మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Jan 18, 2020 , 23:40:18

కేజ్రీవాల్‌, ఎక్కడున్నావయ్యా!

కేజ్రీవాల్‌, ఎక్కడున్నావయ్యా!

ఏది మంచి, ఏది చెడు అనే భావనలకు సంబంధించి ప్రజలు నిలువునా చీలిపోయిన ఈ దశలో ఆశయ సాధన కష్టమే కావచ్చు, కానీ దేశంలో జాతీయస్థాయిలో ఒక శూన్యం ఏర్పడి ఉన్నది. మళ్లీ 2013నాటి స్థితి నెలకొన్నది. ఆనాడు ఒక రాజధాని నగరంలోనే ఈ శూన్యం ఆవరించి ఉంటే ఇప్పుడు అదే రీతిలో దేశం ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నది. వైరుధ్యాలు ఉండవచ్చునని, భిన్న అభిప్రాయాలు కలవారిపై దాడులు జరుపవలసిన అవసరం లేదని నమ్మే ఒక నాయకుడి అవసరం ఉన్నది. పక్కదారి పడుతున్న దేశాన్ని చక్కదిద్దడానికి యువత ముందుకువచ్చింది. తాను కనిపిస్తే చాలు, యువత ఉత్తేజం పొందే ఒక నాయకుడు ఇప్పుడు కావాలి.

ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించి అప్పుడే న్యాయశాస్త్ర కళాశాల నుంచి బయటకి వచ్చాను. అది 2013లో-ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేసింది మా ఇంట్లో నేనొక్కడినే. ఆమ్‌ ఆద్మీ పార్టీ నా దృష్టిని ఆకర్షించడానికి కారణం ఉన్నది. ప్రధాన స్రవంతి రాజకీయపార్టీల మాదిరిగా కులాలు, మతాలు నానా రకాల చెత్త ఈ పార్టీలో కనిపించలేదు. ఈ పార్టీ ఢిల్లీలో ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం గురించి మాట్లాడింది. ముఖ్యమంత్రిగారు మాతో నడిచాడు, మాతో మాట్లాడాడు. మాలో ఒక్కడిగా కనిపించారు. ఎవరో పాత్రికేయులు రాసిపెడితే రాజకీయనాయకుడు మాట్లాడినట్టుగా ఆయన మాటల్లేవు. ఆచితూచి మాట్లాడటం లేదు. ఆయనది వామపక్ష భావజాలం కాదు, రైటిస్ట్‌ విధానాలు కావు. వ్యాగనార్‌ నడుపుకుంటూ తలకు మఫ్లర్‌ చుట్టుకొని చాలా సాధారణంగా కనిపించాడు. ఐఐటీలో చదువుకున్న ఈ ఆమ్‌ ఆద్మీ ఒక ముఖ్యమంత్రిగా- రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తిలేని మాలాంటి వారిని ఆకట్టుకున్నారు.


గత దశాబ్ది ఆరంభంలో కాంగ్రెస్‌ పార్టీ ఒకటి తర్వాత మరొక్కటి కుంభకోణాల్లో కూరుకుపోతున్నది. బీజేపీ మోదీ నాయకత్వంలోకి వస్తున్నదనే భయం పీడిస్తున్నది. ఈ దశలో చదువుకున్నవాళ్లు, చదువురానివాళ్లు అందరికీ ఆమ్‌ ఆద్మీ పార్టీని చూసినప్పుడు మనసు తేలికైంది. పాత వాసనలోంచి బయటపడ్డట్టయింది. 2013లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 28 సీట్లుంటే 2015లో 67 సీట్లకు బలం పెరిగింది. 2012 నవంబర్‌లో పుట్టిన అత్యంత చిన్న వయస్సున్న ఈ పార్టీ సాధించిన విజయాన్ని ఇష్టంలేని వాళ్లయినా సరే ప్రశంసించవలసిందే. దేశమంతా మందిర్‌-మసీదు, హిందూ-ముస్లిం, పాకిస్థాన్‌ వ్యతిరేకతతో కొన్నేండ్లుగా కొట్టుమిట్టాడుతున్నప్పుడు-అభివృద్ధిని సాధిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని నినదిస్తూ ఎన్నికల్లో గెలువడం సాధ్యమని కేజ్రీవాల్‌, ఆయన ప్రభుత్వం నిరూపించింది.

గత ఐదేండ్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చాలా మంచిపనులు చేసింది. మొహల్లా దవాఖానలు, పాఠశాలలు, ఉచిత విద్యుత్‌, మంచినీళ్లు-ఒక నాగరిక సమాజంలో ఏర్పర్చవలసిన సౌకర్యాలన్నీ అందించింది. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన సరి, బేసి విధానం సరైనది కాకపోవచ్చు. కానీ కాలుష్యాన్ని నివారించడానికి ఒక ప్రయత్నం మాత్రం జరిగింది. ఉచిత వైఫై, ప్రజా రవాణాను మెరుగుపర్చడం గమనిస్తే ప్రజల సౌకర్యాలే ప్రధాన ఎజెండా అని స్పష్టమవుతుంది. ఇవన్నీ సరే, కానీ ఒక్క విషయంలో మాత్రం రోగానికి తగిన చికిత్స జరుగలేదు. ఆ వ్యాధి రాజధాని నగరాన్ని పట్టి పీడిస్తున్న ‘హింస’.
వీధుల్లో హింస, కళాశాలల్లో హింస, మహిళలపై హింస ఇట్లా ఎన్నయినా చెప్పుకోవచ్చు.

