
రాష్ట్రం కొత్తగా ఏర్పడినంక ముఖ్యమంత్రి సారూ ఎవుసం చేయనికి ఫసల్ ఫసల్‌కు బ్యాంకుల పైసలు వేస్తున్నడు. ఆ పైసలతోనే ఎవుసం పనులు షురూ చేస్తున్నాం. అప్పట్లో వానకాలంలో రోణి కార్తె వచ్చిందంటే లాగోడికి పైసలు తీసుకరావడానికి సావుకారు యాదికొచ్చేది. లాగోడికి అప్పు పుట్టడానికి రోజుల తరబడి శేటు ఇంటికి తిరగటోళ్లం. గిప్పుడు ఆ తిప్పలు తీరాయి. సర్కారు ఇస్తున్న పైసల్తో సంతోషంగా ఎవుసం పనులు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువులు, కూలీలకు పైసలు ఇచ్చి దుక్కిలు చేసి పంటలను పండిస్తున్నాం’..అని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన రైతు, ఆత్మకమిటీ డైరెక్టర్ అమ్మన్నగారి రవీందర్‌రెడ్డి అంటున్నారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ రైతుబంధు సాయం ఎలా ఉపయోగపడుతున్నది? రైతులు ఎలా వినియోగించుకుంటున్నారు? తదితర అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
యాసంగిలో ఏ పంటలు వేశారు?
సీఎం సారూ వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని చెప్పిండు. నేను ఇప్పుడు టమాట సాగు చేసిన. నాకున్న రెండున్నర ఎకరాల్లో ఎకరంన్నరలో టమాట, అర ఎకరంలో కంది పెట్టిన. చేతికొచ్చిన టమాటను బాక్స్‌ల్లో పెట్టి మార్కెట్‌కు పంపుతున్న. ఇప్పుడు టమాట ధర బాగానే ఉంది. లాభాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
ఎవుసంతో మీకు లాభముందా?
నేను ఇంటర్ చదివిన. ఐటీఐ కూడా చేసిన. కంపెనీల దిక్కుపోకుండా అమ్మానాన్న చేస్తున్న ఎవుసంపై నా చూపు పడింది. ఎక్కడో పన్జేసి, ఒకరి చేతికింద ఉండడం కంటే, నేనే ఒక యజమానిగా ఉండాలనే తపన నాకుండే. అందుకే ఎవుసం పనులు చేస్తున్న. పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఎవుసం చేసే పిల్లలను మంచిగా చదివిస్తున్న. ఉన్నదాంట్లో ఎవుసం చేస్తూ పది మంది కూలీలకు ఉపాధి ఇస్తున్న. రైతుకు సాయం అందించడానికి సీఎం సారు ఇస్తున్న రైతుబంధు మాకు రావడంతో అప్పుల తిప్పలు తప్పినయి. లాగోడి కష్టాలు తీరాయి. ఉన్నదాంట్లో గౌరవంగా బతుకుతున్నాం.
లాగోడికి పెట్టుబడి సాయం అందిందా?
లాగోడి పైసలు వచ్చినాయి. గా పైసల్తోనే టమాట పెట్టిన. టమాట కోత దశకు వచ్చింది. వచ్చిన లాగోడి పైసలతో కూలీలకు పెట్టి టమాటను ఏరిస్తున్న. అప్పులు చేయకుండా ఠంచన్‌గా పెట్టుబడి సాయం అందింది. అప్పు చేయకుండా ఆ పైసలు అక్కరకొచ్చినయి.
రైతుబంధుపై మీ అభిప్రాయం ఎంది?
ప్రతి రైతుకు పైసలు వస్తున్నయి. అప్పులు చేయకుండా, వచ్చిన సాయంతో ఎవుసం చేస్తూ సీఎం కేసీఆర్ సారూకు దండాలు పెడుతున్నారు. రైతులను ఆదుకోవడంలో మన సీఎం సారూ నంబర్ వన్‌గా ఉండడం సంతోషంగా ఉంది.
అవసరాలు తీరుతున్నయి..
వానకాలం.. యాసంగి మొదలైందంటే ఒకటే దిగులు.. పైసల కోసం శాన ఇబ్బందులు పడేటోళ్లం.. అప్పుల కోసం అవస్థలు పడ్డాం. అన్ని ఇబ్బందులు పడి సాగు చేస్తే వచ్చే దిగుబడి అప్పులోళ్లకు సరిపోయేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు మా గురించి ఆలోచించిండు. నాలుగేండ్ల సంది మాకు రంది లేదు. అప్పుల బాధ లేదు. ఏటా రెండు సీజన్లలో పెట్టుబడి సాయం ఇస్తున్నడు. నాకు ఎకరం భూమి ఉంది. సమయానికి లాగోడికి పైసలు అందుతున్నయి. తక్కువ నీటితో పల్లికాయ, కూరగాయలతో పాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు పెడుతున్న. పెట్టుబడి సాయంతో రైతుల అవసరాలు తీరుతున్నయి. ఏ ప్రభ్వుతమూ రైతులను ఇట్లా చూడలె. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలనే రైతులు సంతోషంగా ఉన్నారు.