దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
అతివేగం ఏడుగురిని బలిగొన్నది. రెండు కుటుంబాలను చిదిమేసింది. మరో ఐదుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. పెద్దకొడప్గల్ మండలం జగన్నాథపల్లి గేటు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నాందెడ్ సమీపంలోని దర్గా వద్దకు వెళ్లినవారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయ్యింది. మృతిచెందిన వారిలో అమీర్‌తాజ్ (28), ఆయన భార్య సనా ఫాతిమా(24), వారి పిల్లలు హనియా(2), హనాఫ్ (4నెలలు) ఉన్నారు. వీరితోపాటు మహ్మద్ హుస్సేన్ (35), ఆయన భార్య తస్లీమా(30), వారి కూతురు నూరా(7) ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు చిన్నారులను నిజామాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిజాంసాగర్/బాన్సువాడ/ నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 18: అతివేగం ఏడుగురిని బలిగొన్నది. మరో ఐదుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. గమ్య స్థానానికి త్వరగా చేరుకోవాలనే కారణంతో క్వాలిస్ డ్రైవర్ వేగంగా వాహనం నడపడమే భారీ నష్టానికి దారి తీసింది. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని జగన్నాథపల్లి గేటు వద్ద ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, దవాఖానలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 161వ నంబర్ జాతీయరహదారిపై చోటు చేసుకున్నది. వీరంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
హైదరాబాద్‌లోని మూసానగర్‌లో నివాసముండే మహ్మద్ అమీర్‌తాజ్ ఏసీ టెక్నీషియన్ కాగా.. వినాయకవీధి(రసూల్‌పురా) వాసి మహ్మద్ హుస్సేన్ మినరల్ వాటర్‌ప్లాంట్ నడుపుతున్నారు. ఇరు కుటుంబాలు కలిసి మహారాష్ట్రలోని నాందెడ్‌లో ఉన్న దర్గాకు మూడురోజుల క్రితం వెళ్లారు. దర్గాలో కార్యక్రమాలు ముగించుకుని శనివారం ఉదయం 9గంటల సమయంలో అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. తెల్లవారుజామునే తిరుగు ప్రయాణం చేయాల్సి ఉండగా.. పొగమంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆలస్యంగానే బయల్దేరారు. దాదాపుగా మూడున్నర గంటల ప్రయాణం తర్వాత పెద్దకొడప్గల్ మండలం జగన్నాథపల్లి గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో చిన్నారి మృతి చెందారు. మరో ఐదుగురు క్షత్రగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో వాహనం నడుపుతున్న అమీర్ తాజ్(28), ఆయన భార్య సనా ఫాతిమా (24), వారి పిల్లలు హనియా ఫాతిమా(2), హన్నాఫ్ ఫాతిమా(4నెలలు) ఉన్నారు. వారితోపాటు రసూల్‌పురాకు చెందిన మహమ్మద్ హుస్సేన్(35), ఆయన భార్య తస్లీమ్ బేగం(30) సైతం సంఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన తస్లీమ్ కూతురు నూర్ బేగం (5) నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారులు ఆస్మా(2), హజ్రా బేగం(6), ఆదిల్ సుల్తానా(3), హాజీ(8), హిబా(4)లను నిజామాబాద్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆస్మా.. సనాఫాతిమా అక్క కూతురు కాగా, మిగిలిన ఐదుగురు చిన్నారులు తస్లీమ్ బేగం పిల్లలు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ శోభన్‌తోపాటు స్థానిక ఎస్సై పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్వాలిస్ డ్రైవర్ మృతదేహం వాహనంలోనే చిక్కుకోగా, పొక్లెయిన్ సహాయంతో బయటికి తీశారు.
మృతుల గుర్తింపులో జాప్యం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందినవారిని గుర్తించేందుకు పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జవడంతో సామగ్రి చెల్లాచెదురైంది. ఘటనాస్థలిలో శరీరాలు సైతం ఇబ్బందికర పరిస్థితుల్లో పడి ఉన్నాయి. మృతదేహాలను వెలికి తీసేందుకు గంట సమయం పట్టింది. వారి వద్ద సెల్ఫోన్లు లభించినప్పటికీ, స్క్రీన్‌లాక్ ఉండడంతో వీరి సంబంధీకుల ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నమూ ఆలస్యమైంది. వాహనం నంబర్ (AP12 C5580) ఆధారంగా ప్రయత్నించిన పోలీసులకు అక్కడా సమాచారం దొరకలేదు. తాను ఐదేండ్ల క్రితమే వాహనాన్ని అమ్మేశానని, అది ఇప్పుడు ఎవరి వద్ద ఉందో తెలియదని పూర్వ యజమాని పోలీసులకు తెలిపారు. చివరకు మృతదేహాలను బయటికి తీసిన తర్వాత.. అమీర్‌తాజ్, మహ్మద్ హుస్సేన్ వద్ద దొరికిన గుర్తింపుకార్డు ఆధారంగా చనిపోయిన వారు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌కు చెందినవారిగా గుర్తించగలిగారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో మృతుల కుటుంబాల పూర్తి వివరాలు తెలిశాయి.
‘అమ్మీ కహాహై!’
గాయపడిన చిన్నారులు గాయాలను తట్టుకోలేక మేరా అమ్మీ కహా హై అంటూ రోదించడం దవాఖానలో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. గాయపడిన చిన్నారులు తాము ఎక్కడ ఉన్నామో వారికే తెలియని పరిస్థితి. ఒంటి నిండా తీవ్ర గాయాలు, అమ్మానాన్నల కోసం వారి రోదనలు, వచ్చీ రాని మాటలతో వారు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు దవాఖాన ప్రాంగణంలో కనిపించాయి.
గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని..
గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే కారణంతో క్వాలిస్ డ్రైవర్ వేగంగా వాహనం నడపడమే భారీ ప్రాణనష్టానికి దారి తీసింది. లారీ వెనుక భాగంలోకి వాహనం సగానికి ఎక్కువ చొచ్చుకెళ్లడంతో డ్రైవర్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఘటనాస్థలిలో ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అక్కడున్న వారందరినీ కదిలించాయి. మృతదేహాలను తరలిస్తున్న క్రమంలో ఏడాది వయసున్న బాలిక కాలిగజ్జెల సవ్వడి ఒక్కసారిగా అందరిలోనూ ఆశను రేకెత్తించింది. బాలిక కొన ఊపిరితో ఉందా? అన్న అనుమానం తలెత్తింది. కానీ విగతజీవి అని తేలడంతో స్థానికులంతా తల్లడిల్లారు.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి..
హర్యానా నుంచి భారీ లోడ్‌తో వస్తున్న లారీని డ్రైవర్ పక్కకు నిలిపి భోజనం చేసేందుకు దాబాకు వెళ్లాడు. ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించే క్రమంలో క్వాలిస్ వాహనం ఎడమవైపునకు తిప్పడంతో వేగంగా లారీ వెనుకభాగాన్ని క్వాలిస్ వాహనం ఢీ కొట్టినట్లుగా పోలీసులు చెప్పారు. భారీ శబ్దం కావడంతో స్థానికులు వచ్చే లోపే రక్తపు మడుగులో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడినట్లుగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వగా క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు. ప్రమాద సమయంలో క్వాలిస్ వాహనం 100 కి.మీ వేగాన్ని దాటినట్లుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటనను బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, సీఐ శోభన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.