నూతనకల్/మద్దిరాల, డిసెంబర్ 9 : రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంలో మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామంలో పంట మార్పిడి విధానంపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. యాసంగిలో కేంద్రం ధాన్యాన్ని తీసుకోని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగుచేయాలన్నారు.వరికి బదులుగా వేరుశనగ, శనగ, మినుములు, పొద్దుతిరుగుడు, పెసర, ఆయిల్‌పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలని చెప్పారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ జమీరుద్దీన్, సర్పంచ్ తీగల కరుణశ్రీగిరిధర్ రెడ్డి, ఏఓ మురళి, సర్పంచ్ దామెర్ల వెంకన్న, ఎంపీడీఓ సరోజ, ఏఓ వెంకటేశ్వర్లు, ఉద్యానవన అధికారి స్రవంతి, కార్యదర్శి మంగమ్మ పాల్గొన్నారు.
ఇతర పంటలు వేయాలి
నడిగూడెం : ఆరుతడి పంటల సాగుతో రైతులు లాభాలు పొందవచ్చని ఏఓ రాజగోపాల్ అన్నారు. మండలంలోని శ్రీరంగాపురం, వేణుగోపాలపురం, వల్లాపురం గ్రామాల్లో ఆరుతడి పంటలపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాటిబండ్ల వెంకటేశ్వరరావు, ఏఈఓలు మౌనిక, రేష్మా, వినోద్ పాల్గొన్నారు.
చిలుకూరు : యాసంగిలో వరికి బదులుగా రైతులు ఇతర పంటలపై మొగ్గు చూపాలని ఏఓ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆరుతడి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడారు వెంకటేశ్వర్లు, ఏఈఓ శిరీష పాల్గొన్నారు.
నాగారం : యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలైన వేరుశనగ, నువ్వులు, మినుములు తదితర పంటలు సాగు చేయాలని ఏఓ గణేశ్ అన్నారు. ఫణిగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. తుంగతుర్తి క్లస్టర్ ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి ఆయిల్‌పామ్ పంటపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ పానుగంటి నర్సింహారెడ్డి, ఏఈఓ రమ్య పాల్గొన్నారు.
ఇతర పంటలపై అవగాహన
చివ్వెంల : రైతులు ఒకే రకమైన పంటల సాగు కాకుండా ఇతర పంటలు సాగువైపు దృష్టి సారించాలని ఏఓ ఆశాకుమారి అన్నారు. మండల కేంద్రంతో పాటు వివిద గ్రామాల్లో రైతులకు ఆరుతడి పంటలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పంట మార్పిడి చేయడం ద్వారా నేల సారవంతంగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జూలకంటి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి రజిని, ఏఈఒలు పాల్గొన్నారు.
డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి : డీఏఓ
పెన్‌పహాడ్ : వరి కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్, జిల్లా ఉద్యాన, సెరికల్చర్ అధికారి శ్రీధర్ సూచించారు. మండలంలోని దూపాడ్లో రైతులకు యాసంగిలో సాగు చేయాల్సిన పంటలపై అవగహన కల్పించారు. ఆరుతడి పంటల సాగుతో ఆశించిన మద్దతు ధర పొంది లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బిట్టు నాగేశ్వర్రావు, ఏఓ కృష్ణసందీప్, ఉద్యాన అధికారి జగన్, ఏఈఓ గోపి పాల్గొన్నారు.