ఖలీల్‌వాడి, డిసెంబర్ 20: ఉమ్మడి జిల్లాను గతంలో ఎన్నడూ లేనంతగా చలి వణికిస్తోంది. ఏటా సంక్రాంతి సమయానికి చలి తీవ్రత ఎక్కువగా కనిపించేది. ఈ సారి మాత్రం డిసెంబర్లోనే వణికిస్తున్నది. గత మూడు రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో 11.0 డిగ్రీలు, నిజామాబాద్ 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కప్పేయడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ఉపశమనం పొందేందుకు చలిమంట కాగుతున్నారు.
ఉత్తరాది చల్లగాలుల ప్రభావం..
ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలితీవ్రత పెరిగింది. దీంతో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చల్ల గాలుల ప్రభావం ఉంటున్నది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి పెరుగుతున్నది. ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా రానున్న రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ చేశారు. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
పొద్దెక్కినంకనే పనుల్లోకి..
చలి తీవ్రత రోజువారీ పనులపై ప్రభావం చూపుతున్నది. పాలు, కూరగాయల వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు ఉదయం ఐదు గంటల నుంచే వారి పనులను ప్రారంభిస్తారు. రోడ్లను పొగమంచు కమ్మేయడంతో తెల్లవారుజామునే పనుల్లోకి వెళ్లాల్సినవారు భయపడుతున్నారు. సూర్యోదయం అయ్యాక మంచు పొరలు తొలగిపోవడంతో అప్పుడు తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు. సాయంత్రం పూట చలి పెరగడంతో ప్రజలు త్వరగా ఇండ్లకు చేరుకుంటున్నారు. దీంతో రాత్రిపూట దుకాణాలు త్వరగా మూతపడుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో11.00
ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కామారెడ్డి జిల్లాలో 11.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మరింత గజగజ వణికిస్తున్నది. రోడ్లను దట్టమైన పొగమంచు కమ్మేస్తున్నది. ఉదయమే వ్యవసాయ పనుల్లోకి వెళ్లేవారు తీవ్రమైన చలి ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు.
పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి
చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. శ్యాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. జాగింగ్‌కు వెళ్లేవారు శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచేలా దుస్తులు వేసుకోవాలి. మాస్కులు తప్పని సరిగా ధరించాలి.
-డాక్టర్ జలగం తిరుపతిరావు ఎండీ, జనరల్ ఫిజీషియన్
జాగ్రత్తలు తప్పనిసరి..