యూనిస్టు ప్రయోగాలు అనేకం జరిగాయి. సాయుధ పోరాటం నుంచి పార్లమెంటరీ రాజకీయాల వరకూ పలు పంథాలలో కొనసాగాయి. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి ఒక మేర స్థిరత్వం నెలకొని వామపక్ష ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. బొలీవియాలో మోరేల్స్, బ్రెజిల్లో లూలా, చిలీలో బాచ్లెట్, వెనెజువెలాలో హ్యూగో చావెజ్, ఈక్వెడార్‌లో రాఫెల్ కొరియా అధికారంలోకి వచ్చి.. సోషలిస్టు విధానాలను అమలులో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అదీ ఎంతోకాలం నిలబడలేదు. అవినీతి ఆరోపణలు, వ్యక్తిపూజ, వర్గపోరాటాలకు తోడు, లాటిన్ అమెరికాను తన మార్కెట్‌గా భావించే అమెరికా.. ఆ దేశాలను స్థిమితపడనివ్వలేదు. బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే ప్రభుత్వాలు, మితవాద శక్తులు మళ్లీ అధికారంలోకి వచ్చాయి.
పేదరికం, ఆర్థిక అంతరాలు, నిరుద్యోగం, హింస, నియంతృత్వం మరోసారి విజృంభించాయి. ఇదే తరుణంలో ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా లాటిన్ అమెరికన్లను దారుణంగా దెబ్బకొట్టింది. ఉద్యోగాలు లేక, ఉన్న ఆదాయం వైద్యానికి చాలక అల్లాడిపోయారు. ఇది అధికారంలో ఉన్న వారిపై ఆగ్రహంగా మారి, మరోసారి వామపక్ష వెల్లువకు నాంది పలికింది. ఈ నేపథ్యంలోనే వరుసగా లెఫ్టిస్టు ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. దీంట్లో కొలంబియా విజయం తాజాది. ఆ దేశ ప్రజానీకం తొలిసారిగా వామపక్ష అధ్యక్షుడినే కాదు, మొట్టమొదటిసారిగా నల్లజాతికి చెందిన మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకుంది. బ్రెజిల్లో లూలా కూడా మరోసారి పీఠం చేపడితే.. లాటిన్ అమెరికాలో అరుణ పతాకానికి పునర్వైభవం లభించినట్లే. అయితే, రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రజా వ్యతిరేకత కారణంగా కాకుండా తమ సొంత విధానాల బలంతో అధికారంలోకి రావటంపై దక్షిణ అమెరికా వామపక్ష పార్టీలు దృష్టి పెట్టాలి. అప్పుడే వాటికి భవిష్యత్తు ఉంటుంది. తమ పౌరులకు స్థిరమైన పాలనను, శాంతిని, సౌభాగ్యాన్ని అందించగలుగుతాయి.