e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News అవినీతి జాఢ్యం..

అవినీతి జాఢ్యం..

  • అభివృద్ధికి ఆటంకం
  • ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం దందా
  • విమర్శలకు తావిస్తున్న పలువురి వ్యవహార శైలి
  • చైతన్యంతోనే అక్రమాలకు చరమగీతం
  • నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

‘ ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు… దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ ఠాగూర్‌ సినిమాలోని ఈ డైలాగ్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో.. లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిల్వ ఉన్న నీటిలో పాచి అనే చందంగా నేటి జీవితంలో అవినీతి సాధారణమనే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ముఖ్యం గా రెవెన్యూ, పోలీసు శాఖల్లో జరుగుతున్న తంతుకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. అన్ని శాఖలకు విస్తరించిన అవినీతి జాఢ్యం… క్రమంగా అభివృద్ధికి ఆటంకమై నిలుస్తున్నది. ఒకప్పుడు ఏడాదికి ఒక కేసు నమోదైతేనే వామ్మో అనుకునే వాళ్లం. ఇప్పుడు ఏకంగా ఏడాదికి పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. 2020లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో పోలీసుశాఖలో సీఐ స్థాయి అధికారులు వరుసగా నెలన్నర రోజుల్లోనే ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ ఉద్యోగులు సైతం డబ్బులు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి చిక్కిన ఘటనలున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పరిపాలన అధికారి స్వయంగా డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏసీబీ చెంతకు చేరని అక్రమాలు అనేకం ఉన్నాయి. పోలీసు శాఖలో ఈ మధ్యకాలం లో విచ్చలవిడితనం విపరీతంగా పెరిగింది. రెవెన్యూలో ధరణి వచ్చిన తర్వాత దోపిడీ వ్యవహారం తగ్గినప్పటికీ తహసీల్దార్లు మాత్రం కిందిస్థాయి ఉద్యోగులను అడ్డు పెట్టుకొని వసూళ్ల దందాను నడిపిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే స్వేచ్ఛగా ఫిర్యాదు చేయొచ్చని అవినీతి నిరోధక శాఖ చెబుతున్నది.

- Advertisement -

రెవెన్యూలో వసూల్‌ రాజాలు..

రెవెన్యూ శాఖలో అక్రమాలకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్టాలను సవరించింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ధరణి అనే కొత్త వ్యవస్థకు ఊపిరి పోసింది. భూ లావాదేవీల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేకనేక చర్యలు తీసుకున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లకు అప్పగించడం ద్వారా అవినీతి రూపుమాపేందుకు చర్యలు తీసుకున్నది. ధరణి పోర్టల్‌ ఆన్‌లైన్‌ సేవలతో కచ్చితత్వానికి పెద్దపీట దక్కడంతో రెవెన్యూలో అక్రమాలకు అలవాటు పడుతున్న అధికారులు మాత్రం సామాన్యుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, పట్టాపాస్‌ బుక్కుల జారీలో తహసీల్దార్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తున్నది. కంప్యూటర్‌ ఆపరేటర్లు, ధరణి సేవలందిస్తున్న ప్రైవేటు వ్యక్తులను మధ్యవర్తులుగా పెట్టుకొని తతంగాన్ని నడిపిస్తున్నారు. నవీపేట, ఎడపల్లి, మాక్లూర్‌, డిచ్‌పల్లి, బోధన్‌, కోటగిరి, బాల్కొండ, సిరికొండ మండలాల్లో ఇలాంటి విమర్శలున్నాయి. నిజామాబాద్‌ నగరం చుట్టూ భూముల విలువ పెరగడంతో నిజామాబాద్‌ సౌత్‌, నిజామాబాద్‌ నార్త్‌ మండలాల్లో నాలా కన్వర్షన్‌ పేరుతో జరుగుతున్న దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈ రెండు మండలాల్లో ఇక్కడే తిష్ట వేసుకున్న ఓ ఇద్దరు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్కడంతా ఆగమాగం..

నిజామాబాద్‌ నగరంలో ప్రైవేటు బిల్డింగ్‌లలో నడుస్తున్న ప్రభుత్వ శాఖల కార్యకలాపాలపై పర్యవేక్షణ అన్నది ఇష్టారాజ్యంగా మారింది. ఉన్నతాధికారుల చూపు ఇటువైపు లేకపోవడంతో ఈ ప్రాంతాల్లోని అధికారుల పనితీరు ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. భూగర్భ గను లు, రిజిస్ట్రేషన్‌, ఆడిట్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, డ్రగ్స్‌ కంట్రో ల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖల్లో అవినీతి విపరీతంగా రాజ్యమేలుతున్నది. కలెక్టరేట్‌ బంగ్లాలో అక్కడక్కడా అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన నినాదాలు, ఏసీబీ అధికారుల ఫోన్‌ నంబర్లు కనిపిస్తున్నప్పటికీ… మిగిలిన చోట్ల చూద్దామన్నా మచ్చుకూ కనిపించవు. విధిగా ఏసీబీ అధికారుల ఫోన్‌ నంబర్లు, అవినీతికి సంబంధించిన నినాదాలు ఉండాల్సినప్పటికీ పట్టించుకునే వారు లేరు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై వాల్‌పోస్టర్లు అతికిస్తే నిమిషాల్లోనే చించివేసిన ఘటనలు సైతం అనేకం ఉన్నాయి. ఫోన్‌ నంబర్లను చెరిపేసి తప్పుడు సంకేతాలు పెట్టి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.

