
మెదక్, జనవరి 8 : రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాడని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శనివారం మెదక్ జిల్లా కేంద్రమైన రాందాస్ చౌరస్తాలో రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని సంతకం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చి రైతులకు పెట్టుబడి సహాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మెదక్ నియోజకవర్గంలో రూ.466 కోట్లు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
మొండిచేయి చూపిస్తున్న కేంద్రం..
కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో మొండి చేయి చూపిస్తున్నదని, కేంద్రంలో ఒక మాట, గల్లీలో మరో మాట మాట్లాడుతుందని ఎమ్మెల్యే విమర్శించారు. డీజిల్, పెట్రోల్‌తో పాటు సిలిండర్ రేట్లను పెంచి అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు ఏ విషయంలో కూడా కేంద్రం సహకరించలేదని, సంక్షేమ పథకాలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని రైతులకు అందేవిధంగా చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరుశురాంనాయక్, ఏవోలు ప్రవీణ్, శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, టీఆర్ఎస్ పట్ణణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో రూ.54 లక్షలతో నవజాత శిశు కేంద్రం
మెదక్, జనవరి 8 : ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యతనిస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో ఎన్హెచ్ఎం కింద రూ.54 లక్షలతో నిర్మించిన నవజాత శిశు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దవాఖానలను పునరుద్ధరణ చేస్తూ పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. పట్టణ శివారులో నిర్మిస్తున్న ఎంసీహెచ్ దవాఖాన పనులు త్వరలో పూర్తిచేస్తామన్నారు. చిన్న పిల్లలకు పసిరికలు, పుట్టకతో ఏవైనా ఇబ్బందులు వస్తే స్పెషల్ కేర్ తీసుకుంటామన్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో నవజాత శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని హంగులతో డయాగ్నోస్టిక్ హబ్‌తో పాటు డయాలసిస్ కేంద్రం, ఐసీయూను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.