శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 18, 2020 , 00:28:40

‘నేనే బాధితుడిని’

‘నేనే బాధితుడిని’

  • ఆరో అధ్యాయం కొనసాగింపు..

బాబ్రీ మసీదు పోరాటకమిటీ అటువంటి స్వతంత్ర ప్రతిపత్తిగల చరిత్రకారుల తీర్పుకు కట్టుబడి ఉంటామని తెలియజేసిందిగాని అది వీహెచ్‌పీకి ఆమోదయోగ్యం కాలేదు. వీహెచ్‌పీ చరిత్రకారుల నివేదికను పరిశీలించిన ఈ చరిత్ర పరిశీలకులు చెప్పేదేమంటే.. వీహెచ్‌పీ ఎక్కడా కూడా మందిరం అయోధ్యలోని రామజన్మభూమివద్ద ఉండేదని నిర్ధారించేందుకు ఏ ఒక్క సంస్కృత శ్లోకాన్ని ఉటంకించలేదనేది ప్రజలకు విస్మయాన్ని కలిగించగలదని. ఒక వేళ అటువంటి విశ్వాసమే ఆ రోజుల్లో గనుక ఉండి ఉంటే, ఆ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా పలు వైష్ణవ గ్రంథాలు తప్పక పేర్కొని ఉండేవని. 

వాళ్లింకా ఏమన్నారంటే.. ‘బాబ్రీ మసీదు నిర్మించి దాదాపు యాభైయ్యేళ్లయినప్పుడు తులసీదాసు 1575-76 ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన తన ‘రామచరిత మానస్‌' సృజియించటం జరిగింది. అది అత్యంత శ్రద్ధతో హిందీలో రాయబడిన రామాయణ గాథ. ఒక వేళ తన ఆరాధ్య దైవం రాముని జన్మస్థానం ధ్వంసం చేయబడి, అక్కడ నిర్మించిన దేవళం నేలమట్టం గావించబడి.. ఆ స్థలంలో మసీదు నిర్మాణం జరిగిఉంటే, అటువంటి హృదయ విదారక ఘటనకు అక్షరరూపం ఇవ్వకుండా వుంటాడనేది అసలు నమ్మే విషయమేనా?’ అని. 

ఇక బాబ్రీ మసీదు నిర్మాణంలో వాడిన 14 నల్లరాళ్లపై ఇస్లాంకు చెందని మూర్తి చిత్రణ బట్టి చూస్తే, ఆ రాళ్లు ధ్వంసం చేయబడిన మందిరానికి సంబంధించినవేననే వీహెచ్‌పీ వాదనకు, ఎదురుపక్షం చరిత్ర పరిశీలకుల సమాధానమేమంటే.. ‘మేము పలువురు చరిత్రకారుల్ని సంప్రదించాం. అలా సంప్రదించినవారిలో దేవాంగన్‌ దేశాయ్‌, ధకే, కృష్ణదేవ, యన్‌పీ జోషీ, ఆర్‌సీ శర్మలు ఉన్నారు. సాధారణంగా వారందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన అంశమేమంటే.. కొన్ని శిల్పాలను బట్టి చూస్తే, అందులో కొన్ని క్రీ.శ. తొమ్మిది, పది శతాబ్దాలకు చెందినవిగా కన్పిస్తున్నాయి. కనుక ఆ నల్లరాతి స్తంభాలన్నీ ఒకే కట్టడానికి చెందినవని చెప్పేందుకు వీల్లేదు. ఆ రాతి స్తంభాలపైని శిలాకృతులు భారతదేశంలోని తూర్పు ప్రాంతానికి చెందిన వాటిని పోలి ఉన్నాయి. 

వీహెచ్‌పీ గట్టిగా వాదించే మరో విషయం- మసీదులోను, గోరీలోనూ దొరికిన నల్లరాతి స్తంభాలు ఒకేరకమైన కట్టడానికి చెందినవని అనే విషయంపై సుదీర్ఘంగా స్పందిస్తూ.. వాళ్లు చెప్పిందేమంటే-‘ స్తంభాల మందంలోనూ, శైలిలోనూ దానికంటే ముఖ్యంగా వాటిల్లో స్తరపరమైన ఐక్యత లోపించినందువల్ల వాళు చెప్పింది సంపూర్ణంగా కాదనవలసి వస్తూంది.’ పైగా వాళ్లు గట్టిగా చెప్పిందేమంటే.. ‘బాబ్రీ మసీదులో వాడిన రాళ్లు అలంకరణ నిమిత్తం బయటినుంచి అక్కడికి తెప్పించి ఉండవచ్చు’నని.

 ఇక రాళ్లమీద చెక్కిన విషయానికొస్తే.. వీహెచ్‌పీ పక్షంవారు వాటిపై వైష్ణవ చిహ్నాలున్నాయనే దానిని వీళ్లు అంగీకరించటం లేదు. శంఖు, చక్ర, గద, పద్మాలు లేకుండా ఏదీ కూడా వైష్ణవ రీతి, చిత్ర రీతి అని ఏ వైష్ణవుడుగానీ, చరిత్ర పరిశీలకులుగాని చెప్పజాలడు. అలా విష్ణువుతో ముడిబడివున్న ఆ చిహ్నాలు మనం విడగొట్టి చూడజాలం అన్నారు. 

