
మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది ఈ సమాజం. గురువును ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. తన వద్ద చదువు నేర్చుకున్న విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పుడు ఆ ఉపాధ్యాయుడికి కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఉపాధ్యాయుడంటే కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా సామాజిక సేవా ధృక్పథంలో పనిచేస్తున్నవారూ ఉన్నారు. చదువు చెప్పడమే కాకుండా మొక్కలు నాటడం, పాఠశాలల రూపురేఖలు మార్చడం, విద్యార్థులకు ఇతోధికంగా సాయం చేస్తున్నవారూ ఉన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి వారి గురించి అందిస్తున్న ప్రత్యేక కథనాలు.
మాతృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి భారతీయ సమాజం కల్పించింది. పూర్వకాలంలో గురువులను వెతుకొంటూ వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకొని సకల విద్యలను శిష్యులు నేర్చుకునేవారు. ఆయితే నేటి ఆధునిక కాలంలో మాత్రం గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పుకుంటారు. తన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలంటూ జన్మదినం రోజున శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారిని ఉద్దేశించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృఫ్ణన్ అన్నారు. తరాలు మారినా గురుస్థానం మారకూడదన్న తన ఆశయానికి అనుగుణంగా ఆ మహనీయుడు చేసిన సూచన భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 5కి విశిష్టతను కల్పించింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలు.
‘విద్య అంటే మమత.. విద్య అంటే మానవత.. అన్నారు డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణన్. విద్య ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక, ఆదర్శప్రాయమైన జీవితం గడిపి, భారతావని గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5న. అంత టి మహనీయుడు రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించాడు. ఆయన తండ్రికి రాధాకృష్ణన్ ఇంగ్లిష్ చదవడం ఇష్టం లేదు. ఆయనను పూజారిని చేద్దామనుకున్నాడాట. కానీ, చదువులో అపార ప్రతిభ గల రాధాకృష్ణన్ తిరుపతి, మద్రాస్‌లో చదివి మాస్ట ర్ పట్టా పొందాడు. ఇరవై సంవత్సరాలకే ఆయన మద్రాస్ ప్రెసిడెన్షి కళాశాలలో తత్వశాస్త్ర అధ్యాపకుడిగా నియమితులయ్యారు. గురువుగా ఆయన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1954లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి ఆయనను సత్కరించారు.