మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 20, 2020 , 16:44:56

బిడ్డలకు శిక్షణనిచ్చే కథలు

బిడ్డలకు శిక్షణనిచ్చే కథలు

‘పుట్టినరోజు’ కథ కల్పితమైన ఆదర్శవంతమైతే పర్యావరణంలోంచి జనించిన కథనే. ఇది వృక్షోత్సవ కథ. వృక్ష ప్రాణి పుట్టినరోజు ఇతివృత్తం చేసి రాసిన కథ. చిన్ని పుట్టినరోజుకు రమ్మని మిత్రుల ఇంటికి వెళ్లి మరీ మరి చెప్పి వస్తాడు. చిన్ని అంటే స్నేహితుడి పుట్టినరోజు,వాళ్ల చెల్లెలు పుట్టినరోజో అని మిత్రులంతా అనుకుంటారు. నిజానికి చిన్ని అంటే ఓ సంవత్సరం క్రితం నాటిని మొక్కపేరు. దాన్ని తాను పెంచినట్లే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటి పుట్టినరోజును ఒక వేడుకగా వృక్షోత్సవంగా ఓ పండుగలా చేసుకోమని ఈ కథ చెబుతుంది.

పిల్లల్ని పిల్లల్లా పెంచక, స్వంత ఆస్తుల్ని రెట్టింపు చేసుకుంటున్నట్టు పెంచే విధానం కుటుంబ వ్యవస్థలో పెరిగి పోతుందిప్పుడు. మారడం లేదు. బిడ్డలకు తగిన శిక్షణ ఇవ్వడంలో కుటుంబం, విద్యావ్యవస్థ తగిన విధంగా ఇవ్వకపోవడానికి ప్రధానకారణం వాటిలో మార్పురాకపోవడమే. ఆడ, మగ బిడ్డలు సమానులు కావాలంటే పెంపకంలో ఆ భావజాలం తల్లిదండ్రులకు చైతన్యవంతంగా ఉండాలి.

దేశంలో ఉద్యమాలకు కొదవ లేదు. సమస్యలున్నచోటే ఉద్యమాలుంటాయి. ఇవి రాజకీయ, ఆర్థిక సమస్యల్ని పట్టించుకున్నంతగా సామాజిక సమస్యల్ని పట్టించుకోవడం లేదు. వర్తమానంలో వృద్ధాప్య సమస్య ఒకటైతే,బిడ్డల పెంపకం సమస్య మరొ కటి. ఈ దేశ బాల్యాన్ని తల్లిదండ్రులకు, విద్యావ్యవస్థకు ఒక ముడిపదార్థంగా మార్చేస్తున్న కాలంలో పిల్లలు జీవిస్తున్నారు. కాస్తంత పెరిగిన పిల్లలు తమ మాట వినడంలేదని తల్లిదండ్రు లు చెబుతుంటే అధ్యాపకులు మరోవిధమైన అభియోగం మోపుతున్నారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులను ఎదిరించలేరు. మాట్లాడేశక్తి తక్కువ. తల్లిదండ్రులు చాటునే పెరగాలి. వాళ్లకు స్వాతంత్య్రం ఉందా? పిల్లలకు ఆనందాలు ఉంటాయి కదా! స్వేచ్ఛ ఉండాలి కదా! సంతోషాలుంటాయి కదా! అమాయకంగా యేడ్చే ఏడ్పులుంటాయి కదా! అల్లరి చేయడం సహజ స్వభావం కదా! అన్నింటికి మించిన చూపులుంటాయి కదా! వాళ్ల సహజత్వాల్ని మొగ్గలు వేయకముందే చిదిమేస్తే ఎలా? పిల్లల్ని పిల్లల్లా పెంచక, స్వంత ఆస్తుల్ని రెట్టింపు చేసుకుంటున్న ట్టు పెంచే విధానం కుటుంబ వ్యవస్థలో పెరిగి పోతుందిప్పుడు. మారడం లేదు.

