
న్యాల్కల్, జనవరి 7: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో స్వయంభూగా వెలిసిన సిద్ధివినాయకుడి కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. స్వామివారి 222వ జయంత్యుత్సవాల ముగింపును పురస్కరించుకుని కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిళల్లో ఏర్పాటు చేసిన మండపంలో వేదపండితులు శాస్త్రోక్తంగా బుద్ధి, సిద్ధిలతో సిద్ధివినాయక స్వామివారికి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ సంగయ్య, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సిములు, ఉపాధ్యక్షుడు రమేశ్, కోశాధికారి నీల రాజేశ్వర్, సెక్రటరీ ఉల్లిగడ్డ బస్వరాజ్, సంయుక్త కార్యదర్శులు చిద్రిలక్ష్మణ్, కమిటీ సభ్యులు అల్లాడి వీరేశం, గణేశ్దీక్షిత్, కోబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, సిద్ధప్ప, దేవిదాస్ కులకర్ణి, రాజేశ్వర్, రాజ్‌కుమార్, అశోక్, మేనేజర్ కృష్ణ, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.