ఇక ఆర్కియలాజికల్‌ సర్వేవారు 1975 నుంచి 1980 వరకు ప్రొఫెసర్‌ బీబీ లాల్‌గారి పర్యవేక్షణలో నిర్వహించిన తవ్వకాలలో లభించిన ఆధారాలనుబట్టి కాల్చిన ఇటుకల స్తంభాల పీఠాల విషయంలో బాబ్రీ మసీదు పోరాట కమిటీ పురాతత్వ శాస్త్రజ్ఞులు వివరించిందేమంటే- ఇటుకరాళ్ల కట్టడం 13వ శతాబ్ది నాటికే పడిపోయి, వాడకంలో లేకుండా పోయి, అయోధ్యలోని మిగతా ప్రాంతాల్లో నివసించే ముస్లిములకు ఆవాస స్థానమయ్యింది. అయితే, రాముడు జన్మించిన స్థలంలో మసీదు నిర్మాణం జరిగిందనే పురాణగాథ 18వ శతాబ్ది చివరికి గాని వినిపించలేదు. ‘రాముని జన్మస్థలమైన ‘సీతా కీ రసోయి’ వద్దగల మందిరాన్ని ధ్వంసం చేశారనే బాగా అల్లిన కట్టుకథ 1850 నాటిది. అప్పటి నుంచి ఆ కల్పిత చరిత్ర విశ్వాసం ఆధారంగా మరింత కట్టుదిట్టంగా పునర్నిర్మించుకురావటమే జరిగింది’ అంటూ వారు వారి నివేదికను ముగించారు. 

ఆ కమిటీ చివరి సమావేశం 1991 ఫిబ్రవరి 6న జరిగింది. చంద్రశేఖర్‌ ప్రభుత్వం కొనసాగేందుకు కొంత సమయాన్ని అలా గడిపేసే ప్రక్రియగానే పనికివచ్చింది. వీహెచ్‌పీకి కూడ కాస్త ఊపిరి పీల్చుకునేందుకు కొంత సమయం కావలసి వచ్చింది. ఆ సమయంలో బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో మందిరం సమస్యను చేర్చి అయోధ్యలో వివాదంలో ఉన్న స్థలంలో రామమందిరం నిర్మించి తీరుతామన్నారు. 1991 ఏప్రియల్‌ 4న లక్షలాది మంది వీహెచ్‌పీ సమర్థకులు ఢిల్లీలోని బోట్‌క్లబ్‌ వద్ద ‘విశాల్‌ హిందూ సమ్మేళన్‌'లో పాల్గొనేందుకు అక్కడికి వచ్చి చేరారు. అంతకు పూర్వం ఢిల్లీలో నిర్వహింపబడిన ర్యాలీలన్నింటిలోకి అదే పెద్దది. 1991 మే నెలలో రాజీవ్‌ గాంధీ హత్యగావింపబడటంతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ అర్థంతరంగా ఆగిపోయింది. ఎన్నికలు జూన్‌లో నిర్వహింపబడగా కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. తొలిసారిగా బీజేపీ యూపీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక అక్కడినుంచి కొత్త బంతితో ఆట మొదలయ్యింది. అందులో నేనే కీలక వ్యక్తిని-బాధితుణ్ని. దుష్ట పాత్రధారిని- మీరెలా అనాలనుకుంటే అలా అనండి. 

ఒకటిన్నర సంవత్సర కాలంలోనే దేశంలో చాలా మంది 1990వ సంవత్సరంలో బాబ్రీ మసీదుపై జరిగిన తొలి దాడిని, అప్పుడేం జరిగిందనేదానిని ఎలా మరచిపోగలిగారనేది చిత్రమే. పైగా 1989 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రాతిపదికపై బీజేపీ పూర్తి సహకారంతో జనతాదళ్‌ ప్రభుత్వం ఏర్పడి అకస్మాత్తుగా బీజేపీ సహకారాన్ని కోల్పోయి, బీజేపీ వైరంవల్లనే కొద్ది మాసాల్లోనే అధికారాన్ని కోల్పోవటం జరిగిన తరువాత అది గుర్తుండకపోవటం మరీ విచిత్రం. ప్రధాన కారణం అందరికీ తెలిసిందే. అదే మందిరం సమస్య. ఈ వైరుధ్య విషయం లేదా వైరుధ్యాన్ని పెంచగల ఆ విషయంలో ప్రజల వద్దకు ప్రతిజ్ఞలు చేస్తూ పోతున్నామనే సంగతి 1989 నాటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వ్యతిరేకోల్లాసపు ఉరవడిలో మరిచిపోయారు. ఇరు పక్షాల వైపునుంచి వాళ్ల వైఖరికి వ్యతిరేకమైనది జరుగుతూండటంతో వాళ్లోల్లో వత్తిడి పెరిగింది. వాళ్లిక కలిసి కొనసాగటం దుర్లభమని గ్రహించగలిగారు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo