
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్పరిధిలోని మొత్తం ఎనిమిది డిపోల నుంచి 230 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వీటిని ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు నడపనుంది. అయితే, ఈ సారి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని, ప్రైవేటును ఆశ్రయించకుండా సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని అధికారులు సూచిస్తున్నారు. tsrtconline.inలో ముందస్తుగా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని, రద్దీని బట్టి మరిన్ని అదనపు బస్సులను నడుపుతామని పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ దృష్ట్యా మాస్క్, శానిటైజర్ లేకుండా ఎవరూ బస్సు ఎక్కొద్దని తెలిపారు
పంటలు చేతికొచ్చే సమయంలో రైతన్నలు సంబురంగా చేసుకునే సంక్రాంతి రానే వచ్చింది. పండుగను బంధువులు, మిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ నుంచి తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలు, ఆంధ్రాలోని నగరాలు, పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా మెదక్ రీజియన్ నుంచి 230 బస్సులను నడిపేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో 190 బస్సులను హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, మిగతా 40 బస్సులను ఆంధ్రాలోని ముఖ్యమైన ప్రదేశాలకు నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 8 ఆర్టీసీ డిపోలుండగా, ప్రతియేటా మెదక్ రీజియన్ నుంచి తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ ప్రయాణం…
ప్రస్తుత చార్జీలతోనే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడిపించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు నిర్ణయించారు. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే ముందుగా సీట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా tsrtconline.inలో టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించారు. ఆంధ్రాలోని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైతే మరిన్ని అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రాకు 40 ప్రత్యేక బస్సులు…
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాలకు మెదక్ రీజియన్ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, కందుకూరు. ఉదయగిరి, నర్సాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఈ బస్సుల ద్వారా క్షేమంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేయనున్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు బస్సులు తిరిగేలా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పరిధిలో నడిచే 190 బస్సులు జూబ్లీ, ఇమ్లిబన్ బస్‌స్టేషన్, పటాన్చెరు, లింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల నుంచి సంక్రాంతి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని, మాస్క్ లేకుండా బస్సెక్కొద్దని, తప్పనిసరిగా శానిటైజర్‌ను వాడాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.
రీజియన్ నుంచి దూర ప్రాంతాలకు నడిచే బస్సులు…
మెదక్ రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి ఇప్పటికే ఆంధ్రా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, సందర్శన కేంద్రాలకు 20 వరకు బస్సులు నడిపిస్తున్నారు. సంగారెడ్డి డిపో నుంచి తిరుపతి, వైజాగ్, విజయవాడ, నెల్లూరుకు రోజు వారీగా బస్సులు వెళ్తున్నాయి. నారాయణఖేడ్ నుంచి కందుకూరు, చీరాలకు, జహీరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, నెల్లూరు, బెంగళూరుకు, అలాగే మెదక్ నుంచి అమలాపురం, కాకినాడ, తిరుపతిలకు, గజ్వేల్-ప్రజ్ఞపూర్ నుంచి విజయవాడకు, సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరులకు, హుస్నాబాద్ డిపో నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.అయితే, దుబ్బాక డిపో నుంచి కేవలం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే బస్సులు వెళ్తుండగా, ఆంధ్రా రాష్ర్టానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించలేదు.
రద్దీని బట్టి అదనపు బస్సులు…
సంక్రాంతి పండుగకు మెదక్ రీజియన్ నుంచి ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులకు నడుపుతున్నాం. ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనపు బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి మెదక్ రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 190 బస్సులు, ఆంధ్రా రాష్ర్టానికి 40 బస్సులను తిప్పేందుకు సిద్ధం చేశాం. ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతోనే ప్రయాణం చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి ఏడాది రీజియన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రైవేటు ప్రయాణం కన్నా ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం, క్షేమం.