ఆదివారం 17 జనవరి 2021
Editorial - Nov 24, 2020 , 00:15:09

.. నీ పప్పులేం ఉడకవు

.. నీ పప్పులేం ఉడకవు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తేదీ ప్రకటించగానే రాష్ట్రంలో ముందెన్నడూ చూడని రాజకీయ వాతావరణం కనిపిస్తున్నది. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఒకే గూటికి చేరుతున్నాయి. రాష్ట్ర సాధన ఉద్యమకాలం నుంచీ రాష్ట్రం రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసిన దుష్టశక్తులు, రాష్ర్టావతరణ తర్వాత కడుపులో కత్తులు దాచుకొని ద్వేషంతో కత్తులు నూరుతున్నాయి. తెలంగాణ స్వయం పాలనను, అభివృద్ధి వికాసాలను ఓర్వలేని శక్తులన్నీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా చేతులు కలుపుతున్నాయి. మనుషుల మధ్య మత భేదాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మతవాద శక్తులు బరితెగిస్తున్నాయి. ప్రశాంత హైదరాబాద్‌ నగరాన్ని మత కలహాల కుంపటిగా మార్చేందుకు పన్నాగాలు పన్నుతున్నాయి. తెలంగాణ విషయంలో ఆది నుంచీ నిలువెల్లా వ్యతిరేకతను నింపుకున్న చంద్రబాబు రాష్ర్టాన్ని నిలువరించటానికి ఎన్నెన్ని కుట్రలకు దిగాడో చరిత్రనే సాక్ష్యం.

ఒక ఓటు రెండు రాష్ర్టాలన్నవాళ్లూ, రెండు కండ్ల సిద్ధాం తం వల్లెవేసిన చంద్రబాబు చీకటి ఒప్పందంతో ఏకమవుతున్నారు. ఓట్ల కోసం కులం, మతం కార్డుల మాయాజాల వలలను విసురుతున్నారు. సుదీర్ఘ పోరాటాలతో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు కపట దారులను పసిగట్టి కచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. గతంలో గ్రేటర్‌ తొలి ఎన్నికలప్పుడు రెండు నాల్కల సిద్ధాంతి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని చంద్రబాబు హైదరాబాద్‌లో పాగా వేయాలనే ఉద్దేశంతో కుట్రలెన్నో చేశాడు. బీజేపీతో పాటు ఇతర పార్టీలతో పొత్తు కూడి ఎన్నికల్లో పోటీ చేశాడు. హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రా ప్రజల ఓట్ల కోసం బాబు వేయని బురిడీ వేషాల్లేవు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా.., గ్రేటర్‌లో ఒంటరిగా పోటీచేసిన టీఆర్‌ఎస్‌ యువనేత కేటీఆర్‌ సారథ్యంలో 150 సీట్లకు గాను 99 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది.

కొందరు రాజకీయ నాయకులు అధికారమే లక్ష్యంగా పనిచేస్తారు. చేసింది గోరంతయితే కొండంతగా చెప్పుకొని ఊరేగుతారు. హైటెక్‌ సిటీ గురించి చంద్రబాబు చెప్పుకునే తీరు అదే. నిజానికి రాష్ట్ర అవతరణ తర్వాత ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో హైదరాబాద్‌ ఒక్కటిగా నిలిచింది. నగరంలోకి అనేక పరిశ్రమలు వచ్చాయి. నగరాభివృద్ధి శరవేగంగా జరిగింది. నగరంలో ఆంధ్రా ప్రజల భద్రతకు భరోసా కలిగింది. నగరం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా తయారైంది. ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీకే రాజధాని పగ్గాలు అందిస్తే నగరాభివృద్ధి జరుగుతుందని నగర ప్రజలకు తెలుసు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఆస్వాదించిన నగర ప్రజలు గత ఎన్నికల కన్నా ఇంకా ఎక్కువ సీట్లతో గ్రేటర్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీకి అప్పగిస్తారనడంలో సందేహం లేదు. 

తెలంగాణ ఏర్పడితే, హైదరాబాద్‌లో జీవిస్తున్న ఆంధ్రా ప్రజలకు భరోసా లేదంటూ భయపెట్టిన చంద్రబాబు అండ్‌ కో మాటలను ఆంధ్రా ప్రజలు గత ఎన్నికల్లోనే పట్టించుకోలేదు. అమరావతి పేరుతో ఆంధ్రా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు నగరంలో నాటకాలాడేందుకు ముందుకు వస్తున్నాడు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని గ్రేటర్‌లో కాలుమోపేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. పిల్లి శాపనార్థాలకు పీతలు పడవు. చంద్రబాబు, మత దురహంకారుల అబద్ధ ప్రచారాలకు హైదరాబాద్‌ నగర ప్రజలు మోసపోరు. అభివృద్ధి, వికాసాలకు పెద్దపీట వేస్తారు. శాంతి, సహజీవన గంగాజమునా తెహజీబ్‌ హైదరాబాద్‌ ఔన్నత్యాన్ని చాటిచెప్తారు.

-గడ్డం సతీష్‌