నాకు నాలుగు ఎకరాల పొలమున్నది. రైతుబంధు పథకం కింద వానకాలంలో రూ.20వేలు, యాసంగికి రూ.20వేలు వస్తున్నయ్. ఏటా రూ.40వేలు బ్యాంకు ఖాతాలో పడుతున్నయ్. ఇవే పైసలతో పంటసాగు ఖర్చులు ఎల్లిపోతున్నయ్. రైతుబంధు వచ్చినప్పటి నుంచి ట్రాక్టర్‌తో దుక్కి దున్నేందుకు, కేజ్‌వీల్‌తో దమ్ము కొట్టించేందుకు, ఎరువులు, పురుగు మందులకు, కైకిళ్లకు ఉపయోగపడుతున్నది. ఇంతకు మునుపు ఎరువులు, పురుగు మందుల కోసం అప్పుజేయాల్సి వచ్చేది. ఎక్కడా అప్పు పుట్టకపోతే దుకాణం సేట్‌ను బతిమాలాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలేదు. రైతుబంధు పైసలతోనే అన్నింటినీ కొంటున్న. పెట్టుబడి కోసం ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి కూడా బాకీ చేస్తలే. సీఎం కేసీఆర్ దేవునిలెక్క వచ్చి రైతుబంధు పైసలు వేస్తుండడంతో అవి మస్తు అక్కరకొస్తున్నయ్. ఎంపీ ఎన్నికల్లో పసుపుబోర్డును వారం రోజుల్లో తెస్తానని చెప్పిన అర్వింద్ నుంచి వరి కొనబోమని చెబుతున్న నేటి కేంద్ర ప్రభుత్వం దాకా.. వారి మాటలు రైతుల పట్ల ఏవిధంగా ఉన్నయన్నది స్పష్టమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగునీటి వనరులు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్నది. బీజేపీ వాళ్లేమో రైతులపై సవతి ప్రేమ చూపిస్తున్నట్లుగా ఉంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను రైతులు ఎన్నటికీ మరచిపోలేరు.
రైతు మోములో చిరునవ్వు
రైతుబంధు డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. యాసంగి సాగుకు ముందుగానే పెట్టుబడికి ఇబ్బంది లేకుండా సాయం అందిస్తున్న సర్కారుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. రైతుబంధు సాయం అందించిఆదుకుంటున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేస్తున్నారు.
ఈ పథకం ఎల్లకాలం కొనసాగాలి..
నాపేరు గడ్డం శ్రీనివాస్. మాది ధర్పల్లి మండలం మైలారం. నాకు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులతో పంపు మోటర్లు కొన్నా. మిగతా డబ్బులతో యూరియా, పురుగు మందులు కొనుగోలు చేశాను. నాలుగేండ్ల కింద పంట పండించాలంటే చాలా కష్టంగా ఉంటుండె. అప్పుచేసి వ్యవసాయం చేస్తే మిత్తి కట్టడానికే సరిపోతుండె. ఒక్కోసారి కాలం కలిసిరాక పంట దెబ్బతింటే.. అప్పుల ఊబిలోనుంచి తేరుకోవడానికి ఏండ్లు పడుతుండె. కానీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు చాలా ఆసరవుతున్నది. పంట పెట్టుబడికి పైసలు ఇస్తుండడంతో ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ప్రస్తుతం నాకున్న భూమిలో పసుపు, జొన్న, మిర్చి తదితర ఆరుతడి పంటలు వేసుకోగా మిగిలిన భూమిలో ఇంటి కోసం వరి నాటాను. సమయానికి రైతుబంధు డబ్బులు అందడంతో నాకే కాదు.. రైతులందరూ ఎవరి వద్ద చేతు చాచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ పథకం ఎల్లకాలం కొనసాగితే రైతు రాజులాగే బతుకుతాడు. నిజంగా రైతుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడే..