గురువారం 29 అక్టోబర్ 2020
Editorial - Sep 30, 2020 , 03:31:15

హాలికుడే పాలకుడైతే..!

హాలికుడే పాలకుడైతే..!

కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ నష్టాల నుంచి దేశ ఆర్థికవ్యవస్థ బయటపడటం సాధ్యమే. అయితే, అందుకు వ్యవసాయరంగమే దిక్కు. వ్యవసాయరంగంలో అనూహ్య మార్పులు, అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం, దాని అనుబంధరంగాల పాత్ర చాలా కీలకమైనదని ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సి.రంగరాజన్‌ అన్నారు. సరిగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే చేసి చూపిస్తున్నారు. దేశంలో వ్యవసాయరంగానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్నంత ఖర్చు మరే రాష్ట్రమూ చేయడం లేదు. కేసీఆర్‌ స్వతహాగా రైతు బిడ్డ, రైతు పక్షపాతి

కాబట్టి అది సాధ్యమవుతున్నది. కేసీఆర్‌ హాలికుడు. హాలికుడైన పాలకుడు. హాలికునికి పాలకునికీ మధ్య హద్దులు చెరిపేసిన సాధకుడు.

వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు వచ్చినా గ్రామాల్లో ఆధిపత్య రూపం మారిందే గాని దాని సారం మారలేదన్న సత్యం కేసీఆర్‌కు తెలుసు. అందుకే సమూల మార్పునకు శ్రీకారం చుట్టారు. రైతులకు అన్నిరకాల అండదండలంది స్తూ, రక్షణలు కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం మొత్తం దేశానికే ఆదర్శం. ఎన్నడైనా కలగన్నామా మనం. తలాపున పారే గోదారి మన తనువులను పులకింపజేస్తుందని, నెర్రెలువారిన మన నేల పుట్లకొద్ది పంటను మనకు కానుకగా ఇస్తుందని, ప్రతి పల్లెలో జలకళ మన కనుల విందు చేస్తుందని ఏనాడైనా ఊహించామా! ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం కేసీఆర్‌.

ప్రజల ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడంలోనే పాలకుని పనితనం బయటపడుతుంది.  ప్రజల ప్రాధాన్యాలను తన బాధ్యతలుగా స్వీకరించి వాటిని పూర్తిచేయడంలోనే పాలకుని గొప్పతనం నిరూపితమవుతుంది. నాడొక బిడ్డగా ఉద్యమించి తల్లి బంధనాలను తెంచారు. నేడు తాను పాలకుడైన తర్వాత ఒక బిడ్డగా బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. రైతు కంటి నుంచి కన్నీరు కారకుండా ఉండాలంటే సాగునీరు పారడమొక్కటే మార్గమని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. ఆ దిశగా గొప్ప పురోగతి సాధించారు. ‘వ్యవసాయం దండగ కాదు పండుగ’ అని నిరూపించేందుకు ‘రైతు బంధు’తో రాష్ట్రమంతటికీ విందు చేస్తున్నారు. వ్యవసాయరంగంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సం బంధం లేని కుటుంబం తెలంగాణలో ఒక్కటి కూడా ఉండదు. రైతే తెలంగాణ వెన్నెముక. అందుకే రైతు కుటుంబాలను కాపాడేందుకు రేయింబవళ్లు కృషిచేస్తున్నారు. అధికారాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి అణగారిన జనం కోసం అహరహం పనిచేస్తున్నారు.

రాష్ర్టాలకు ఉన్న వనరులు, అధికారాలు స్వల్పం. అధిక శాతం వనరులు, ఆధికారాలు కేంద్రం వద్దే కేంద్రీకృతమై ఉన్న పరిస్థితి. అందునా, కేంద్రీకృత పాలనను కాంక్షించే కమలనాథుల ఏలికలో పాలనా వికేంద్రీకరణకు ఉనికే లేకుండా పోతున్నది. అయినా, ఉన్నంతలోనే తెలంగాణలోని ప్రతి కుటుంబానికి భరోసాగా నిలిచి, ఆరోగ్యాన్ని పరిరక్షించి, అన్నిరంగాల్లో అండగా నిలవాలని సంకల్పం చెప్పుకున్న కేసీఆర్‌ ఆ దిశగా నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. ఆర్థిక పరిపుష్టి లేకున్నా, ఆర్థిక లోటును అనేక మార్గాల్లో పూడ్చుకుంటూ, ఆ లోటు భారం ప్రజల మీద పడకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు కేంద్రంతో సంబంధాలు దెబ్బతినకుండా రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ తన హుందాతనాన్ని, రాష్ట్ర ప్రజల గౌరవాన్నీ కాపాడుతున్నారు.  దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అనేక అననుకూలతల మధ్య నిదానంగా, నిబ్బరంగా నావను నడిపిస్తున్నారు. సంక్షేమం-అభివృద్ధి రెంటికీ సమాన ప్రాధాన్యాన్నిస్తూ ప్రజల తాత్కాలిక అవసరాతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.

ఆశ ఒకటి ఉంటే చాలదు. అది సఫళీకృతం కావాలంటే ఆశకు ఆశయం తోడవ్వాలి. దానికి ఆచరణ జత కలవాలి. ఆచరణకు ప్రతి రూపం కేసీఆర్‌. ఆకలి తీర్చే ఆచరణకు, ఆత్మగౌరవం కాపాడే ఆచరణకు, అభివృద్ధిని  సాకారం చేసే ఆచరణకు అసలైన చిరునామా కేసీఆర్‌. కేసీఆర్‌ ఒక ఆశ. ఆశయం. కేసీఆర్‌ ఒక భరోసా. ఆకాశంలో చందమామలా మన కంచంలో కొలువుదీరిన అన్నం మెతుకు.


- గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌


logo