
ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు,అధికారులు, రైతులు పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. వ్యవసాయం, రైతుబంధు, రైతుబీమాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న వారోత్సవాలతో అంతటా సందడి కనిపిస్తున్నది. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన, క్రీడా, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రజాప్రతినిధులు, అధికారులు బహుమతలను ప్రదానం చేశారు. పలుచోట్ల విద్యార్థులు రైతు వేషధారణలతో ఆకట్టుకోగా, పశువులు, వ్యవసాయ పనిముట్లను ముగ్గుల రూపంలో వేసి ప్రశంసలు అందుకున్నారు. రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మహిళలు, యువతులు తమ ఇండ్ల ఎదుట ఎంతో ఆకర్షణీయంగా రంగవల్లులు వేశారు. మెదక్ జిల్లా చిట్కుల్ నుంచి చిలిపిచెడ్ వరకు, సంగారెడ్డి జిల్లా హత్నూర నుంచి దౌల్తాబాద్ గ్రామం వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ తీశారు. హుస్నాబాద్‌లో కస్తూర్బా గాంధీ విద్యార్థిని బానోతు త్రివేణి రైతుబంధు తమ కుటుంబానికి ఎంత భరోసానిచ్చిందో వివరించి అందరినీ ఆలోచించేలా చేసింది. ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మదన్‌రెడ్డి, కొనింటి మాణిక్‌రావు ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, వంటేరి యాదవరెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పల్లెలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, రైతు వేదికలు కోలాహలంగా మారాయి. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట, విద్యాలయాలు, పుర వీధులు, ఇండ్ల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ ముగ్గులు వేశారు. ఆయా చోట్ల మహిళలు, యువతులు, విద్యార్థినులు వేసిన రంగవళ్లులను న్యాయనిర్ణేతలు పరిశీలించి, బహుమతులు ప్రకటించారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో తదితర ఆటల, పాటల పోటీలు నిర్వహించారు. పలు చోట్ల రైతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర నుంచి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ తీయగా, నర్సాపూర్ ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు గ్రామాల మధ్య సాగిన ఈ ర్యాలీలో ‘జై కేసీఆర్.. జై కిసాన్’.. అంటూ రైతులు నినాదాలు చేశారు.
రైతు ఐదు వేళ్లు మట్టిలో దిగితేనే..
రైతులను మనం గౌరవించాలి.. రైతు ఐదువేళ్లు మట్టిలో దిగితేనే.. మన నోట్లోకి తిండి గింజలు వస్తాయని గుర్తుంచుకోవాలి.. మాకు అమ్మానాన్నలేరు.. మాకు ఎకరం భూమి ఉంది. రైతుబంధు పెట్టుబడి రూ.ఐదువేలు మాకు మేలు చేస్తున్నాయి’అని సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ కేజీబీవీ తొమ్మిదో తరగతి విద్యార్థి బానోతు త్రివేణి ఉపన్యాసమివ్వగా, అందరినీ ఆలోచింపజేసింది. శుక్రవారం రైతుబంధు సంబురాల్లో భాగంగా హుస్నాబాద్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో త్రివేణి మాట్లాడింది. ‘మా భూమికి వస్తున్న రైతుబంధుతోనే మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్నం. మా నాన్న సీతారాం, అమ్మ లక్ష్మి ఇద్దరూ చనిపోయారు. మేము ఏడుగురు కుటుంబసభ్యులం. మా నలుగురు అక్కలకు పెండ్లిండ్లు అయ్యాయి. మా అక్క, మా తమ్ముడు, నాకు వ్యవసాయమే ఆధారం. మాకు సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు బాగా ఉపయోగపడుతున్నది. రైతుబంధు పెట్టుబడి మాకు మేలు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’..అని త్రివేణి తన ఉపన్యాసం ముగించగా, పాఠశాల ఆవరణలో ఉన్న వారందరినీ ఆలోచింపజేసింది.
రైతు సంబురానికి ‘పిన్నింటి’ దర్వులు..
డప్పు పట్టి దర్వులేస్తున్న ఈ బుడ్డో పేరు పిన్నింటి రిశ్విత్. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ గ్రామం. శుక్రవారం ఇంటి ముందు తన తల్లి వేసిన ‘రైతుబంధు’ ముగ్గును చూసి ఆ సంబురాల్లో నేను కూడా పాల్గొంటానంటూ ఇంట్లో ఉన్న డప్పుతో దర్వులేసి సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుడు పిన్నింటి రత్నం కుమారుడైన ఈ చిన్నోడు తనకు తన కుటుంబానికి సీఎం కేసీఆర్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు.