కర్ణాటక వాల్మీకి కుంభకోణంలో సోమవారం ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌తో కాంగ్రెస్ అవినీతి బండారం బద్దలైంది. గిరిజన బిడ్డల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దారిమళ్లించారనేది ఆరోపణ. అలా మళ్లించిన నిధులను కర్ణాటకలోని బళ్లారితో పాటుగా తెలంగాణ, ఏపీ ఎన్నికల ఖర్చులకు, విశేషించి భారీగా మద్యం కొనుగోలుకు వినియోగించారని అభియోగపత్రంలో పేర్కొనడం గమనార్హం.
మిగతా స్కామ్‌ల తరహాలో ఇందులో పెద్ద వ్యూహాలేమీ లేవు. ఓ ప్రభుత్వ సంస్థ నిధులను ముందుగా ఆమోదయోగ్యత లేని ఓ ఖాతాలోకి మళ్లించి, అటునుంచి తెలంగాణ, ఏపీలోని 18 వేర్వేరు నకిలీ ఖాతాల్లో జమ చేశారు. అలా చేజిక్కించుకున్న రూ.89.62 కోట్ల సొమ్మును వివిధ ఎన్నికల్లో ఖర్చుచేశారు. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడటం తెలిసిందే. కాంగ్రెస్ పెద్దలు కర్ణాటకను ఏటీఎంలా వాడుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు అక్షరాలా నిజమని ఈడీ చార్జిషీట్ రుజువు చేసింది.
మాజీ మంత్రి నాగేంద్రను ప్రధాన నిందితుడిగా చేర్చినప్పటికీ పైస్థానాల్లో ఉన్న పెద్దలకూ ఈ కుంభకోణంలో హస్తమున్నట్టు వినవస్తున్నది. మొత్తం 24 మంది నిందితుల పేర్లు చేర్చారు. అందులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అటు నుంచి ఇటు ధన ప్రవాహానికి వారు సంధానకర్తలుగా వ్యవహరించారని ఈడీ అంటున్నది. ప్రైవేటు ఖాతాకు ప్రభుత్వ నిధుల మళ్లింపునకు సంబంధించిన నియమాలను, మార్గదర్శకాలను ఆర్థికశాఖ, గిరిజన సంక్షేమశాఖ ఉల్లంఘించాయని ఈడీ ఆరోపించింది.
గిరిజన సంక్షేమశాఖ మంత్రిని ఈసరికే అరెస్ట్ చేశారు. కాగా ఆర్థికశాఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈడీ దాఖలు చేసింది ముందస్తు అభియోగపత్రం మాత్రమే. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనుబంధ అభియోగాలు దాఖలు చేస్తామంటున్నది. అదే జరిగితే ఏయే అధికార పీఠాలకు ఈ కేసు చుట్టుకుంటుందో ఇప్పుడే చెప్పలేం.
అవినీతి కేసులు వెంటాడటంతోనే ఢిల్లీ గద్దెను కోల్పోయి, మూలన పడి మూలుగుతున్నా కురువృద్ధ పార్టీ తీరు మారలేదని తాజా పరిణామం సూచిస్తున్నది. కర్ణాటకలో బీజేపీ వ్యతిరేకతను వాహనంగా చేసుకుని, అలవిమాలిన హామీలను ఇంధనంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రజలు గత్యంతరం లేక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కాంగ్రెస్ ఎందుకవుతుంది? స్కాముల పార్టీ అనే ముద్రను సార్థకం చేసుకోవాలి కదా? బోఫోర్స్, బొగ్గు, టూజీ ఇలా కుంభకోణాల పరంపర ఆగిపోతే ఎలా? అదిగో ఆ వారసత్వంలో భాగమే వాల్మీకి కుంభకోణం. అయితే ఈ కుంభకోణం బయటపడటంతో మనం మాట్లాడుకుంటున్నాం. బయటపడనివి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇక్కడ చేతులు మారింది ఇప్పటి వ్యయాలతో పోలిస్తే చిన్న మొత్తమే. ఇంకెన్ని వనరుల్లో చేయి పెట్టారో, ఇక్కడి పెద్ద తలకాయలు ఏవో మరింత లోతుగా తరచి చూస్తే కానీ బయటపడదు.