
సైదాబాద్ : ప్రచంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కవులు తమ రంగాన్ని విస్తరించాలని, విదేశీ కవుల రచనలను ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని కౌగలించుకోవాలని ప్రముఖ కవి డాక్టర్ శివారెడ్డి అన్నారు. ఆదివారం మలక్‌పేట బి-బ్లాక్‌లోని ముంతాజ్ కాలేజ్ ఆవరణలో కవి యాకుబ్, శిలాలోలిత సారధ్యంలో ఏర్పాటుచేసిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదాన్సోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజ జీవితంలో నిత్యసాధనలో జీవితం, కవిత్వం వేరు కాదని, తన మనస్సులోని భావాలను వ్యక్తీకరించటమే కవిత్వమన్నారు. కవిత్వం మనిషినీ సజీవంగా ఉంచటానికి నిత్యనూతనంగా పని చేస్తుందని, భాష సంస్కృతికి, ఒక జాతి మతానికి గుర్తని అన్నారు. జీవితంలోని సంఘర్షణల ప్రతి రూప వాస్తవ ఘటనల ఆధారంగా నే భావవ్యక్తీకరణతో కవిత్వం రాయటం జరుగుతుందన్నారు.

తెలుగు రాష్ట్రల్లో అద్భుతమైన కవిత్వం రాసే యువ కవులున్నారని, నిజజీవితంలో మిలితమై అద్భుతమైన కవిత్వం రాస్తున్నారని కొనియాడ్డారు. కోటకోఝ్వల ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ సీతారాం మాట్లాడుతూ సమాజాన్ని ఎంతో ఆచరణత్మకంగా ఆధ్యాయనం చేసి యువకవులు ఎంతో చక్కగా తమ రచనలు చేశారని, ఎంతోమందికి స్పూర్తిగా నిలిస్తున్నారని అన్నారు.
నూతన రచనలతో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా యువకవులు తమ నైపుణ్యం వెలికితీయా లన్నారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డును మునాసు వెంకట్ (మెద), పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును మందరపు హైమవతి (నీలిగోరింట), కె.ఎల్. నర్సింగ్ రావు స్మారక అవార్డులను నరేష్ కుమార్ సూఫీ (నిశ్శబ్ద), తగుళ్ల గోపాల్ ( దండకడియం) ఆతిధులు అందజేశారు.

అదే విధంగా సభలో కాసుల రవికుమార్ రచించిన గడ్డ కట్టిన నది, దాసరి నాగభూషణం రచించిన కరోనా కలకలం, పెనుగొండ సరసిజ రచించిన ఇక మారాల్సింది నువ్వే వంటి పుస్తకాలను ఆవిష్కరించారు. కవి సంగమం నిర్వాహకులు శిలాలోలిత, కవి యాకుబ్, లిఖిత్‌కుమార్ , శ్రీనిధి, రావెళ్ల రవీంద్ర, రూపారుక్మిణి, లక్ష్మీశ్రీ, చిరుగాల్ పల్లి ప్రసాద్, రహీమొద్దీన్, గీతా వెల్టంకీ, తండ హరీష్‌గౌడ్, తాళ్లపల్లి శివకుమార్, ఇస్లావత్ గోవర్ధన్ నాయక్, పద్మజ బొలిశెట్టి, గట్టు రాధికమోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
వివిధ సంస్థలు తమ రచనలకు సంబంధించిన బుక్స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.