
కల్వకుర్తి, డిసెంబర్ 11 : అన్నదాతల పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నదని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని పార్థసారధి సినిమా థియేటర్లో రైతన్న సినిమాను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాలు రై తులకు అండగా ఉండేలా చట్టాలను తయారు చేయాలని సూచించారు. లేకుంటే కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఉద్యమించిన తీ రు ఉదాహరణగా నిలుస్తున్నదని చెప్పారు. అమరులైన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.3 లక్షలు ఇస్తానని ప్రకటించిన గొప్ప మానవతావాదన్నారు. అసువులు బాసిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేయడాన్ని ఆయన చిత్తశుద్ధిని గుర్తు చేస్తుందన్నారు. మోడీ సర్కార్ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ రిపోర్టులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారి, కార్పొరేట్ సంస్థలకు అండగా నిలిచేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు పాటుపడుతున్నదని చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, వైస్ ఎంపీపీ గోవర్ధన్, జాగృతి గణేశ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.