e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News సాహితీకారులు ఈ బాలలు

సాహితీకారులు ఈ బాలలు

  • అంతర్జాల పోటీల్లో మేటి బాల కవులు
  • కథా రచన, కవిత సమ్మేళన పోటీల్లో సత్తా చాటుతున్న బొల్లారం విద్యార్థులు
  • అవార్డులు, రివార్డులతో అదరగొడుతున్న వైనం
  • తెలుగు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో శిక్షణ

బొల్లారం, నవంబర్‌ 25 : ఆడి పాడే వయస్సులో అద్భుతమైన కవితలు, కథలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చదువుతో పాటు సాహిత్య రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. పాల్గొనే ప్రతి అంతర్జాల వేదికపై అసమాన కథా వస్తువు, కవితా దృష్టిని ఆవిష్కరిస్తూ విభిన్న రచనలకు శ్రీకారం చుడుతున్నారు బొల్లారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాల కవులు కొండపల్లి ఉదయ్‌కిరణ్‌, దాసరి జగదీష్‌, శ్రీరాములు కుమారి. తమ కవితలు, కథలతో చిన్న వయస్సులోనే అందరితో ఔరా: అనిపించుకుంటున్నారు. సాధారణంగా రెండు సంవత్సరాల పిల్లలు చిత్రపటాలను చూస్తూ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, టీనేజీ పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. ఆ కోవకే చెందిన ఈ బాల కవులు అసమాన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో అందరిలాగే చదువుకొంటున్న కొండపల్లి ఉదయ్‌కిరణ్‌, దాసరి జగదీష్‌, శ్రీరాములు కుమారిలు తోటి విద్యార్థులకు భిన్నంగా ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలోనే మాతృభాషపై మమకారంతో తెలుగులో కథలు, కవితలు రాయాలనే జిజ్ఞాసను పెంచుకున్నారు. ఇందుకు పాఠశాల తెలుగు మాస్టారు ప్రోత్సాహం తోడైంది. ఇక ఆ బాలకవుల చేతిలోని కలం పదాల పరుగులు పెట్టింది. కథ వస్తువు, పరిసరాల్లోని వివిధ అంశాలపై కవితలు రాస్తూ ప్రతిభను చాటుతున్నారు.

ప్రత్యేకంగా సామాజిక అంశాలపై..

- Advertisement -

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కథలు రాయడం నేర్చుకున్నారు. ప్రధానంగా సామాజిక అంశాలపై పట్టు సాధించారు. కరోనా సమయంలో కుటుంబాలు పడిన కష్టాలు, బాధితుల వ్యధలు, తల్లిదండ్రుల ప్రేమ, దాతల ఔదార్యం, కరోనా కట్టడికి వైద్యుల కృషి, నీతి, న్యాయం, ధర్మం, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర తదితర సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేశారు.

కవిత, కథ రచనలు చేయడం చాలా ఇష్టం..

నాలో ఉన్న ప్రత్యేక ఆసక్తిని గ్రహించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. కథ రచనలే కాకుండా కవితలు రాయడం నాకు చాలా ఇష్టం. కవిత, కథ రచనలు చేసే సమయంలో మెళకువలు చెబుతున్నారు. వాటిని నేను తప్పకుండా పాటిస్తాను. సమాజంలోని విభిన్న అంశాలపై పట్టు సాధించాలని అదే కవిత వస్తువు, లేదా కథ రచనలకు ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు చెప్పారు.

  • బాల కవి, శ్రీరాములు కుమారి, పదో తరగతి విద్యార్థి, బొల్లారం

అద్భుత రచనలు చేసే విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం..

గత రెండు సంవత్సరాల్లో విద్యార్థులు అద్భుతమైన కవితలు, కథ రచనలు చేశారు. వాటి ఆధారంగానే వారిలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నా. కరోనా సమయంలో కూడా విద్యార్థులు చురుకుగా కథలు రాశారు. సమకాలీన అంశాలపై చేసిన రచనలు అంతర్జాలంలో పురస్కారాలు, ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అసమాన ప్రతిభను చాటుతూ విద్యార్థులు పాఠశాలకు మంచి పేరు సంపాదించి పెడుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించిన సందర్భాలూ ఉన్నాయి. పాఠశాలలో అద్భుతమైన రచనలు చేసే విద్యార్థులు చాలా మందే ఉన్నారు. వారిలోని మేథో సంపత్తిని బయటకు తీసుకురావాలనే నిరంతరం కృషి చేస్తున్నా.

