సాధారణంగా ఒక ఉప ఎన్నిక పరిధి, అది చూపించే ప్రభావం చాలా తక్కువ. కానీ మునుగోడు ఉప ఎన్నిక దేశ రాజకీయాల్ని శాసించాలన్న తెలంగాణ బిడ్డల దృఢ నిశ్చయానికి ప్రతీకగా మారింది. ఇది అభ్యర్థుల మధ్య, లేదా పార్టీల మధ్య పోటీ మాత్రమే కాదు. వికాసానికి, వినాశనానికి మధ్య సాగుతున్న సమరం. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటంలో తెలంగాణ బిడ్డలు విజయం సాధించారు. తెచ్చుకున్న తెలంగాణను ఆదర్శప్రాయంగా పాలించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచారు. కానీ ఇప్పుడు పెద్ద ముప్పు ఒక తెలంగాణకే కాదు, దేశానికే ఎదురైంది. ప్రజాస్వామిక విలువలను, పేదల బతుకులను పరిరక్షించుకోవలసిన నాయకత్వం ఇప్పుడు దేశానికి అవసరం. తెలంగాణ నమూనాలో దేశాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, సామరస్య జీవనానికి భరోసా ఇవ్వవలసిన నాయకుడు ఇప్పుడు కావాలి. ఈ నేపథ్యంలో సమర్థ పాలకుడిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యమే మనుగోడు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా మార్చింది.
దేశ ప్రధానిగా మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒకేసారి అధికారంలోకి వచ్చారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. కానీ దేశం పరిస్థితి ఎలా ఉన్నదో తెలిసిందే. ఆర్థిక రంగం దిగజారిపోయింది. ఆకలి రాజ్యంగా మారింది. విదేశీ మారకం తగ్గిపోతున్నది. విదేశా ల్లో దేశ ప్రతిష్ఠ మసకబారింది. పారిశ్రామికంతో పాటు పలు రంగాలలో సంక్షో భం నెలకొన్నదని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. మరోవైపు, మోదీ ప్రభు త్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశం నిరంకుశ రాజ్యంగా మారి అల్లకల్లోలమైపోతుంది.
దేశ రక్షణ కోసం, జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్న నాటి నుంచి బీజేపీ మరింతగా పగబట్టింది. టీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడితే దేశ రాజకీయాల వైపు చూడదనే చౌకబారు ఎత్తుగడలకు దిగింది. ఈ దుష్ట చింతనతోనే పనిగట్టుకొని మునుగోడు శాసన సభ్యుడిని ప్రలోభపెట్టి, రాజీనామా చేయించి ఉప ఎన్నికను సృష్టించింది. తెలంగాణ ప్రజలు దేశానికి దారి చూపే పరిస్థితి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో.. బీజేపీ కుట్రలను తిప్పికొట్టే అవకాశం మునుగోడు ఓటర్లకు లభించింది. ఇప్పటి సందర్భాన్ని, తమ తీర్పు ప్రాధాన్యాన్ని మునుగోడు ఓటర్లు గుర్తించాలి. తాము తెలంగాణ ప్రజల మనోగతానికి ప్రతీకలమని గ్రహించి కేసీఆర్ ప్రణాళికలకు మద్దతుగా నిలవాలి. తెలంగాణ దేశానికి దారి దీపంగా మారే మహత్తర సన్నివేశం ఆవిష్కారం కాబోతున్నదని చాటి చెప్పాలి.