సూర్యాపేట, అర్బన్ డిసెంబర్ ౩ : మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను మత్స్యశాఖ ద్వారా సహకార సంఘాలకు లీజుకు ఇచ్చేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో పంచాయతీ రాజ్ పరిధిలోని చెరువులపై మత్స్యశాఖకు పూర్తి అధికారులు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాలో (సూర్యాపేటలో- 785, నల్లగొండ-1970, యాదాద్రి భువనగిరి-1210) మొత్తం 3,965 చెరువులు, కుంటలు మత్స్యశాఖ, మత్స్య సహకార సంఘాల ఆధీనంలోకి రానున్నాయి. ఇప్పటివరకు లీజు విషయంలో మత్స్యకారులకు ఎదురైన సమస్యలు, ఇబ్బందులు తొలగడంతోపాటు ఆర్థ్ధికంగా ప్రయోజనం చేకూరనున్నది.
3,963 చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి..
గతంలో చేపల పెంపకానికి అవసరమైన చెరువులు రెండు రకాలుగా పంచాయతీ రాజ్, మత్స్యశాఖ ఆధీనంలో ఉండేవి. 100 ఎకరాలలోపు కుంటలు, చెరువులు పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో ఆ లోపు విస్తీర్ణం ఉన్నవి మత్స్యశాఖ పరిధిలో ఉన్నాయి. అన్నిరకాల చెరువులకు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి పెంపకాన్ని ప్రోత్సహించేది. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీఓ 26తో ఇక అన్ని చెరువులు మత్స్యశాఖ పరిధిలోని వెళ్లనున్నాయి. సూర్యాపేట జిల్లాలో 785 చెరువులు ఉండగా.. 460 చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి వెళ్లాయి. మిగిలిన 325 చెరువులను స్థ్ధానిక మత్స్య సహకార సంఘాలకు అప్పగించనున్నారు. నల్లగొండ జిల్లాలో 1,970 చెరువులలో 1,258 మత్స్యశాఖ పరిధిలోకి వెళ్లనుండగా.. 712 చెరువులు మత్స్య సహకార సంఘాలకు అప్పగించనున్నారు. దీంతో సహకార సంఘాలోని సభ్యుల సంఖ్య సైతం పెరగనున్నది.
తీరనున్న ఇబ్బందులు…
మత్స్యసహకార సంఘాల, పంచాయతీల ఆధీనంలో ఉండే నీటి వనరులను లీజుకు తీసుకునే విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. గతంలో పంచాయతీ నిబంధనలు పరిగణలోకి తీసుకోకుండా లీజుకు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో అధికారాలన్నీ మత్స్యశాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి. సొసైటీలు ఉన్న చోట వారికే చెరువుపై హక్కులు దక్కనుండడంతో మత్స్యకారుల ఆదాయం కూడా పెరగనున్నది.
వేలం ఆదాయం పంచాయతీలకే..
పంచాయతీ పరిధిలోని చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి రావడంతో వాటికి వేలం ద్వారా లీజు నిర్ణయించి వచ్చిన ఆదాయాన్ని చెరువు పరిధిలోని పంచాయతీలకు అందించేలా మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. పంచాయతీల పరిధిలోని చెరువులను లీజుకు ఇచ్చేందుకు ఇక పంచాయతీ అధికారులకు అధికారం లేదు. ఉమ్మడి జిల్లాలోని మత్స్యశాఖ పరిధిలోని 3,965 చెరువులకు ఇప్పటికే చేప పిల్లల పంపిణీ పూర్తి చేసిన అధికారులు చెరువుల వేలానికి సిద్ధ్దమవుతున్నారు.
నిబంధనల ప్రకారం లీజు నిర్ణయం
పంచాయతీ పరిధిలోని చెరువులకు ఇప్పటికే చేప పిల్లలను పంపిణీ చేశాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజు నిర్ణయించి వచ్చిన ఆదాయం పంచాయతీలకు అందిస్తాం. పంచాయతీ ఆధీనంలోని చెరువులను మత్స్యశాఖ అనుమతి లేకుండా ఎవరూ లీజుకు తీసుకోవద్దు. నిబంధనలకు విరుద్ధంగా లీజుకు తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మత్స్య శాఖకు పూర్తి అధికారాలుంటాయి. త్వరలో చెరువుల లీజు ప్రకటన విడుదల చేస్తాం.