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించగానే ఫిబ్రవరి 8వ తేదీలోగా ఇంకెంత హింసాకాండ జరుగుతుందేమోనన్న బాధ పట్టుకున్నది. కొన్ని నెలలుగా అసాధారణ సంఘటనలు మృత్యు భయాన్ని కలిగిస్తున్నాయి. కొంచెం వెనక్కిపోతే 2016 ఫిబ్రవరిలో- జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పైన, పలువురు పాత్రికేయులు, విద్యార్థులు, అధ్యాపకులపైన పాఠియాలా హౌజ్‌ కోర్టు ఆవరణలోనే దాడి జరిగింది. దేశభక్తులుగా చెప్పుకుంట్నున్నవాళ్లు దాడి చేశారు. ఇటీవలే 2019, నవంబర్‌లో పార్కింగ్‌ స్థలం విషయమై ఢిల్లీ పోలీసు అధికారులకు, న్యాయవాదులకు మధ్య గొడవ మొదలై విధ్వంసానికి, హింసకు దారితీసింది. రెండు పక్షాల వాళ్లు గాయపడటాలు జరిగాయి. న్యాయస్థానాలు రెండువారాల పాటు మూసివేయాల్సి వచ్చింది. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో, జేఎన్‌యూలో దార్యాగంజ్‌లో సంఘటనలు సిగ్గుచేటైనవి. వీటి గురించి ఇప్పటికే సామాజిక మాధమాల్లో చదివాం, చూశాం. 2016లో కెమెరాల సాక్షిగా దాడిచేసిన దుండగులను గుర్తుపట్టి కూడా ఇప్పటివరకు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదంటే అధికార పార్టీ వారికి ఎంత మద్దతు తెలుపుతున్నదో తెలుస్తున్నది.

మీరు ఏ రాజకీయ పార్టీ వారైనా కావచ్చు, కానీ ఈ దేశం ఎటుపోతున్నదో అనే ప్రశ్న మీలో తలెత్తలేదంటే మీ అంతరాత్మ చలించిపోవడం లేదంటే, మీకు రాత్రులు నిద్రపట్టడం లేదంటే, మీరు ఇసుకలో తలదూర్చిన ఉష్ట్ర పక్షి లాంటివారన్నట్టే. నన్ను చాలామంది అడుగుతుంటారు ఈ గొడవలతో నీకేం సంబంధం అని. నీ జీవితానికి ఏం ఇబ్బంది కలుగుతున్నదంటారు. అసలివన్నీ మీరు పట్టించుకోవడం ఎందుకని అంటారు. మిత్రులారా ఇది పెట్టిపుట్టినవాళ్ళ ఆలోచన. ఈ సందర్భంగా జర్మనీలో నాజీలు పడగెత్తినప్పుడు అక్కడి ప్రజలు పిరికితనాన్ని ప్రదర్శించడంపై ఫాస్టర్‌ మార్టిన్‌ నీమోలర్‌ మాటలు గుర్తుకువస్తున్నాయి. దక్షిణ ఢిల్లీ సమీపాన కులీనులు ఉండే డిఫెన్స్‌ కాలనీలోని పార్కులు పౌరసత్వ సవరణ చట్టంపై సమావేశం పెట్టుకోవడానికి ‘అనుమతి’ లభించలేదంటే నాకు గుర్తుకువస్తున్నది... ‘ఇప్పుడు వాళ్ల నా కోసం వచ్చారు’ అనే మాట.

కొన్ని వారాలుగా నన్ను ఒక సందేహం వేధిస్తున్నది- మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ? ఆయన వెలువరుస్తున్న బలహీనమైన ట్వీట్స్‌ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ పెద్ద మనిషి జామియా దగ్గర కానీ, జేఎన్‌యూలో కానీ కనిపించారా? పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ బయట దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక చిన్న నిరసన తెలిపారా? గాయపడిన విద్యార్థుల దగ్గరికి వెళ్లి పరామర్శించారా? ఇండియాగేటు దగ్గర నిలబడి రాజ్యాంగ పీఠికను చదివారా? పౌరులారా మీకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందంటూ ధైర్యాన్నివ్వవలసింది. జేఎన్‌యూలో విద్యుత్‌ సరఫరా (రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అంశమే) ఎందుకు ఆగిపోయిందని ఆయనే చెప్పాలి. ఇదే మీరు చదువుకున్న ఐఐటీలో జరిగితే ఎలా స్పందించేవారు? ఒకప్పుడు మీరు లెఫ్టినెంట్‌ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మ అంటూ నిరసన ప్రదర్శన చేశారు కదా? మళ్లా అటువంటి ప్రదర్శన మీరు జరుపాలంటే ఈ ఢిల్లీ ఇంకా ఏమేం జరుగాలి? పాకిస్థాన్‌లో నంకానా సాహిబ్‌పై దాడి విషయమై చర్య తీసుకోవాలని మీరు డిమాండ్‌ చేశారు. మరీ ఢిల్లీ పౌరుల పరిస్థితి ఏమిటి? మాటలు కాదు, చేతలు కావాలి.

