ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 03, 2020 , T00:15

భూమి ఉంది దేశం లేదు

భూమి ఉంది దేశం లేదు

నా గురించి నేను

తెలుసుకోకుండా

నాతో నేను మాట్లాడుకోలేను

నేను నోరు విప్పాలంటే

నా పుట్టుక, 

నా అయ్యమ్మల పుట్టుక తెలియాలి

అవును

నాకిప్పటిదాక నాకునేనని తెల్వదు

నాకునేను తెలుసుకోవటమంటేనే

దేశభక్తని ఇప్పటిదాకా ఎవరూ చెప్పలే

ఎంత దిక్కుమాలిన సిలబస్ ఇది

దిక్కుమొక్కులేనోనికి అన్నంబెట్టిన

నా చేతులు నన్ను నేను తెలుసుకోలేకపోతే

నా ఉనికి కల్లాస్ 

నా పేరు ద్రోహుల చిట్టాలో చేరకముందే

నన్ను నేను తెల్సుకోవాలి పద

నా గురించి నువ్వేమనుకుంటున్నవో

అర్థమవుతుంది

ఏంచేయను

నేను పుట్టిపెరిగిన గింతకాలానికి

మళ్లీ నేను నాలోకి పొమ్మంటే

ఎట్టెట్లా చెప్పండి

మనిషి 

మతమై కులమై మాయమై

మార్కెట్ సరుకైనాక

మనిషెక్కడున్నాడని 

ఎతికి చస్తుంటే

నన్ను పట్టుకుని నా మనిషితనాన్ని

చెప్పమంటుంటే

మనుషులెక్కడుంటారు?

నా నుంచి నేను 

ఎగిరిపోదామనిపిస్తుంది

మనుషుల గూడు కట్టుకుని

పిట్టల్లా ఎగిరిపోవాలనుంది

నన్ను నిజనిర్ధారణ చేసేందుకు

డీఎన్‌ఏ దాకా పోవాలి

నేను కాదు నా అయ్యమ్మల పుట్టుక

నా తాత ముత్తాతల మూడు తరాల పుట్టుక

ఏడు తరాల రక్తనమూనాలు చూసి

నేనేవరో నిర్ధారించుకోవాలె!

నాకు గడ్డం ఉన్నా లేకున్నా ఒకటే

డీఎన్‌ఏలో నేనన్నది

పాజిటివ్‌నా? నెగిటివ్‌నా?

త్వరగా పరీక్షలు చేయండి

నేను అన్నది అత్యవసర కేసు

నాలాంటి కోట్లమందిని పౌరసత్వ

ఆకురాయి మీద గీసి తేల్చాల్సిందే

లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్యం వర్ధిల్లే

ఓ నా భారతదేశమా

రాజ్యాంగం సాక్షిగా నీకూ పరీక్షా కాలమే

ఓ అయ్యలారా అమ్మలారా

మీ బిడ్డల్ని మీరే నిర్ధారణ సేయాలే

అన్ని గురుతులు పుట్టుమచ్చలు చూపాలే

తాతల తరాల్ని మీరే తేల్చాలి

ఇదేం చిత్రవిచిత్రం

ఈడ భూమి ఉంది దేశం లేదు

మనుషులున్నారు పౌరులులేరు

నది ఉంది నీళ్లు కనబడట్లే

ఎతికి పెడుదురుకానీ రండి

అన్నీ ఉండిలేనోణ్ణి అనుకున్నా

సంపదలున్న సన్యాసిననుకున్నా

అన్ని నిశానీలూ వేస్తున్నా

నేను ఈ నేల బిడ్డనా? కాదా??

ఓ భారతమ్మా

మేమంతా బిడ్డలం కాదమ్మా

నన్ను పాలిచ్చి పెంచిన దేశమా

నేను నీ బిడ్డనా కాదా చెప్పు

రాజ్యాంగమా కంఠం విప్పు

నాకు పౌరసత్వ పరీక్షే ప్రాణ రక్ష

నన్ను నేను కోల్పోయిన నేలపై

నిన్ను నువ్వు ఎట్లా బతికించుకుంటావో ఓ దేశమా!

రాజ్యాంగరక్షే సర్వజనుల రక్ష

- జూలూరు గౌరీశంకర్, 94401 69896logo