
తెలంగాణ సర్కారు వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా దవాఖానల్లో మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో కల్వకుర్తి ప్రభుత్వ దవాఖాన రూపురేఖలే మారిపోయాయి. ఐదేండ్లలోనే కార్పొరేట్‌ను తలదన్నేలా అధికారులు తీర్చిదిద్దారు. 24 గంటలపాటు వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు.. అన్న రోజుల నుంచి.. భరోసా పెరగడంతో ప్రజలు క్యూ కడుతున్నారు. కాయకల్ప పథకానికి వైద్యశాల ఎంపికై ప్రోత్సాహకాలు కూడా అందుకున్నది. మంజూరైన నిధులతోపాటు దాతలు చేయి కలపడంతో ఐసీయూ వార్డు, నవజాత శిశువు స్థిరీకరణ విభాగం ఏర్పాట య్యాయి. సాధారణ కాన్పులతోపాటు శస్త్రచికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిత్యం 300 నుంచి 450 వరకు ఓపీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఇక్కడ వైద్య సేవలుపొందుతున్నారు. అందుకే ఎన్హెచ్ఎం సర్వేలో 97.83 గ్రేడింగ్‌తో రాష్ట్రంలోనే
నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ప్రజలకు ఉచితంగా వైద్యం అందించ డం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ, సమైక్య రా ష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో తగిన వైద్య స దుపాయాలు లేక నమ్మకం సన్నగిల్లింది. వైద్యం కోసం భూములు, ఇల్లు, వాకి లి అమ్ముకొని మరింత నిరుపేదలుగా మారేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నది. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు.. అనే పరిస్థితి నుంచి నేడు నేను సర్కారు దవాఖానకే వస్తా బిడ్డా.. అనేలా వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. మొన్నటిదాకా తొండలు గుడ్లు పెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ నేడు పురుడు పోసుకున్న తల్లుల నవ్వులతో, పిల్లల కేరింతలతో కళకళలాడుతున్నాయి. ప్ర భుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నాగర్‌కర్నూల్ జి ల్లాలోని కల్వకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం నాణ్యమైన వైద్య సేవలకు చిరునామాగా మారింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) సర్వేలో కల్వకుర్తి దవాఖానకు 97.30 మార్కులు రావడంతో రాష్ట్రంలోనే ఉత్తమ దవాఖానగా ఎంపికైంది. కేంద్రం గుర్తింపుతో ప్రత్యేకంగా నిలిచిన కల్వకుర్తి దవాఖానపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఎన్హెచ్ఎం సర్వేలో నెంబర్‌వన్..
దేశవ్యాప్తంగా మెరుగైన వైద్య సేవలందుతున్న దవాఖానలను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ నిధు లు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అక్టోబర్‌లో రాష్ట్రంలోని అన్ని దవాఖానలను ఎన్హెచ్ఎం అధికారులు పరిశీలించారు. కల్వకుర్తి దవాఖానలో అత్యవసర వై ద్యసేవలు, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, ప్ర సవాల గది, నవజాత శిశువు స్థిరీకరణ విభాగం, ఆపరేషన్ థియేటర్, దవాఖానలో పరిశుభ్రత తదితర 11 అంశాలను మూడు రోజులు పరిశీలించి మార్కులు కే టాయించారు. ఏకంగా 97.30 శాతంతో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించి నంబర్‌వన్‌గా నిలిచిం ది. కేంద్రం నుంచి ఏటా రూ.5 లక్షల ప్రోత్సాహకం లభించనున్నదని వైద్యులు తెలిపారు. మూడేండ్ల పా టు కేంద్ర బృందం చేపట్టే సర్వేలో దవాఖానలో వసతులు, సేవలు అదే స్థాయిలో ఉంటే ఆ తర్వాత నిరంతరాయంగా కేంద్ర ప్రోత్సాహకాలు లభించనున్నాయి.
సర్వాంగ సుందరంగా..
కల్వకుర్తి దవాఖానను దశల వారీగా ఆధునీకరించి సర్వాంగసుందరంగా మర్చారు. హరితహారంలో భాగంగా దవాఖాన ప్రహరీకి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.దాతల సహకారంతో 25 ఐసీయూ పడకలు, 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఈ ప్రభుత్వ దవాఖాన మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా దవాఖానగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సుదూరం నుంచి వస్తున్నారు..
