తాడ్వాయి, డిసెంబర్ 15: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రసిద్ధ సద్గురు శబరిమాత ఆశ్రమ 51వ వార్షికోత్సవాలను ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. 18న శనివారం ఉదయం 4గంటలకు సుప్రభాతం, ధ్యానము, 5గంటలకు శ్రీమద్భగవద్గీత, గురుచరిత్ర పారాయణం,7.45కు గోమాత పూజ, 8.15 ధ్వజారోహణం, 9.30కి శబరీమాత భక్తుల దీక్షలు, గ్రామంలో భక్తుల భిక్షాటన, మధ్యాహ్నం 12.00 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, సాయంత్రం 7.15 శ్రీ దత్తాత్రేయ డోలారోహణం, రాత్రి 8 గంటలకు రథోత్సవం, అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తెల్లవారు వరకు భజనలు, సందేశాలు ఉంటాయి. 19న ఆదివారం ఉదయం 4.15కు సుప్రభాతం, ధ్యానము, 5 గంటలకు శ్రీమద్భగవద్గీత, గురుగీతం, గురుచరిత్ర పారాయణం, 8.35గంటలకు గ్రామంలోని ప్రధాన వీధులగుండా సద్గురు శబరీమాత దివ్యపాదుకల ఊరేగింపు, 11.30గంటలకు ఆశ్రమం ఎదుట ఉన్న గుట్టపై శబరీమాత పాదుకా పూజోత్సవం, తీర్థ ప్రసాద వితరణ, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం వరకు భజనలు, మ హాత్ముల సందేశాలుంటాయి. రాత్రికి తాడ్వాయి, బీదర్, కరీంనగర్, ఎండ్రియాల్, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తుల భజనలు, సంగీత విభావరి నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా ఆశ్రమ ఆవరణలోని మార్కండేయ, శ్రీ వేంకటేశ్వరాలయాలను ముస్తాబు చేశారు.