పెద్దవూర, డిసెంబర్ 8 : ఒకే సమయంలో రెండు పంటలు.. ఆదాయం రెండింతలు..! వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా మరో పంటతో లాభం.. నష్టాలకు తావులేని విధంగా పెద్దవూర మండల రైతులు ‘సాగు’తున్న తీరు ఆదర్శంగా నిలుస్తున్నది. మిశ్రమ పంటల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నామని రైతులు చెప్తున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 12వేల ఎకరాల్లో మిశ్రమ పంటలు సాగుచేస్తున్నారు. దాంతో ఆదాయం బాగున్నదని రైతులు చెప్తుండగా, భూసారం కూడా పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
పత్తి చేలు, బత్తాయి తోటల్లో రైతులు మినుములు, పెసర, వేరుశనగ, కంది సాగు చేస్తున్నారు. దాంతో పత్తి ఎకరానికి 6నుంచి10 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా కంది 3నుంచి 4క్వింటాళ్లు వస్తున్నది. బత్తాయి తోటల్లో మిశ్రమ పంటలుగా మినుము, పెసర, వేరుశనగ సాగు చేయడం వల్ల అంతర పంటలు మంచి దిగుబడి ఇవ్వడంతో పాటు బత్తాయి మొక్కల్లో తెగుళ్ల శాతం తగ్గిందని చెప్తున్నారు.
మిశ్రమ పంటలతో ఆదాయం
మిశ్రమ పంటల సాగుతో రైతుకు మేలు జరుగుతుంది. కంది, మినుములు, పెసర్లు, అల్చింత(బొబ్బర్లు), వేరుశనగ పంటలను సాగు చేయడంతో భూసారం మరింత వృద్ధి చెందుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో ఒక పంట నష్టపోయినా మరొక పంట వేసుకోవచ్చు. ప్రభుత్వం మిశ్రమ పంటల సాగును ప్రోత్సహిస్తూ అందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచింది.