శంషాబాద్ : శంషాబాద్ పరిధిలో ఉన్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోన్న జీఎంఆర్ గ్రూప్‌కు జరిమాన విధించారు. ప్రయాణీకులకు అందించే సేవల్లో లోపాల కారణంగా ఈ ఫైన్‌ను తెలంగాణ వినియోగ దారుల వివాదాల పరిష్కార కమిషన్ విధించింది. వివరాలలోకి వెళితే… సుబ్రతో బెనర్జీ అనే ప్రయాణీకుడు 2014 సెప్టెంబర్ 10న బెంగుళూరు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.
విమానం ఎక్కేందుకు ఎస్కలేటర్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా జర్క్ ఇచ్చి ఆగిపోయింది. దీంతో సుబ్రతోబెనర్జీ కిందపడిపోగా ఎస్కలేటర్ పై ఉన్న ఇతర వ్యక్తులు ఆయనపై పడిపోయారు. ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయన చికిత్స తీసు కుంటూ 75 రోజుల పాటు ఆఫీసుకు వెళ్లలేక పోయారు. ఈ విషయమై ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయిం చాడు . ఎయిర్‌పోర్టులో తనకు కలిగిన అసౌకర్యంపై ఆయన ఫిర్యాదు చేశాడు .
మా తప్పేమి లేదు..
సుబ్రతో ఆరోపణలపై ఎయిర్‌పోర్టు యాజమాన్యం వాదిస్తూ ఎస్కలేటర్ పైకి ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్‌లోడ్ కాగా నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆగిందని తెలిపింది. ఎస్కలేటర్ ఎపుడూ ముందుకే వెళ్లుందే తప్ప వెనకకు రాదని చెప్పింది. సుబ్రతో అజాగ్రత్తగా ఉండడం వల్ల పడిపోయాడని వాదించింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని, గుడ్‌విల్‌గా రూ.1.51 లక్షలు చెల్లించినట్లు వివరించారు.
ఫైన్ చెల్లించండి..
ఎయిర్‌పోర్టు వాదనపై సుబ్రతో విభేధించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత తిరిగి తనకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ఆపరేషన్ జరిగిందని వివరించారు. దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యానంటూ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిషన్ ఎయిర్‌పోర్టు అథారిటీదే తప్పని తేల్చింది. బాధితుడికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. ఈ సంఘటనపై శంషాబాద్ జీఎంఆర్ కమ్యూనికేషన్ వర్గాలను సంప్రదించగా మాకు ఎలాంటి ఆర్డర్స్ అందలేదని తెలిపారు.