Rishabh Sawhney | యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన డివైన్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సనాతన ధర్మం, పురాతన ఆలయాల రహస్యాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్‌తో పాటు విలన్ పాత్రలో నటించిన రిషబ్ సాహ్నీ నటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో ‘అబ్దాలీ’ పాత్రలో కనిపించిన రిషబ్ సాహ్నీ తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ తన కళ్లలో కనిపించే తీవ్రత, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఒక భయానక ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారీ కథలో ఉత్కంఠ మరింత పెరిగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా రిషబ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అబ్దాలీ ఎంట్రీతో థియేటర్లో వాతావరణమే మారిపోయింది , హీరోతో సమానంగా విలన్ పాత్రకు బలం తీసుకొచ్చాడు , రిషబ్ సాహ్నీ కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘నాగబంధం’ కథ శ్రీరంగపురంలోని ఓ పురాతన ఆలయాన్ని కేంద్రంగా సాగుతుంది. అక్కడ దాగి ఉన్న బ్రహ్మకమలం, మహాశక్తివంతమైన ‘నాగబంధం’ గ్రంథాన్ని సొంతం చేసుకుని అమరత్వం పొందాలని ప్రయత్నించే దుష్టశక్తుల కుట్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన యువకుడు ‘రుద్ర’ చేసే సాహసయాత్ర ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.
పురాణ గాథలు, ఆలయ రహస్యాలు, మిస్టరీ, యాక్షన్ అంశాలను సమన్వయం చేస్తూ దర్శకుడు అభిషేక్ నామా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. రుద్ర పాత్రలో విరాట్ కర్ణ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జగపతిబాబు కీలక ఆర్కియాలజిస్ట్ పాత్రలో మెప్పించగా, మహేష్ మంజ్రేకర్ తన ప్రత్యేకమైన నటనతో కథకు బలం చేకూర్చారు.అయితే ఈ నటీనటులందరిలో కూడా రిషబ్ సాహ్నీ పోషించిన అబ్దాలీ పాత్రే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేసిందని సినీ అభిమానులు చెబుతున్నారు. తన ప్రభావవంతమైన విలనిజంతో సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ‘నాగబంధం’లో రిషబ్ సాహ్నీ నటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తోంది.