 బిడ్డలకు తగిన శిక్షణ ఇవ్వడంలో కుటుంబం, విద్యావ్యవస్థ తగిన విధంగా ఇవ్వకపోవడానికి ప్రధానకారణం వాటిలో మార్పురాకపోవడమే. ఆడ, మగ బిడ్డలు సమానులు కావాలంటే పెంపకంలో ఆ భావజాలం తల్లిదండ్రులకు చైతన్యవంతంగా ఉండాలి. దేశంలోని అన్నివర్గాల పిల్లలు సమానంగా పెరగడం లేదు. ఆర్థిక, కుల, మతతత్తాలు పెంపకంలో ఎంతో ప్రభావం చూపుతున్నాయి. బిడ్డల పెంపకంలో తగిన శ్రద్ధ కనపర్చాలనీ వాళ్ల సహజ మానసిక ప్రపంచం విస్తరించాలన్న ఉద్దేశంతో నిజమాబాద్‌ జిల్లాలోని పెద్ద కథారచయితలు చిన్న పిల్లల పెంపకంలో ఉండవలసిన భావజాలం గల కథలు రాయడం, వాటిని సంకలనంగా వేదకుమార్‌ తీసుకురావటం సంతోషంగా ఉన్నది. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిన్న చిరుదీ పం వెలిగించాలన్న భావనతో ఈ సంకలనం వచ్చిందని భావిం చాల్సి ఉన్నది. ఈ రచయితలకు అభినందనలు.

ఈ సంకలనంలో తొమ్మిది కథలున్నాయి. దారం గంగాధర్‌ ‘వృక్షో రక్షితి రక్షితః’, తొగర్ల సురేశ్‌ ‘ఓ కుందేలు కథ’, ప్రణవి‘కోయిలమ్మ’, గరిశకుర్తి రాజేంద్ర ‘నిజాయితీకి బహుమతి’, డాక్టర్‌ నమిలికొండ సునీత ‘మార్పు’, శ్రీకాసుల ‘పుట్టిన రోజు’, హరిరమణ ‘సహాయం’, కళాగోపాల్‌ ‘సురభి’, ప్రభాదేవి ‘తగినశాస్తి’లోని వస్తురూపాలు విలక్షణమైనవి,భిన్నమైనవి. మూడు నాలుగు కథలు శిల్పరీత్యా, నిర్మాణరీత్యా, శైలి రీత్యా కాస్త పల్చ ని వ్యక్తీకరణలో ఉన్నా రచనకు ఎన్నుకున్న కథావస్తువు బాగానే ఉంది. ఈ కథలన్ని పిల్లల కథా వస్తువుకే ప్రాధాన్యమిచ్చాయి. ఇవి పిల్లల మానసిక ఎదుగుదలకు, చైతన్యానికి సహాయపడే కథలే. కథ కంచికి వెళ్లినా వాటిలో ఆశించిన మార్పు పిల్లల హృదయాలలో నిలిచి ఉంటుందనే భావిస్తాను.

‘సురభి’ మంచి కథ. గిరిజన జీవితం, వాతావరణంలోంచి రూపొందింది. గిరిజనులు అడవి ఒడిలో పెరుగుతున్నారు గానీ గిరిజన బిడ్డ అయిన సురభి అందులోంచి బయటపడలేక పోయింది. సురభి గిరిజన బాలిక. ఆమెకున్న చైతన్యం మంచితనం, అమాయకత్వం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. తాతతో గిరిజన భాషలో మాట్లాడిన వాక్యాలు వినసొంపుగా ఉన్నాయి. సురభి తమ్ముని ప్రాణం కాపాడటం కోసం కొండచిలువను ఢీ కొంటుంది. తలపడి తమ్మున్ని రక్షించగలిగింది కాని ఆమె బలైపోయింది. సాహస బాలికకిచ్చే అవార్డుకు ఆమె ఎన్నికైనా దాన్ని సురభి అందుకోలేకపోయింది. ఆ పాపకున్న సాహసం, త్యాగం మరువలేనిది. ఈ కథలో పిల్లలకో లక్ష్యాన్ని నేర్పుతుంది. అడవిలో బతికిన సురభిని అడవే కొండచిలువ రూపంలో పొట్టనపెట్టుకున్నది.

