బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడా లేని విధంగా రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆరోగ్యనగర్లో నిర్మించతలపెట్టిన మోడల్ అంగన్వాడీ భవన నిర్మాణానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం భూమిపూజ నిర్వహించారు. నాట్కో ట్రస్ట్ భాగస్వామంతో 300 గజాల స్థలంలో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని రూ.30లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారని, మూడునెలల్లోనే పనులు పూర్తి చేస్తారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. విశాలమైన తరగతితో పాటు వంటగది, పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం ఉంటాయని, నిర్మాణంలో వాడుతున్న ప్రత్యేక ఇటుకల కారణంగా సాధారణంగా ఉండే ఉష్టోగ్రతకంటే తక్కువగా ఉంటుందన్నారు.
గ్రేటర్ పరిధిలో ఇలాంటి అంగన్వాడీ కేంద్రం నిర్మించడం ఇదే తొలిసారని, ఈ మోడల్ అంగన్వాడీ భవనం నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలో మరో నాలుగు బస్తీల్లో ఐసీడీఎస్ అధ్వర్యంలో ఇదే తరహాలో అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ది పనులు జరుగుతున్నా యని, అభివృద్దితో పాటు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో వెంకటరమణి, సూపర్వైజర్ రబిత, నాట్కో ట్రస్ట్ ప్రతినిధులు యాదగిరి, మదన్, రాంబాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, బస్తీ టీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.