
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 : ఉద్యోగంలో ప్రజలకు సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్ల విలువైన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షనర్లకు ఎంతో అనుభవం ఉంటుందని చెప్పారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అందుకోసమే వారికి భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ తిరుమల వెంకటేశ్, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిల్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలకిషన్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.