‘వృక్షో రక్షితి రక్షితః’ అనే కథ పాలకులు మొక్కలు నాటించే వాతావరణంలోంచి రాలేదు. ప్రజలు ప్రకృతినీ, పర్యావరణా న్ని, ఎట్లా రక్షించుకోవాలో అందులోంచే ఈ కథ పుట్టింది. తాత మనమని చేత మొక్కల్ని నాటించడం కన్నా మించి, వాటిని ప్రేమించేతత్వాన్ని బోధిస్తుంది ఈ కథ. ఒక్క చెట్టు ఐదువందల యాభై లీటర్ల ఆక్సీజన్‌ ఇస్తుందట. సంవత్సరానికి సరిపడే ఆక్సిజన్‌కు ఖరీదు కట్టాలంటే తొమ్మిది లక్షలంట. ఒక్కో మనిషి జీవి త కాలానికి కనీసం ముగ్గురు మనుషులకు సరిపోయేంత ఆక్సిజన్‌ను అందిస్తుందన్న ప్రాథమిక సమాచారాన్ని తాతమనుమనికి బోధిస్తాడు. పెద్దల ద్వారా పిన్నలు నేర్చుకునేవి వ్యసనాలు కావు. భవిష్యత్‌ సమాజ దర్శనమని పాఠకునికి తెలిసేట్లు చెప్పింది ఈ కథ.చెట్లను పిల్లల సంతోషాలలో భాగంచేసి, ఉత్సా హ పరిచి, వృక్షాలను మనం రక్షిస్తే అవి మానవజాతికి జీవం పోస్తాయన్న భావనను పిల్లల్లో నింపిన కథ ఇది. ప్రతి ఇంటికి ఒక పెరడుండాలి. పెరట్లో ఇంట్లో పిల్లలు పెరిగినట్లు మొక్కలు పెరగాలంటే అందుకు పిల్లల చేతే నాటించి, పెంచేట్లు అల్లిన కథ ఇది. ఇది చదువుతున్నట్లు కాక చెపుతున్నట్లుగా వాడిన శైలి బాగుంది.

ఓ కుందేలు కథ పిల్లలకు తప్పక నచ్చుతుంది. పశుపక్షాదులపై ప్రేమ సహజంగా ఉండాలనీ, రక్తసంబంధాలలో ఉండే గాఢానుబంధంలాగా పశుపక్షాదులపై కలిగేట్లు రాసిన కథ ఇది. అమ్మానాన్న ఓ పాప ఔర్‌ కుందేలుతో సాగిన కథ ఇది. పాప బర్త్‌డే గిఫ్టుగా నాన్న కుందేలు పిల్లను బహుమతిగా ఇస్తే పాప కుందేలు పిల్లతో గాఢానుబంధం పెంచుకుంటుంది. నాన్న 25 లక్షల బ్యాంకు లోనుకు వెలితే బ్యాంక్‌ మేనేజర్‌ మీ ఇంటి కుందే లు పిల్ల కావాలంటాడు. అందుకు పాపతో నీకు మరో కుందేలు పిల్లను కొనిస్తానంటే ఆ పాప ఎంత బాధపడిందో. దాంతో ఆ పాప కొనిచ్చే కుందేలు పిల్లను ఆ బ్యాంకు మేనేజర్‌కే ఇవ్వమంటుంది. లోను కావాలో నేను కావాలో తేల్చుకోమంటుంది. నేనైతే కుందేలు పిల్లను విడవనంటుంది. తండ్రి బిడ్డను అర్థం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలతో ఉన్న అనుబంధం అనిర్వచనీయమైంది. అలాగే కుందే లు పిల్ల పట్ల పాపకు ఉన్నది కూడా అదే. పాప కుందేలు పిల్లను వదులుకోదు. తల్లిదండ్రులు పాపను వదులుకోలేనంత అనుబంధం కుందేలు పిల్లలో చూపించారు. అనుకున్నది నెరవేరితే పట్టరానంత సంతోషం కదా! ఆ సంతోషాన్ని పిల్లల్లో కలిగిస్తూ ఈ కథ తప్పక కలిగిస్తుంది.

