
అంగడి రూపు మారింది.. పోటీతత్వం పెరిగి, నడక చేర్చింది. అంగడే పల్లెటూర్లు, వీధులు, వినియోగదారుల వద్దకు వస్తున్నది. గతంలో పది, పదిహేను పల్లెటూళ్ల మధ్య ఉన్న పెద్ద గ్రామంలో ఒక రోజు అంగడి జరిగేది. ఆ రోజే చుట్టుపక్కల గ్రామాల వారు అంగడికి వచ్చి, తమకు కావాల్సిన వస్తువులు, సరుకులు తీసుకెళ్తుండే. పట్టణాల సంగతి పక్కన పెడితే.. గ్రామాల్లో మాత్రం ఏ వస్తువు అవసరమైనా అంగడి కోసం వేచి చూడాల్సి వస్తుండే. రోజురోజుకూ మారుతున్న పరిణామాలు.. ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడిన ప్రజల జీవన శైలికి అనుగుణంగా వ్యాపార పంథా మారింది. అంగడి నేరుగా ఇండ్ల వద్ద వాలిపోతుండగా, వినియోగదారులకు సౌలభ్యమైంది. అంగడి మారిన తీరుపై ఈ వారం సండే స్పెషల్‌లో మీ కోసం..
‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అనేది ఓ సామెత. గతిస్తున్న కాలానికి అనుగుణంగా మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో పది, పదిహేను పల్ల్లెటూళ్ల మధ్య ఓ పెద్ద గ్రామం, ఆ గ్రామంలో వారానికి ఒక రోజు అంగడి సాగేది. ఆ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజు దొరకని సరుకులు, వస్తువులు వారానికి ఒకరోజు నిర్వహించే అంగడిలో అందుబాటులో ఉంచి ప్రజల ఇబ్బందులను తీర్చేవారు. ఆ రోజుల్లో అంగడి ఉన్న రోజు చుట్టుపక్కల గ్రామాల వారు అంగడికి వచ్చి తమకు కావాల్సిన వస్తువులు, సరుకులు కొనుగోలు చేసేవారు. పట్టణాల సంగతి పక్కన పెడితే.. గ్రామాల్లో మాత్రం ఏ వస్తువు అవసరమైనా అంగడి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా, అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఇప్పుడు అంతా అందుకు భిన్నమైన పరిస్థితి. గతంలో అంగడి నిమిత్తం ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే పరిస్థితి ఉండగా, ఇప్పుడు మాత్రం అంగడే నడిచి పల్లెటూర్లు, వీధులకు వస్తున్నది. వ్యాపారం తీరు మారింది. పోటీ తత్వం పెరిగి అంగడి నడక నేర్చింది, అంగడి నేరుగా ఇండ్ల వద్ద వాలిపోతున్న వైనంపై ప్రత్యేక కథనం.
చిరు వ్యాపారుల మారిన వ్యాపార ధోరణి కారణంగా పట్టణాల్లోని వీధులు మొదలుకుని పల్లెటూళ్లకు సైతం కూరగాయలు సహా నిత్యావసర వస్తువులు కూడా ఇంటి ముందు దర్శనమిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు, కార్లు, మినీవ్యాన్లు సైతం సంచార దుకాణాలుగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. కొన్నేండ్లు వెనక్కి వెళ్లి చూస్తే గ్రామాల్లో అందుబాటులో ఉండని వస్తువులు, తిండి పదార్థాలు మాత్రమే వీధుల్లో తిరిగి విక్రయించేవారు. అయితే ఆ ఒరవడి కాస్త విస్తరించి ఇప్పుడు దాదాపు అన్ని సరుకులు ఇంటి వరకు వస్తున్నాయని చెప్పవచ్చు. దీనికి తోడు కార్పొరేట్ సంస్థలు అనుసరిస్తున్న ఆన్లైన్ కొరియర్ విధానంతో సెల్‌ఫోన్ ఉండి సంబంధిత సంస్థల యాప్‌లు అందుబాటులో ఉంటే చాలు, ఆర్డర్ చేయడమే తరువాయి సదరు వస్తువు ఇంటికే చేరిపోతున్నది. తిండి పదార్థాలను కూడా ఆన్లైన్ ఆర్డర్ ద్వారా ఇంటికి తెప్పించుకునే విధానం ప్రస్తుతం నగరాలకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడిప్పుడే పట్టణాలు, పట్టణాలకు సమీపంలోని పల్లెలకు విస్తరిస్తున్నది. ఆన్లైన్ సేవల విషయం ఎలా ఉన్నా.. పట్టణాలు, గ్రామాల్లో మాత్రం వీధుల్లో తిరుగుతూ సరుకులను అమ్మడం మాత్రం ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడిన ప్రజల జీవన శైలికి అనుగుణంగా వ్యాపారులు తమ పంథాను మార్చుకుంటున్నారనడంలో సందేహం లేదు.
