
గూడు కోసం ‘ప్రియదర్శిని’ కార్మిక కుటుంబాల పోరాటం
సదాశివపేటలో 88 రోజులుగా ధర్నా
ఇచ్చిన హామీ ప్రకారం శాశ్వత నివాసాల కోసం డిమాండ్
మద్దతు ప్రకటిస్తున్న రాజకీయపార్టీలు
సంగారెడ్డి నవంబర్ 28, (నమస్తే తెలంగాణ) గూడు కోసం వంద మంది కార్మిక కుటుంబాలు 88 రోజులుగా ధర్నా చేస్తున్నాయి. చలి పెరిగినా, వర్షాలు కురిసినా లెక్క చేయకుండా ధర్నాలో పాల్గొంటుండడం కార్మిక వర్గాలు, రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సదాశివపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై కొన్నేండ్ల క్రితం ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్‌ను ఏర్పాటు చేశారు. యజమాని ఆంధ్రా ప్రాంతం అతను కావడంతో విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది కార్మికులను పిలిపించుకుని శాశ్వత కార్మికులుగా ఉద్యోగాలు ఇచ్చాడు. వారంతా పరిశ్రమ సమీపంలో ఏర్పాటు చేసిన క్వార్టర్స్‌లో కుటుంబాలతో సహా నివసిస్తూ కంపెనీలో పని చేశారు. కాగా, వివిధ కారణాలతో 2018 లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కంపెనీతో చర్చలు జరుపగా, లాకౌట్ అయినా కార్మికులు కంపెనీ క్వార్టర్స్‌లోనే ఉండవచ్చని, వారికి శాశ్వత నివాసాలు కల్పిస్తామని యాజమాన్యం అప్పట్లో హామీ ఇచ్చింది. దీంతో పలువురు కార్మికులు అవే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. స్థానికంగా ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం కంపెనీని యాజమాన్యం మరో సంస్థకు విక్రయించింది. కొనుగోలు చేసిన సంస్థ క్వార్టర్స్‌లో ఉంటున్న కార్మికులను తక్షణం ఖాళీ చేయాలని సెప్టెంబర్ నుంచి ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ పరిణామాలతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది. ఏండ్లుగా క్వార్టర్స్‌లో ఉంటున్న తాము ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లడం కష్టమని, ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేకుంటే ఎలా బతికేదని కార్మికులు వాపోతున్నారు. గతంలో కంపెనీ ఇచ్చిన హామీ ప్రకారం క్వార్టర్స్‌లోనే తమకు శాశ్వత నివాసం కల్పించాలని, లేదంటే మరోచోట నివాస గృహాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రియదర్శిని మిల్స్ స్పందించకపోవడంతో కుటుంబాలతో సహా ఆందోళన బాట పట్టారు.
88 రోజులుగా ధర్నా..
యాజమాన్యం తీరుతో వంద మంది కార్మికుల కుటుంబాలు కంపెనీ గేటు ఎదుట ధర్నాకు దిగాయి. 88 రోజులుగా కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులు ధర్నాలో పాల్గొంటున్నాయి. ప్రియదర్శిని యాజమాన్యం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగినా, వర్షాలు కురిసినా ఇక్కడి నుంచి కదిలేది లేదని అంటున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కొంతమంది మహిళా కార్మికులు టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ నేత చింతా గోపాల్‌ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. తమ శక్తినంతా ధారపోసి కంపెనీని అభివృద్ధి చేశామని, లాకౌట్ ప్రకటించడంతో ఉద్యోగాలు పోయినా క్వార్టర్స్‌లో ఉండొచ్చని హామీ ఇవ్వడంతో రోజు కూలీ చేసుకుని బతుకుతున్నామన్నారు. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లమంటే ఎటువెళ్లాలో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులది న్యాయమైన డిమాండ్
ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లో పనిచేసిన కార్మికులు కంపెనీ మూత పడినా యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు ఏండ్లుగా కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు కంపెనీని విక్రయించి ఖాళీ చేయండి అనడం సరికాదు. గతంలో కార్మిక కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు ధర్నా చేస్తున్న కార్మికుల కుటుంబాలకు మరో చోట నివాస స్థలాలు ఏర్పాటు చేయాలి. కొత్త యాజమాన్యం కూడా మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. ధర్నా చేస్తున్న వారికి న్యాయం జరిగే వరకు సహకరించాలి. అందుకోసం మేము కూడా కృషి చేస్తాం.
నిలువనీడ లేకుండా చేస్తున్నారు..
నా భర్త 20 ఏండ్లు కంపెనీలో పనిచేశాడు. కంపెనీ యజమాని హామీతో విజయవాడ నుంచి సదాశివపేటకు వచ్చాం. ఇక్కడ కంపెనీకి చెందిన క్వార్టర్స్‌లో నివాసముంటూ పనిచేసే వాళ్లం. కంపెనీ మూత పడినా క్వార్టర్స్‌లో శాశ్వతంగా ఉండేందుకు యాజమాన్యం అనుమతి ఇచ్చింది. లాకౌట్ సమయంలో మాకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కంపెనీని ఇతరులకు అమ్మినా మరో చోట ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇప్పుడు కొత్త యాజమాన్యం క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నది. మాకు నిలువనీడ లేకుండా చేయాలని చూస్తున్నది.
న్యాయం జరిగే వరకు పోరాడుతాం..
క్వార్టర్స్ నుంచి తమను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా భర్త, నేను కంపెనీలో పనిచేశాం. కంపెనీ మూతపడినా క్వార్టర్స్‌లో ఉంటూ ఇతర పనులు చేసుకుని బతుకుతున్నాం. మాకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చాలని ధర్నా చేస్తున్నాం. ఇండ్లు కట్టించే వరకు క్వార్టర్స్ ఖాళీ చేయం. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.