కుందేలు కథకు కోయిలమ్మ కథకు వైవిధ్యముంది. పంచతంత్రం కథలాగా ఇందులో రెండు కోయిలలుంటాయి. ఒకటి వృద్ధ కోయిల. మరొకటి పిల్ల కోయిల. పిల్ల కోయిల మూర్ఖత్వం వల్ల, బుద్ధి మాంద్యం వల్ల తల్లి కోయిల మరణించింది. తల్లి లేవలేనిస్థితిలో ఉండబట్టే పిల్ల కోయిల ఇప్పపువ్వు తెచ్చి చెట్టు తొర్రలో ఎండబెడుతుంది. ఎండిన ఇప్పపువ్వును చూసి పిల్ల కోయిల మూర్ఖంగా తల్లి ఉన్నచోటున కూడా ఇప్పపువ్వుకు కాపలా లేదని కోపంతో ఓరోజు బండతో తల్లి తలమీద కొట్టి చంపుతుంది. తర్వాత ఎప్పటిలాగే ఇప్పపువ్వు తెచ్చి తొర్రలో ఆరపోస్తుంది. ఎండిన ఇప్పపువ్వును చూసి పిల్ల కోయిల పశ్చాత్తాప పడుతుంది. ఎండిన ఇప్పపువ్వు తక్కువగా అగుపిస్తుందనీ ఎండకముందు అది ఎక్కువగా ఉం టుందనే తెలియక కోపంతో తల్లిని చంపుకున్నానని బాధ పడుతుంది. తన కోపమే తల్లి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుందని పశ్చాత్తాపపడుతుంది. పిల్లలకు తన కోపమే తన శత్రువని తెలియవచ్చేట్లు రాసిన కథ. పిల్లలు తమ తప్పును తామే దిద్దుకునేదానికి రచయిత ఎక్కువ విలువనిచ్చి రాశాడు.బాల్యంలోనే ఇలాం టి మార్గాలుండే దారులు పడాలని ఈ కథ ధ్వనింపచేసింది.

‘మార్పు’ కథలో వంశీ, కీర్తి స్నేహితులు. వంశీ అల్లరిగడుగ్గాయి. కీర్తి తన స్నేహితుడు మంచివాడు కావాలని తోటకు తీసుకెళ్లి రెండు కోతుల్ని చూయిస్తాడు. ఒక కోతి పండు తెంపుకు తింటే మరో కోతి పండ్లను కిందికి పారేయటం, కొమ్మల్ని విరిచేయడం చేస్తుంది. రెండుకోతుల్లో నీకు ఏ కోతి నచ్చిందిరా అం టే మొదటి కోతే నంటాడు. రెండవ కోతి స్వభావం తనలో ఉందని వంశీ గ్రహించి మారిపోతాడు.‘సహాయం’ పిల్లలు చదవదగ్గ కథ.రవికి మొండితనం ఉంది. కానీ మంచివాడు. సైకిల్‌పై పాఠశాలకు రోజు వెళతామని తల్లిని డబ్బులడుగుతాడు. తల్లి డబ్బులు జమచేస్తుంది. డెంగ్యూ వ్యాధితో హాస్పిటల్‌లో ఓ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంటుం ది. ఆ పాప తల్లి ఎంతమందిని అప్పు అడిగినా ఇవ్వనప్పుడు రవి తల్లి సహాయ పడుతుంది. రవికి కోపం వస్తుంది. డెంగ్యూ వ్యాధి సోకిన పాప రవి తల్లి వల్లనే బతుకుతుంది. అందుకు పల్ల వి తల్లి అప్పుగా ఇచ్చిన డబ్బును రవి తల్లికి అందిస్తు కాళ్లమీద పడుతుంది. నీ వల్లనే నా బిడ్డ బతికింది. నీవు దేవతవని అంటున్నప్పుడు రవిలో మార్పు వస్తుంది. నా కాంక్ష కన్నా అమ్మ పరోపకారం చేసి ఓ ప్రాణాన్ని కాపాడింది.అన్నిధర్మాల కన్న ప్రాణం నిలుపుటం కోసం సాయపడటం ఉత్తమ ధర్మమని చెప్పడమే ఈ కథ పరమార్థం. పిల్లల మనస్తత్వానికి నచ్చే విధంగా రాసిన కథ ఇది.

