
అమీన్పూర్, జనవరి 06: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ నవ్యకాలనీలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన క్రయ విక్రయాల్లో తేడాలు, మార్కెట్ రేట్ కంటే తక్కువగా దస్తావేజులు చేయించారనే ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ దాడులు గురువారం కూడా కొనసాగాయి. గతేడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలులో తేడాలున్నందునే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఒక కార్యాలయం ఉండగా.. బీరంగూడ నవ్యకాలనీలో ఒక కార్యాలయం ఉంది. బుధవారం రెండు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గురువారం బీరంగూడ నవ్య కాలనీలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో బయటకు ఎవరినీ రానీయకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం అందకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. సదరు సంస్థ జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనూ వెంచర్లు వేసింది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన ఈ సంస్థపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.