తీరుమారని ఖాకీలు..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గతేడాది పోలీసు శాఖలో అక్రమార్కులు పెద్ద సంఖ్యలో బయటపడ్డారు. వరుసగా సీఐ స్థాయి అధికారులే అమాయకుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బాన్సువాడ, బోధన్‌ డివిజన్‌ కేంద్రాల్లో కేవలం రోజుల వ్యవధిలోనే అవినీతి నిరోధక శాఖకు చిక్కడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ సీఐ… ఏకంగా క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో తలదూర్చి కటకటాల పాలయ్యారు. ఇందులో విచారణ సాగిస్త్తున్న క్రమంలోనే కామారెడ్డి టౌన్‌ ఎస్సైతోపాటు స్థానిక డీఎస్పీలు పాత్రధారులుగా తేలారు. వరుసగా అర డజన్‌ పోలీసు అధికారులే ఏసీబీకి చిక్కడంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో కొద్దిరోజుల పాటు ఖాకీలు కలవరపాటుకు గురయ్యారు. తీరు మార్చుకోవాలంటూ నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి స్వయంగా మీటింగ్‌లు పెట్టి ఎస్సైలు, సీఐలకు హితబోధ చేశారు. అయినప్పటికీ కొంతమంది అక్రమార్కుల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. ఇసుక, మొరం దందాల్లో ప్రత్యక్షంగా పాత్రధారులుగా ఖాకీలు నిలుస్తున్నారు. అక్రమాలను నిలువరించాల్సిన వారే అన్నీ తామై భూగర్భ గనులను కొల్లగొడుతున్న వారికి వంతపాడుతూ రక్షణ కవచంగా నిలుస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతో ఈ మధ్యకాలంలోనే నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌ డివిజన్‌లో ఎస్సైలపై బదిలీతోపాటు సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్నప్పటికీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఖాకీ డ్రెస్సులు వేసుకున్న కొంతమంది బరితెగించడం విడ్డూరంగా మారింది.

ఏసీబీకి అనేక మార్గాలు..

ప్రభుత్వ ఉద్యోగి తాను చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్‌ చేస్తే అలాంటి వారిపై ఏసీబీ అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దీంతో వారు పరిశీలన చేసుకున్న అనంతరం లంచం డిమాండ్‌ చేసిన వారిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తారు. ఉద్యోగి అడిగిన మొత్తాన్ని ఫిర్యాదుదారు నుంచి తీసుకొని ఆ నోట్లకు రసాయనాలు పూసి బాధితుడికిస్తారు. ఈ డబ్బుల్ని ఉద్యోగి తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అక్రమాస్తులు గడించే ప్రభుత్వ ఉద్యోగుల బండారం బయట పెట్టి వారిపై కేసులు నమోదు చేస్తారు. ఈ కేసుల్లో ప్రజలు ఫిర్యాదుదారులుగా ఉండాల్సిన అవసరం లేదు. కచ్చితమైన సమాచారం అందిస్తే చాలు. మిగతా పరిశీలన, పరిశోధన ఏసీబీ అధికారులు పూర్తి చేసి తగు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాలనూ ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం ఏసీబీ అధికారులకు ఉంటుం ది. రికార్డుల నిర్వహణ తీరును పరిశీలిస్తారు. చెక్‌పోస్టులు, సబ్‌ రిజిస్ట్రార్‌, రవాణా తదితర రోజువారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వాటిల్లోనూ తనిఖీలు చేస్తారు. ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నంబర్‌ను కేటాయించింది. 1064కు ఫోన్‌ చేసి అవినీతి అధికారుల వివరాలను ప్రజలు చెప్పొచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతారు.

డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి..

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే ఏసీబీకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుదారుడి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. కచ్చితమైన వివరాల ఆధారంగా సదరు అవినీతిపరుడిని పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవినీతి అంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. పారదర్శకమైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. లంచం అడగడం తప్పు. లంచం ఇవ్వడం కూడా తప్పేనని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.

  • నగేశ్‌, డీఎస్పీ, ఏసీబీ
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement