ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ యూనివర్సిటీస్ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (తూటా) రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ భీమానాయక్, ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ శ్రీనుచౌహాన్లు ఎన్నికయ్యారు. ఓయూ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ భీమానాయక్ ప్రస్తుతం విభాగం హెడ్‌గా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ సందర్భంగా వారిని గిరిజనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రొఫెసర్ భీమానాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గిరిజన అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
రాబోయే రోజుల్లో గిరిజన విద్యార్థులు, ప్రజలకు ఉపయోగపడేవిధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మోటివేషన్ సదస్సులు నిర్వహించడంతో పాటు పరిశోధనలు, ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి నాయకులు రాజునాయక్, మహేశ్, విజయ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.