  • అడ్డాడ శ్రీనివాస్‌రావు, తెలుగు గైడ్‌ ఉపాధ్యాయుడు, బొల్లారం

ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో కీలకం

పాఠశాలలో చేరిన నాటి నుంచి నాలో ఒక ప్రతిభ ఉందని గుర్తించిన ఉపాధ్యాయులు నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తునే ఉన్నారు. వారి దిశానిర్దేశం మేరకే చదువుతో పాటు కథ రచనలో రాణిస్తూ అర్థ శతకం దిశగా అడుగులు వేశాను. కథ రచనలో ‘గాధ వజ్రాయుధ’ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది.

  • బాలకవి దాసరి జగదీష్‌, పదో తరగతి విద్యార్థి, బొల్లారం

కథ రచనకు కొంత సమయం..

సమకాలీన అంశాలను ఎంచుకుని కథలుగా రాయడం ప్రారంభించా. అటు చదువులో రాణిస్తూనే బాలకవిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉంది. అందుకు నిరంతరం కృషి చేస్తున్నా. కథలు రాయడానికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నా. తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ప్రోత్సాహం బాగుంది. కథ రచన ప్రక్రియలో వెన్నుతట్టి సలహాలు, సూచనలు ఇస్తారు. కవితలకు కూడా పురస్కారాలు లభించాయి. నేను రాసిన 50కి పైగా మినీ కథలకు గాధ వజ్రాయుధ పురస్కారం రావడం చెప్పలేని ఆనందం కలిగించింది.

అంతర్జాల పోటీల్లో ప్రతిభ..

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల నుంచి ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు. ఇదే వేదికగా బాల కవులు జగదీష్‌, ఉదయ్‌కిరణ్‌ దాదాపు 50కిపైగా మినీ కథలు రాశారు. ఇందుకు వారికి ‘గాధ వజ్రాయుధ’ పురస్కారం, ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేశారు.
పాల్గొన్న ప్రతీ వేదికపై తమ అసమాన కథానిక దృష్టిని ఆవిష్కరిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఇక శ్రీరాములు కుమారి 25 కథలు రాయగా ‘గాధ సృజన సంయమి’ పురస్కారం అందుకుంది.
ఉదయ్‌కిరణ్‌ రాసిన కథ రచన ముంబైకి చెందిన స్టోరీ మిర్రర్‌ డాట్‌ కామ్‌ పోటీల్లో ఉత్తమ కథగా పురస్కారం గెలుచుకుంది. కాగా, పాఠశాలల్లోని ఇతర విద్యార్థులు ఖాసీం కాసు, సాయికుమారి,
నజియా, శృతి, అఖిల్‌రెడ్డి, హరిణి, కార్తీక్‌ ముగ్గురు బాల కవులను స్ఫూర్తిగా తీసుకుని రచనలు ప్రారంభించారు.

‘మాతృదేవోభవః.. పితృదేవోభవః’.. మొక్క.. చిరునవ్వు, కులవృత్తి, ధర్మము, కోపము, మూఢనమ్మకం.. విలువ, అత్యాశ, ప్రేమ, స్వార్థపరులు, అందం, ఆలస్యం అమృతం.. ప్రీతి ప్రతిభ, కరోనా ముప్పు, అమ్మప్రేమ, ఆకలి, వలస కూలీ, దేవుళ్లు, మాయ, కుళ్లు.. అనే శీర్షికలతో శ్రీరాములు కుమారి 25కథలు రచించింది. ‘గాథ సృజన సంయమి’ పురస్కారం సాధించింది.

తల్లి విలువ, ఒత్తిడి, ఉపాయం, ఆలోచన, మార్పు, పక్షులు, మానవత్వం, విశ్వాసం, చెట్లు, సమయం, అమ్మమాట, నిజాయితీ, స్టార్‌, నమ్మకం, గౌరవం, పబ్జీ గేమ్‌, సంతృప్తి, మార్కులు, మోసం, మంచి మనసు, ప్రోత్సాహం, నిదర్శం, ఆధారం, రైతు, స్నేహం అనే శీర్షికలతో ఉదయ్‌ కిరణ్‌ సందేశాత్మక కథలు రాశాడు.

మంచితనం, స్నేహం, పిల్లలు.. దేవుళ్లు.. విడిచి ఉండలేను, దేవుని రూపం, అత్యాశ, అవినీతి, మూఢనమ్మకం, ఉపాధ్యాయుడి బాధ్యత, మానవత్వం, పెళ్లి కానుక, విగ్రహ విశిష్టత, తల్లిప్రేమ, ప్రాణవాయువు, సహనం, చావులో తోడు, ఆశయం, దుఖఃంలో నిర్ణయం, కృతజ్ఞత, పుస్తకం, మంచి నేస్తం, ఆశ-దురాశ, ప్రతిభ, కొడుకులో వచ్చిన మార్పు, పరివర్తన, నిజమైన బంధం అనే శీర్షికలతో జగదీష్‌ అనే బాలుడు సందేశాత్మక కథలు రాశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement