ఆఫ్ఘనిస్థాన్‌లో చీకటి చరిత్ర పునరావృతమవుతున్నది. ప్రపంచ ప్రసిద్ధ బమియాన్ బుద్ధ విగ్రహాలను కూల్చివేసిన తాలిబన్లు మళ్లీ ఆ దేశాన్ని ఏలబోతున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు రాజధాని కాబూల్‌లోని విమానాశ్రయానికి వేలాదిమంది ఆఫ్ఘన్లు పరుగులు తీశారు. రన్‌వేపై విమానం కదులుతున్నా దాంట్లో కాస్తంతా చోటు దక్కకపోతుందా అని వెంబడించిన వందలాదిమంది జనం.. రెక్కలను పట్టుకొని కూర్చొని ఆకాశంలోకి విమానం ఎగిరిన తర్వాత పట్టు కోల్పోయి నేల మీద పడి ప్రాణాలు కోల్పోయిన మరికొందరు.. హృదయవిదారకమైన ఈ వీడియోలు ఆఫ్ఘన్ల దైన్యాన్ని, తాలిబన్ల పాలనలో వాళ్లకు ఎదురుకానున్న పరిస్థితులను సూచిస్తున్నాయి.
స్వదేశంలో స్వజాతీయులను ఇంతగా భయకంపితులను చేస్తున్న తాలిబన్లకు ఒకప్పుడు విముక్తివీరులుగా పేరు ఉండటం విశేషం. నిజానికి తాలిబన్ అనే పాష్టో భాషా పదానికి అర్థం విద్యార్థులు. 1980 దశకంలో ఆఫ్ఘనిస్థాన్‌పై సోవియట్ యూనియన్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ పోరాడిన అనేక తిరుగుబాటు దళాల్లో తాలిబన్ ఒకటి. ప్రచ్ఛన్నయుద్ధం నేపథ్యంలో సోవియట్‌కు వ్యతిరేకంగా అమెరికా తాలిబన్లను పెంచి పోషించింది. చివరికి వాళ్లు అమెరికాకు ఏకుమేకయ్యారు. 1996లో ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు 2001 వరకూ కొనసాగారు. వారి పాలనలో ఆ దేశం చీకటియుగంలోకి వెళ్లింది. మహిళలపై పూర్తి నిర్బంధం, స్త్రీ పురుషుల వస్త్రధారణపై కఠినమైన ఆంక్షలు, బహిరంగ మరణశిక్షలు, మైనారిటీల ఊచకోత వంటి దుర్మార్గాలు సాధారణమయ్యాయి. 2001లో న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆఘ్ఘనిస్థాన్లోని తాలిబన్లపై అమెరికా యుద్ధానికి దిగింది. కానీ విదేశీ సైన్యాలు దేశంలో ఉండటమే తాలిబన్లకు అనుకూలాంశమైంది. అమెరికా తన దళాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్ మళ్ళీ ఈ మతఛాందసుల పాలైంది.
మతం పేరిట నిరంకుశ పాలన సాగించే తాలిబన్లతో ఎలా వ్యవహరించాలనేదే ప్రపంచ దేశాల ముందున్న సమస్య. పాకిస్థాన్, ఇరాన్, టర్కీ వంటి దేశాలకు తాలిబన్లతో లోపాయికారి సంబంధాలున్నాయి. రష్యా సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నది. అన్నిటికన్నా బలమైన మద్దతు చైనా నుంచి ఉన్నది. అమెరికా కూడా ఏదోఒక మేర తాలిబన్లతో అంగీకారానికి వచ్చిన తర్వాతే దళాలను ఉపసంహరించుకున్నదనేది స్పష్టం. యూరోపియన్ దేశాలే కొంత మేర ఒత్తిడి తేవాలనే ఆలోచనలో ఉన్నాయి. భారత్ కూడా తాలిబన్ల పట్ల ఏ మాత్రం సదభిప్రాయంతో లేదు. అయితే వాస్తవిక పరిస్థితులను విస్మరించడం కూడా సాధ్యం కాదు. ఏదేమైనా ఆఫ్ఘనిస్థాన్‌లో ఎన్నికలను నిర్వహించేందుకు తాలిబన్లను ఒప్పించాలి. అన్ని స్థానిక తెగలకు, జాతులకు ప్రభుత్వంలో స్థానం కల్పించే విధంగా, మానవ హక్కులను పరిరక్షించే విధంగా ఒత్తిడితేవాలి.