గాంధారి, డిసెంబర్ 15 : యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచేస్తున్నారు. మార్కెట్లో శనగ ఉత్పత్తులకు డిమాండ్ ఉండడంతోపాటు, తక్కువ పెట్టుబడి, నీటి వనరులు లేకున్నా పండుతుండడంతో చాలా మంది రైతులు శనగ వైపు దృష్టి సారించారు. వానకాలంలో సాగు చేసిన సోయా, మక్కజొన్న, మిను ము, పెసర వంటి పంటలు కోసిన వెంటనే, తడిగా ఉన్న వ్యవసాయ భూముల్లో రైతులు శనగ విత్తనాలను వేశారు. ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో దాదాపు 45వేల ఎకరాల్లో శనగ పంటను సాగుచేస్తున్నారు. శనగ వేసిన తర్వాత భూమిలో తడి ఉంటే చాలు విత్తనం మొలకెత్తుతుంది. అనంతరం వాతావరణంలో ఉండే మంచు, నీటి బిందువులను గ్రహించి పంట ఏపుగా పెరుగుతుంది. యాసంగిలో సాగు చేయడం సులువుగా ఉండడంతోపాటు ఈ ఏడాది అనుకున్న విధంగా వర్షాలు కురవడంతో చాలా మంది రైతులు శనగ పండించారు. జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో యాసంగిలో శనగ పంట సాగువిస్తీర్ణం పెరిగింది.
45వేల ఎకరాల్లో శనగ సాగు..
కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం దాదాపు 45వేల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం యాసంగిలో ఆరుతడి పంటలను వేసుకోవాలని తెలుపడానికి ముందుగానే జిల్లాలో చాలా మంది శనగ పంటను సాగు చేశారు. విత్తనాలు విత్తుకునే సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో శనగ పంట సాగుకు భూములు అనుకూలంగా మారాయి. దీంతో నల్లరేగడి భూములు అధికంగా ఉన్న గాంధారి, సదాశివనగర్, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, తాడ్వాయి, పిట్లం, భిక్కనూరు, దోమకొండ, పెద్దకొడప్గల్, ఎల్లారెడ్డి, లింగంపేట్, రాజంపేట్ తదితర మండలాల్లో రైతులు శనగ పంటను సాగు చేస్తున్నారు.
మార్కెట్లో భలే డిమాండ్..
శనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. శనగలతోపాటు, మార్కెట్లో శనగ పప్పు, శనగ పిండి, పుట్నాలకు గిరాకీ బాగున్నది. దీంతో రైతులు పండించిన శనగ మంచి ధర పలుకుతున్నది. శనగ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు యాసంగిలో సాగు చేసేందుకు ఆసక్తి చూపారు.
అన్నదాత హర్షం..
రైతులు సాగుచేస్తున్న శనగ పంట ప్రస్తుతం ఏపుగా పెరిగి రిబ్బలు కట్టి, పూత, కాత దశలో ఉన్నది. శనగ పంటకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషపడుతున్నారు. ప్రస్తుతం సాగుభూముల్లో సరైన తేమ ఉండడంతో శనగ పంట ఏపుగా పెరుగుతుందని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.