ప్రజా సంబంధాల నిర్వహణపై ఆమ్‌ ఆద్మీ పార్టీలో పెద్ద కసరత్తే జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను ఒక్క ఆప్‌ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఖండించడం లేదు. ఆయనకు ప్రశాంత్‌ కిషోర్‌ కంపెనీ సలహాలు ఇస్తున్నదని స్పష్టమే. ఆయన ప్రజల నాడి తెలుసుకొని మెదులుతున్నట్లున్నారు! తమ ఓటరు పునాది చెదిరిపోతున్నదని భయమా? రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండిస్తే ఒక పెద్ద సామాజిక వర్గానికి ఆగ్రహం కలుగుతుందన్న జాగ్రత్తనా? ఓటర్లపై వీరి నమ్మకం ఇంత బలహీనంగా ఉన్నదా? హింసలో కూరుకుపోయి వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే ఆందోళన కలుగుతున్నదా? శాంతియుత నిరసనలు తెలిపితే రాష్ట్రపతి పాలన వచ్చి అధికారం కోల్పోతామనుకుంటున్నారా? వారేమన్న అనుకోవచ్చు, కానీ ఇదొక బాధాకరమైన దృశ్యం. వాస్తవాలు మాట్లాడుతూ అధికారానికి వచ్చిన నాయకుడు, పార్టీ ఇంత దయనీయంగా వ్యవహరిస్తున్నది!

ఏది మంచి, ఏది చెడు అనే భావనలకు సంబంధించి ప్రజలు నిలువునా చీలిపోయిన ఈ దశలో ఆశయ సాధన కష్టమే కావచ్చు, కానీ దేశంలో జాతీయస్థాయిలో ఒక శూన్యం ఏర్పడి ఉన్నది. మళ్లీ 2013నాటి స్థితి నెలకొన్నది. ఆనాడు ఒక రాజధాని నగరంలోనే ఈ శూన్యం ఆవరించి ఉంటే ఇప్పుడు అదే రీతిలో దేశం ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నది. వైరుధ్యాలు ఉండవచ్చునని, భిన్న అభిప్రాయాలు కలవారిపై దాడులు జరుపవలసిన అవసరం లేదని నమ్మే ఒక నాయకుడి అవసరం ఉన్నది. పక్కదారి పడుతున్న దేశాన్ని చక్కదిద్దడానికి యువత ముందుకువచ్చింది. తాను కనిపిస్తే చాలు, యువత ఉత్తేజం పొందే ఒక నాయకుడు ఇప్పుడు కావాలి.

ఒకప్పుడు వీధుల్లో నిలిచి, జనాన్ని ఆకర్షించిన పోరాట యోధుడు కేజ్రీవాల్‌ ఇప్పుడు ఏవో కొన్ని బలహీనమైన ప్రకటనలతో నిశ్చేష్టుడై ఉండిపోతున్నారు. అవును ఆయన ఇప్పుడు చాలా తెలివైన ‘రాజకీయ నాయకుడు’. ఈ మార్పు తప్పనిసరి అని ఆయన అనవచ్చు. కానీ, ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చింది ప్రజలే అని ఆయన గుర్తుకుతెచ్చుకోవాలి. ఆ ప్రజలే ఇప్పుడు మళ్లీ వీధుల్లోకి వస్తున్నారు. ఆయన తమతో కలువాలని కోరుకుంటున్నారు. భిన్నవృత్తుల వాళ్లు, మానవహక్కుల కార్యకర్తలు, అధ్యాపకులు... విద్యార్థులు కూడా. వారు చర్చను ముందుకు తెస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా సాధారణమే అని నమ్ముతున్న తమ ఛాందసవాద కుటుంబసభ్యులను ఒక్కొక్కరిని మారుస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని ఎండగడుతున్నారు. మళ్లా చట్టబద్ధ పాలనను వీరు తేగలరనే నమ్మకం నాకున్నది.

2013, జూన్‌ 27న అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ఉద్దేశించి కేజ్రీవాల్‌ అపహాస్యం చేస్తూ అన్నారు. ఢిల్లీ పోలీసులు ఆమె నియంత్రణలో లేరని ఆమె ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి అని అన్నారు. మనకు అటువంటి నిస్సహాయ ముఖ్యమంత్రి అవసరమా?-
(వ్యాసకర్త: ప్రముఖ న్యాయవాది) ‘ది వైర్‌' సౌజన్యంతో....


logo