ఆదివారం 29 మార్చి 2020
Editorial - Mar 05, 2020 , 23:15:34

జర్నలిస్టుల పతాక టీజేఎఫ్‌

జర్నలిస్టుల పతాక టీజేఎఫ్‌

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు.. అన్న నినాదంతో 2001, మే 31న బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్‌) ఆవిర్భవించింది. స్వపరిపాలన, అత్మగౌరవం కోసం సాగుతున్న ఉద్యమంలో కదం, కదం కలిపి రాష్ట్రసాధనే లక్ష్యంగా టీజేఎఫ్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది. 2001-2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా సాగిన ఉద్యమంలో ప్రతి అడుగులో, ప్రతి మలుపులో టీజేఎఫ్‌ తనవంతు పాత్ర పోషించింది. రాష్ట్ర అనివార్యతను వివరిస్తూ భావజాలవ్యాప్తి, తెలంగాణ కోసం రాజకీయపార్టీలను ఒక వేదిక మీదికి తీసుకురావడం, ఉద్యమంలో భాగమై ర్యాలీలు, ధర్నాలు, చర్చా వేదికలతో టీజేఎఫ్‌ రాష్ట్రసాధనలో భాగమైంది.


దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర సాధనోద్యమంలో తెలంగాణ జర్నలిస్టులను టీజేఎఫ్‌ భాగస్వామ్యం చేసింది. ‘జర్నలిస్టులు విశ్వ మానవులు గా ఉండాలి, జర్నలిస్టులకు ప్రాంతం ఏంటీ’? అన్న వాదాలకు టీజేఎఫ్‌ చెప్పిన సమాధానమొక్కటే.. ‘మేం మొదటగా తెలంగాణ భూమిపుత్రులం, ఆ తర్వాతే జర్నలిస్టులం’అని. భిన్నవాదనలు, ఎన్నో విమర్శలకు సమాధానాలు చెప్పుకుం టూ ముందుకు సాగింది టీజేఎఫ్‌.


రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ, సీపీఎం వంటి పార్టీలను సైతం తెలంగాణ నినాదంతో ఒకే వేదిక మీదకు తెచ్చిన ఘనత టీజేఎఫ్‌ది. సుందర య్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు నిర్వహించిన కలం కవాతు మొదలుకొని, రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీలో పార్లమెంట్‌ ముం దు టీజేఎఫ్‌ చేసిన ధర్నా, అసెంబ్లీలో తెలంగాణ అనే అంశాన్ని చర్చకురాకుం డా సమైక్యవాద పార్టీలు వ్యవహరించినప్పుడు మాక్‌ అసెంబ్లీ ఏర్పాటు, ఛలో అసెంబ్లీ, సాగరహారం వంటి పోరాటాల్లో అగ్రభాగాన నిలిచింది టీజేఎఫ్‌. డిసెంబర్‌ 23 ప్రకటన, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పు డూ ఒడుపుతో, ఓర్పుతో రాష్ట్రసాధన కోసం కృషిచేసిన సంస్థ టీజేఎఫ్‌.


రాష్ట్రం కోసం ఫోరంగా పోరాడిన టీజేఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త, టీజేఎఫ్‌ పోరాట వారసత్వానికి కొనసాగింపుగా 2014, మార్చి 9న నాం పల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన జర్నలిస్టుల జాతరలో టీయూడబ్ల్యూజేగా ఆవిర్భవించింది. అదే సభలో వర్కింగ్‌ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్‌ కార్డు లు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డు, ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సీఎం బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నారు. ఇండ్లస్థలాల విషయం న్యాయస్థానంలో కేసు ఉండటం వల్ల ఆలస్యం అవుతున్నది.


గత పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తూ గతాన్ని సమీక్షించుకొని, వర్తమానాన్ని విశ్లేషించుకొని భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకునేందుకు టీయూడబ్ల్యూజే మార్చి 8న రాష్ట్ర మహాసభలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించుకుంటున్నది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అదే పోరాట స్ఫూర్తితో ముందుకు పోదామని జర్నలిస్టు లోకానికి పిలుపునిస్తున్నది.

- ఎ.రమణకుమార్‌

( ఈ నెల 8న హైదరాబాద్‌లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల సందర్భంగా..)


logo