కార్పొరేషన్, ఏప్రిల్ 17: నగరంలో వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌సిటీలో భాగంగా వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బల్దియా చర్యలు చేపడుతున్నది. నగరంలో ఎక్కడికక్కడ వరద నీటిని తరలించేందుకు వీలుగా రూ. 134 కోట్లతో ప్రధాన మురుగు కాల్వలను అభివృద్ధి చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మురుగు కాల్వలను విస్తరించడం… పలు ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణానికి మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులకు గత నెలలో టెండర్లు కూడా పూర్తి చేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ మురుగు కాల్వల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా… మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి కాల్వల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు.
నగరంలో వర్షం పడినప్పుడల్లా జ్యోతినగర్, ముకరంపుర ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఇండ్లల్లోకి రావడం పరిపాటిగా మారింది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలోనే స్థానికంగా ఉన్న మురుగు కాల్వను ఒక్క పక్క మరింత విస్తరించగా.. ఇప్పుడు మరోవైపు ఉన్న మురుగు కాల్వను కూడా భారీగా విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు త్వరగా కిందికి వెళ్లే విధంగా కాల్వల నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే, ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న గణేశ్‌నగర్ బైపాస్‌లోని ప్రధాన మురుగు కాల్వ పనులను కూడా ఈ నిధులతోనే చేపడుతున్నారు. వీటితో పాటు రాంపూర్, భగత్‌నగర్, విద్యానగర్, రేకుర్తి తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లే విధంగా మురుగు కాల్వలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు పనులు చేపడుతున్నారు.
మురుగు కాల్వల అభివృద్ధి పనులన్నింటినీ రెండు నెలల్లో పూర్తి చేయాలని నగరపాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఆయా కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేపట్టేలా అధికారులు కృషి చేస్తున్నారు. గత వానకాలంలో ఎక్కడైతే తీవ్ర ఇబ్బందులు వచ్చాయో అక్కడ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. వానకాలం నాటికి మురుగు కాల్వల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపడుతుండగా, వచ్చే వానకాలంలో ఇబ్బందులు రావని అధికారులు అభిప్రాయపడుతున్నారు.