పోలీసు శాఖలో అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. వారి గౌరవ వేతనాన్ని 30శాతం పెంచుతూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22వేల వరకు వేతనం అందుతుండగా, తాజా పెంపుతో మరో 6వేల వరకు వేతనం పెరుగనున్నది. సర్కారు వేతన పెంపు నిర్ణయంతో కమిషనరేట్ పరిధిలో 750 మందికి లబ్ధి చేకూరనున్నది. గౌరవ వేతనం పెంపుతో హోంగార్డులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు ధన్యవాదాలు చెబుతున్నారు.
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 22: కొత్త సంవత్సరం ముంగింట్లో రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు తీపికబురు చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న హోంగార్డులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా హోంగార్డుల వేతనాన్ని 30శాతం పెంచారు. పోలీసు శాఖలో కిందిస్థాయి ఉద్యోగులుగా హోంగార్డులు సేవలందిస్తున్నారు. అతి తక్కువ జీతాలతో పని చేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను మానవీయకోణంలో అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో హోంగార్డుల్లో ఆత్మవిశ్వాసం పెరుగనున్నది. పెరిగిన వేతనాలను ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూన్ నాటి గౌరవ వేతనంపై 30శాతం పెంపుదల ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి పెంపుదల రాష్ట్ర ప్రభుత్వంలోని కాంట్రా క్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనాలు పెంచినప్పుడు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. పెరిగిన వేతనాలతో కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో 472, కామారెడ్డి జిల్లాలో 278 మందికి లబ్ధి చేకూరనున్నది. పోలీసు సిబ్బందితో కలిసి రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే తమ వేతనాలు పెంచడం సంతోషంగా ఉందని పలువురు హోంగార్డులు తెలిపారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మాకు 30శాతం వేతనం పెరగడం చాలా సంతోషంగా ఉన్న ది. సర్కారు పెంచిన వేతనంతో ఇక నుంచి రూ.6,480 అదనంగా వస్తాయి. ఒకేసారి గౌవరవేతనం ఇంతగా పెంచడంతో మా కుటుంబ పోషణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
కుటుంబ పోషణకు ఆసరా..
హోంగార్డుల్లో 80శాతం మంది గౌరవ వేతనాలపైనే ఆధారపడి ఉన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె చెల్లించడం లాంటివి ప్రతి నెలా ఉంటాయి. ఇప్పటి వరకు మా హోంగార్డులను ఎవరూ పట్టించుకోలేదు. మాకు వచ్చే గౌరవ వేతనంపై సీఎం కేసీఆర్ 30శాతం పెంచడంతో చాలా సంతోషకరం. పెరిగిన వేతనం మా కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. వేతనం పెంచిన సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం.