
హాస్టల్స్లో శానిటేషన్ నిర్వహణ సక్రమంగా ఉండాలి
ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తులపై దృష్టి
ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవోలు పనితీరు మార్చుకోవాలి
డీఎస్డబ్ల్యూవోలు పర్యవేక్షణ పెంచాలి
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ యోగితారాణా
ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, నల్లగొండ జిల్లాల అధికారులతో సమీక్ష
మామిళ్లగూడెం, నవంబర్23 : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్ యోగితారాణా ఆదేశించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని డీపీఆర్సీ భవనంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం వివరాలను ఆయా వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. భోజనం నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వసతిగృహాల్లో మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకుంటే సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వసతిగృహాల్లో సౌకర్యాలను ప్రజలకు వివరించి విద్యార్థులు సమీప ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చైతన్యం తీసుకురావాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సహాయ ఎస్సీ సంక్షేమాధికారులు (ఏఎస్డబ్ల్యూవోలు) వసతి గృహ సంక్షేమాధికారులు పనితీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలని మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చూడాలన్నారు. వసతిగృహాల నిర్వహణకు ప్రత్యేక నిధులు మంజూరు చేశామన్నారు. శానిటేషన్, విద్యుత్తు, తదితర మరమ్మతులకు అత్యవసర సంక్షేమ నిధి (క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్) మంజూరు చేశామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నిధులు అందుతున్నాయని తెలిపారు. వసతి గృహాల్లో కనీస అసవరాలు గుర్తించి ప్రతి పాదనలు పంపించాలని ఆదేశించారు.
ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై దృష్టిసారించాలి
నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు చేయించడంలో దృష్టిసారించాలని ఆదేశించారు. నాలుగు జిల్లాల్లో సుమారు 35 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో కేవలం 7500 మందికి మాత్రమే ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవోలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువున్న విద్యార్థుల వివరాలను తెలుసుకుని వారి ద్వారా వెంటనే దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. నాలుగు జిల్లాల్లో ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరులో వెనుకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ యోగితారాణాను ఆయా జిల్లాల అధికారులు సన్మానించారు. సమావేశంలో జా యింట్ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, హనుమంతునాయక్, సహాయ డైరెక్టర్ ఉమాదేవి, ఖమ్మం జిల్లా అభివృద్ధి శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ, భద్రాద్రి జిల్లా అధికారి అనసూర్య, సూర్యాపేట జిల్లా అధికారి దయామణి, నల్లగొండ జిల్లా అధికారి సల్మాబాను పాల్గొన్నారు.