
పంచాయతీల్లో పాలన మెరుగుపర్చడంతో పాటు నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ ఆడిట్ సత్ఫలితాలనిస్తున్నది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్ జిల్లాలోని 526 పంచాయతీల్లో వందశాతం ఆన్లైన్ ఆడిట్ పూర్తవగా, రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వివిధ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు, అలాగే కేంద్రం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నది. ఈ డబ్బులు ఏ గ్రామానికి ఏ సమయంలో ఎన్ని వచ్చాయి.. ఎంత ఖర్చైంది.. ఎక్కడ తప్పులు ఉన్నాయి.. తదితర విషయాలను ఆడిట్ అధికారులు పక్కాగా పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
మెదక్, జనవరి 7 : ఆన్లైన్ ఆడిట్‌తో గ్రామ పంచాయతీలకు విడుదలయ్యే నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్టపడనున్నది. గతంలో పలుచోట్ల అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రెండేండ్ల క్రితమే ఈ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2020 మార్చి 31, 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్ జిల్లాలోని 526 పంచాయతీల్లో అధికారులు ఆన్లైన్ ఆడిట్‌ను వందశాతం పూర్తి చేయగా, రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రారంభించినప్పటి నుంచి ప్రత్యేక ఎస్ఎఫ్సీ (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) నిధులను ప్రతి నెలా విడుదల చేస్తున్నది. అలాగే, కేంద్ర ప్రభుత్వం సైతం 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ఏడాదికి రెండు సార్లు అన్ని పంచాయతీలకు విడుదల చేస్తోంది. దీంతో నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు ఆడిట్‌ను నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నది.
526 పంచాయతీల్లో వంద శాతం పూర్తి…
మెదక్ జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆన్లైన్ ఆడిట్ పూర్తైంది. జిల్లావ్యాప్తంగా కొన్ని పంచాయతీలు ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీలు చెల్లించలేదని, ఐటీ కట్టడం లేదని, జీఎస్టీ బకాయిలు ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం లేదని ఆడిట్లో తేలిందని, ఆడిట్ సమయంలో రికార్డులు చూపించని పంచాయతీలు 40 రోజుల్లోగా సరైన రికార్డులు, హార్డ్‌కాపీలను అధికారులకు అందజేయాల్సి ఉంటుందని ఆడిట్ అధికారులు తెలిపారు. గడువులోగా వివరాలు ఇవ్వకుంటే ఆడిట్లో తేలిన అంశాలను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని సర్పంచ్‌లు, కార్యదర్శులు, కారోబార్లకు సూచించడంతో పూర్తి స్థాయి రికార్డులను ఆన్లైన్లో నమోదు చేయించారు.
అక్రమాలకు చెక్..
పంచాయతీల్లో జరిగే అక్రమాల విషయంలో గతంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు మాత్రమే బాధ్యులుగా ఉండేవారు. దీంతో నిధుల రికవరీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆన్లైన్ ఆడిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఏ గ్రామానికి సంబంధించి ఏ సమయంలో ఎన్ని నిధులు వచ్చాయి.. ఎంత ఖర్చైంది.. ఎక్కడ తప్పులు ఉన్నాయి.. తదితర విషయాలు పారదర్శకంగా ఉండనున్నాయి. పంచాయతీ పాలన కూడా సజావుగా జరిగే ఆస్కారం ఉంటుంది.
ఉద్యోగుల్లో సంతోషం…
అన్ని పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయడం వంద శాతం పూర్తవడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్, నర్సాపూర్, తూప్రా న్ డివిజన్లకు సంబంధించి ముగ్గురు డీఎల్పీవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. పంచాయతీల నివేదికలను రాష్ట్ర ఆడిట్ శాఖకు పంపించగా ఆమోదం లభించింది.
అక్రమాలకు తావుండదు
ఆన్లైన్ ఆడిట్‌తో గ్రామ పంచాయతీల నిధుల్లో అక్రమాలకు అవకాశం ఉండదు. మెదక్ జిల్లాలోని 526 పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ పూర్తి అయ్యింది. రాష్ట్రంలోనే మెదక్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ఆన్లైన్ ఆడిట్ ప్రక్రియను చేపట్టింది. దీంతో ప్రతి ఏడాది ఆన్లైన్ ఆడిట్ నిర్వహిస్తున్నాం.