దవాఖాన సిబ్బంది సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది కాయకల్ప పథకానికి ఎంపికైంది. ఎన్హెచ్ఎం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి రాష్ట్రంలో ఉత్తమ సేవలందిస్తున్న దవాఖానగా గుర్తింపు ఇచ్చింది. దీంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రసవాల కోసం కల్వకుర్తి ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. స్థానికంగా ఉండే బంధువులతో ఇక్కడి దవాఖానలో మెరుగైన వైద్యం అందుతుందని తెలుసుకొని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రసవాల కోసం వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా అత్యుత్తమ సేవలందిస్తున్నాం. కాయకల్ప, ఎన్హెచ్ఎం ద్వారా రూ.లక్ష లభించగా.. అందులో నిబంధనల మేరకు 25 శాతం సిబ్బందికి ప్రోత్సాహకంగా అందించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు దవాఖానకు అందాయి. ఇక ఎన్హెచ్ఎం మార్కుల ద్వారా రూ.5 లక్షలు త్వరలో ఇవ్వనున్నారు. భవిష్యత్ సర్వేలైన్స్ రిపోర్ట్ ఆధారంగా మూడేండ్లపాటు ఈ ప్రోత్సాహకం ఉంటుంది. మూడేండ్లు సదుపాయాలు ఇలాగే ఉంటే జీవితకాలం ప్రోత్సాహకం అందుతుంది.
నాణ్యమైన వైద్యసేవలకు చిరునామా..
కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో ఐదేండ్లుగా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ కాయకల్ప పథకానికి పలుమార్లు ఎంపికై ప్రోత్సాహకాలు కూడా అందుకున్నది. ఈ ఏడాది కాయకల్ప కింద రూ.లక్ష ప్రోత్సాహకం అందింది. ఎన్హెచ్ఎం లక్ష్య పథకం కింద రూ.3 లక్షలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు దాతల సహకారం కూడా తోడవడంతో దవాఖానలో ఐసీయూ వార్డు, నవజాత శిశువు స్థిరీకరణ విభాగం ఏర్పాటు చేశారు. సాధారణ కాన్పులతోపాటు శస్త్రచికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిత్యం 300 నుంచి 450 వరకు ఓపీ ఉంటున్నది. 20 నుంచి 30 మంది వరకు ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. దవాఖానలో ప్రతి వార్డుకు సూచిక, ఆరోగ్య సూత్రాలు, వైద్యుల వివరాలు, అందుతున్న సేవలు తదితర వివరాలతో వాల్ ప్లేట్స్ ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండడంతో సేవలు మెరుగుపడ్డాయి.
అందుతున్న సేవలు..
కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో నిత్యం అవుట్ పేషెంట్లు 300 నుంచి 400 మంది వరకు వస్తుంటారు. 30 నుంచి 35 మంది దవాఖాలో అడ్మిట్ అవుతుంటారు. నిత్యం 250 దాక వివిధ రకాల పరీక్షలు చేస్తారు. ప్రతినెలా 100 నుంచి 120 మందికి ప్రసవాలు చేస్తారు. నార్మల్ డెలివరీలే ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల మేజర్, మైనర్ సర్జరీలు 250 నుంచి 300 వరకు చేస్తారు. కుక్కకాట్లు, పాముకాట్లు, పాయిజన్ కేసులు, యాక్సిడెంట్లు, ఎమర్జెన్సీ కేసులు అన్నీ కలిపి నెలకు దాదాపు 250 నుంచి 300 మంది వరకు వైద్యం అందిస్తారు. 108, 102 సేవలు సైతం దవాఖానకు అనుబంధంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ కిట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,897 మందికి డెలివరీలు చేశారు. ఇందులో 65 శాతం నార్మల్ కాగా.. 35 శాతం సిజేరియన్లు ఉన్నాయి వీరిలో 3,911 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారు. 986 మందిని అనర్హులుగా గుర్తించారు. కేసీఆర్ కిట్ కింద రూ.1.45 కోట్ల లబ్ధి చేకూరింది.
ప్రైవేట్‌కు వెళ్దామనుకున్నా..
ప్రసవం కోసం మొదట ప్రైవేట్ దవాఖానకు వెళ్లాలనుకున్నాం. అయితే, కల్వకుర్తి సర్కార్ దవాఖానలో మెరుగైన సేవలందిస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. సాధారణ ప్రసవం జరిగింది. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే రూ.50 వేలకు పైగా ఖర్చయ్యేది. కానీ ఇక్కడ ఒక్క పైసా ఖర్చు కాలేదు. పైగా కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. ఇక్కడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో ఈ స్థాయి సౌకర్యాలు లేవు. ఇక ఎప్పటికీ ప్రైవేట్ దవాఖానకు వెళ్లం.
హైదరాబాద్ నుంచి వచ్చా..
కల్వకుర్తి దవాఖానలో డెలివరీ చేయించుకోమని బంధువులు సలహా ఇచ్చారు. హైదరాబాద్‌లో వేలాది రూపాయలు ఖర్చు చేసినా సరైన వైద్య సేవలందే పరిస్థితి లేదని ఇక్కడికి రమ్మన్నారు. సర్కారు దవాఖాన అని అనుకున్నాను. కానీ అందరూ చెప్పడంతో ధైర్యం చేసి కల్వకుర్తికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇది ఎంత అద్భుతమైన దవాఖాన అని. ప్రైవేట్‌ను తలదన్నేలా వైద్యులు, సిబ్బంది సేవలందించారు. ప్రభుత్వ దవాఖానలే ఎంతో మేలని కల్వకుర్తి దవాఖాన వైద్యుల సేవలు నిరూపిస్తున్నాయి. వారందరికీ థ్యాంక్స్.