కరోనా పరిస్థితులే కారణం..
అనుకోని ఉపద్రవంలా పరిణమించిన కరోనా తెచ్చిన విపత్తు అప్పటి వరకు ఉన్న పరిస్థితులకు భిన్నంగా పలు మార్పులకు కారణమైంది. నెలల తరబడి విధించిన లాక్‌డౌన్‌తో వ్యాపార రంగం కుదేలైన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్ మొత్తం మూత పడిన సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు చేరవేసేందుకు వ్యాపారులు అనుసరించిన ప్రత్యామ్నాయ మార్గమే ఇది. పప్పు దినుసులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు, బెడ్షీట్లు, చీరలు, దుస్తువులు ఒకటేమిటి తమ దైనందిన జీవితంలో అవసరమైన వస్తువులన్నీ వీధుల్లో వినియోగదారుల కోసం వెతుక్కుంటూ వచ్చాయంటే నమ్మాల్సిందే మరి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిరు వ్యాపారులు అనుసరించిన వ్యాపార ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. అయితే వ్యాపారులను దుకాణాల నుంచి వీధుల్లోకి దారి చూపిన నేపథ్యం మాత్రం కరోనా పరిస్థితులేననడంలో సందేహం లేదు. చిరు వ్యాపారులు తమ స్థాయిని బట్టి, తమ వ్యాపార లావాదేవీల ఆధారంగా తోపుడు బండ్లు, టీవీఎస్ ఎక్సెల్ వాహనం మొదలుకుని మినీ వ్యాన్, కార్లు, డీసీఎం వాహనాలను సైతం వినియోగిస్తుండడం గమనార్హం. పల్లెటూర్లల్లో కాకుండా పట్టణాల్లో మాత్రమే లభించే కొన్ని రకాల సరుకుల కోసం గ్రామీణులు పట్టణాలు లేదా నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇప్పుడు ఆ రంది లేకుండా మూడు, నాలుగు రోజులకోసారి అన్ని వస్తువులు గ్రామాల్లోనూ అందుబాటులోకి వస్తుండడం విశేషం.
దోహదం చేస్తున్న వసతుల కల్పన..
చిరువ్యాపారుల వ్యాపార ధోరణిలో మార్పు రావడానికి అందుబాటులోకి వచ్చిన వసతులు సైతం దోహదం చేస్తున్నాయి. గతంలో అత్యధిక శాతం గ్రామాలకు రోడ్డు సౌకర్యంలేక కాలినడకే శరణ్యం కాగా, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్ వంటి మారుమూల ప్రాంతంలోని అనేక గ్రామాలకు గాడిదలే రవాణా సాధనాలుగా ఉపయోగపడేవి. అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే ప్రస్తుతం దాదాపు అన్ని గ్రామాలు, తండాలకు బీటీరోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అప్పట్లో సొంత సైకిల్ ఉండడమే గొప్ప విషయం కాగా, ఇప్పుడు ద్విచక్ర వాహనాలకు కొదువలేదు. కార్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు, పెరిగిన కొనుగోలు శక్తి కూడా వ్యాపార ధృక్కోణాన్ని మార్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కష్టమే అయినా.. గిట్టుబాటు అవుతుంది
వీధుల్లో తిరిగుతూ అమ్మడం కొంచెం కష్టమే. అయినా గిట్టుబాటు అవుతున్నది. నేను 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉన్నా. ఇటీవల మా గ్రామానికి వచ్చి నారాయణఖేడ్‌లో ఉంటూ ఈ వ్యాపారం చేసుకుంటున్నా. ప్లాస్టిక్ వస్తువులు, ఆట వస్తువులను తోపుడు బండిపై గల్లీలల్ల తిరిగి అమ్ముతా. వస్తువును బట్టి మాకు గిట్టుబాటు అయ్యే ధరకు అమ్ముతా. మార్కెట్ ధరలతో సమానంగా లేదా ఇంకా తక్కువ ధరకే ఇస్తాం. ప్రజల అవసరాలను గుర్తించి మార్కెట్లో లేని కొన్ని చిన్నచిన్న వస్తువులు సైతం మాదగ్గర దొరుకుతాయి. వ్యాపారం బాగానే ఉంది.