‘నిజాయితీకి బహుమతి’ కథ పిల్లలను ఆలోచింపచేసే కథ. అమ్మమ్మకు ఒకడే మనుమడు. భర్త, కొడుకు, కోడలు మరణించారు. వృద్ధాప్యం మీదపడ్డా చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చదివిస్తుంది మనుమణ్ణి. ఓ రోజు మనుమడికి బేంచి కింద యాభై రూపాయలు దొరుకుతాయి. వాటితో మంచాన పడ్డ నానమ్మకు మందులు తెద్దామనుకుంటాడు కానీ నానమ్మ నిరాకరిస్తుంది. దొరికిన డబ్బయినా అది దొంగ డబ్బే. తిరిగి ఇచ్చేయమని మనుమనికి నచ్చచెప్పి పంపుతుంది. ఉపాధ్యాయునికి దొరికిన యాభై రూపాయలు ఇవ్వడం.. అందుకు ఉపాధ్యాయుడు, పిల్లలంతా అభినందించడం.. స్టేజీ మీద గౌరవం పొందడానికి కారణం నాయనమ్మేనని మనుమడు గ్రహిస్తాడు.పరుల సొమ్ము కు ఆశపడరాదనే నీతిని, పిల్లకు కుటుంబమే పరోపకారాన్ని, నిజాయితీని బోధించాలని ప్రబోధించిన కథ ఇది.
‘పుట్టినరోజు’ కథ కల్పితమైన ఆదర్శవంతమైన పర్యావరణంలోంచి జనించిన కథనే. ఇది వృక్షోత్సవ కథ. వృక్ష ప్రాణి పుట్టినరోజు ఇతివృత్తం చేసి రాసిన కథ. చిన్న పుట్టినరోజుకు రమ్మని మిత్రుల ఇంటికి వెళ్లి మరీ మరి చెప్పి వస్తాడు. చిన్ని అంటే స్నేహితుడి పుట్టినరోజో, వాళ్ల చెల్లెలు పుట్టినరోజో అని మిత్రులంతా అనుకుంటారు. నిజానికి చిన్ని అంటే ఓ సంవత్సరం క్రితం నాటిని మొక్కపేరు. దాన్ని తాను పెంచినట్లే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటి పుట్టినరోజును ఒక వేడుకగా వృక్షోత్సవంగా ఓ పండుగలా చేసుకోమని ఈ కథ చెబుతుంది.

ఈ సంకలనంలోని పిల్లల కథల్ని పెద్దలు చదవడంతో పాటు పిల్లలు కూడా చదివేట్లు చేస్తాయి. పిల్లలలో పర్యావరణం మీద, పశుపక్షాదుల మీద, తోటి మనుషుల మనస్తత్వాల మీద తీవ్ర ప్రభావం వేస్తాయి. పశ్చాత్తాపాలతో కూడిన ఇలాంటి కథలు చదువడం వల్ల ఒక సామాజిక స్పృహ, చైతన్యం పిల్లల్లో పెరుగుతుంది. తన ఆనందం కన్నా ప్రపంచ ఆనందమే తన ఆనందంగా భావించుకునే విశాల దృక్పథం పిల్లల్లో ఈ కథల వల్ల కలుగుతుంది. ఇలాంటి కథా సంకలనాలు పిల్లల్లో ప్రేమాను రాగాలతో పాటు, సామాజిక బాధ్యతనూ, భవిష్యత్‌ నిర్మాణా నికి సంబంధించిన ఎరుకను కలిగిస్తాయన్న భరోసాను ఈ సంకలనం కలిగిస్తుంది.


- డాక్టర్‌ నాళేశ్వరం శంకరం
94404 51960


logo
>>>>>>