క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. శుక్రవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రం ఆకారంలో ఉన్న విద్యుత్ దీపాలను వెలిగించారు. క్రిస్మస్ సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన క్రైస్తవులతో మార్కెట్లో సందడి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ, గ్లోరియస్, బోధన్ పట్టణంలోని రాకాసిపేట్లో సెయింట్ పీటర్ చర్చి, భీమునిగుట్ట సీఎస్ఐ చర్చి, క్రిస్టియన్ కాలనీలోని బాప్టిస్ట్ చర్చి, శక్కర్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ, ఫిలదెల్ఫియా, నిజాంసాగర్లోని బెరాకా, గాంధారిలోని నిష్కలంక, బాప్టిస్ట్ చర్చిలు ముస్తాబయ్యాయి. శనివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.