మైక్‌లతో ప్రచారం..
ఆధునిక హంగులను అందిపుచ్చుకోవడంలో చిరు వ్యాపారులు సైతం తక్కువేమీ కాదు. వారు కూడా ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రికార్డెడ్ లౌడ్ స్పీకర్లతో తమ వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలపడం, వినియోగదారులను ఆకర్షించే రీతిలో పలకరింపుల కోసం ఈ లౌడ్ స్పీకర్ వ్యాపారులకు ఉపకరిస్తుందని చెప్పవచ్చు. గతంలో అయితే వీధుల్లో సరుకులను విక్రయించే వారు తామే స్వయంగా అరిచే పరిస్థితి ఉండేది. తమ వాహనాలకు లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసుకుని పదేపదే వాటిని వినియోగిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షించే దృశ్యాలు ఇప్పుడు పట్టణాలు, పల్లెల్లో సర్వ సాధారణం అయ్యాయి.
పల్లెల్లోనూ అన్ని దొరుకుతున్నయి..
అవసరమైన సామాన్లన్నీ పల్లెలల్లనే దొరుకుతున్నాయి. నారాయణఖేడ్ అసుంటి పెద్ద ఊర్ల దుకాణాలు ఉంటయి. బేరమాడి ధర సరైంది అనుకుంటేనే కొంటం, లేదంటే దుకాణాల్లో కొంటం. వాళ్లకి గిట్టుబాటు అవుతుందో లేదో కానీ బేరమాడిన చాలా సార్లు తక్కువ ధరకే ఇస్తరు. ఇంట్లోకి అవసరమైన ఎన్నో వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఇట్లా అన్ని సామాన్లు తోపుడుబండ్లు, మోటర్ల మీద కాలనీల్లో తిరుగుతా అమ్ముతున్నారు. పల్లెటూర్లకు కూడా పోయి అమ్ముకుంటున్నారు. దీంతోని చాలా మట్టుకు వారానికి ఒకరోజు జరిగే అంగళ్లకు రద్దీ చాలా వరకు తగ్గింది. – మహ్మద్ అబ్దుల్ వహీద్, నారాయణఖేడ్
చిట్యాల సందర్శన మంచి అనుభూతి
చేర్యాల, జనవరి 8 : మండలంలోని చిట్యాల గ్రామాన్ని శనివారం జాతీరత్నాలు, మల్లేశం సినిమా హీరో ప్రియదర్శి, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ వెంపటి చంద్ర, చిట్యాల సర్పంచ్ కుమారుడు, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ ఎర్రవల్లి సీతారంల బృందం సందర్శించారు.సినీ హీరోతో కూడిన బృందం సభ్యులు గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పరిశీలించి, రైతువేదిక క్లస్టర్‌ను సందర్శించారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బందిని అభినందించారు.అనంతరం గ్రామ సందర్శన గొప్ప అనుభూతిని ఇచ్చిందని, మర్చిపోలేనని తిరిగి గ్రామాన్ని సందర్శిస్తానని విజిటర్స్ బుక్కులో రాయడంతో పాటు రికార్డులో హీరో సంతకం చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రవల్లి రామ్మోహన్రావు, ఎంపీటీసీ మిట్టపల్లి సులోచనశ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ పంజాల లత, కార్యదర్శి సిద్ది వీరసోమయ్య, వార్డు సభ్యులు ఉన్నారు.
పంటకు రక్ష పాతచీరె..
అన్నదాతలు ఎంతో కష్టపడి పండిస్తున్న పంటను కాపాడుకునేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. అడవిపందులు, వివిధ పక్షుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోహీర్, మద్దూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ విధంగా చీరెలతో కంచె వేసి పంటకు రక్షణగా ఏర్పాటు చేసుకున్నారు.